Police Station Rights | సాధారణంగా మన దేశంలో చాలా రాష్ట్రాల్లో పోలీసు అనే పేరు వినగానే చాలా మందిలో ఒక రకమైన టెన్షన్ వస్తుంది. కొందరు దూరం నుంచి పోలీసులను చూస్తున్నా, తమవైపు వస్తున్నారనే భయంతో పారిపోయే వారు కూడా ఉంటారు. అయితే అకస్మాత్తుగా పోలీసులు మీకు చేసి స్టేషన్‌కు రమ్మంటే ఆందోళన చెందకూడదు. కొన్ని ప్రాథమిక రూల్స్ దృష్టిలో ఉంచుకుంటే, పోలీసులు స్టేషన్‌కు పిలిచినా ఎప్పుడూ భయపడరు. తప్పు చేయకపోతే మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. భారతీయ శిక్షాస్మృతి (CrPC) ప్రకారం, పోలీసులు తమకు నచ్చినట్లు ఎవరినీ పీఎస్‌కు పిలిపించలేరు. ఎవరినైనా స్టేషన్‌కు పిలవాలంటే కొన్ని రూల్స్ పాటించాలి.

చట్టం ఏం చెబుతోంది?
ఎలాంటి బలమైన కారణం లేదా రాతపూర్వక నోటీసు లేకుండా ఏ పౌరుడిని కూడా బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు పిలవలేరని మన దేశ చట్టాలు చెబుతున్నాయి. ప్రతి పౌరుడు దేశ చట్టాల గురించి సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల, అనవసరమైన మానసిక ఒత్తిడి ఉండదు. పోలీసులు ఫోన్ చేసి రమ్మన్నా మీరు మిమ్మల్ని కొన్ని రూల్స్ ద్వారా రక్షించుకోవచ్చు.

పోలీసులు పిలిస్తే ఏం చేయాలి?
ఏదైనా కారణంతో మిమ్మల్ని స్టేషన్‌కు పిలిస్తే, కంగారు పడకుండా ఆలోచించాలి. మొదటగా ఫోన్ చేసిన పోలీసు అధికారిని.. మిమ్మల్ని సాక్షిగా పిలుస్తున్నారా లేక నిందితుడిగా పిలుస్తున్నారా అని క్లారిటీ అడగండి. CrPC సెక్షన్ 160 ప్రకారం, ఎవరినైనా స్టేషన్‌కు పిలవాలంటే పోలీసులు ఖచ్చితంగా రాతపూర్వక నోటీసు ఇవ్వాలి. కేవలం ఫోన్ కాల్‌ను చట్టబద్ధంగా పరిగణించలేరు.
పోలీసుల నుంచి మీకు నోటీసు వచ్చినప్పుడు, దానిపై కేసు నంబర్, సంబంధిత అధికారి సంతకం ఉన్నాయో లేదో గమనించాలి.

విచారణ సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) ప్రకారం విచారణ సమయంలో మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని పోలీసులు మిమ్మల్ని బలవంతం చేయలేరు. అంతేకాకుండా, ఏ స్టేట్‌మెంట్ పైన అయినా అది పూర్తిగా చదివి అర్థం చేసుకోకుండా సంతకం చేయవద్దు. విచారణలో పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించండి. కానీ వారు మీతో దుర్మార్గంగా ప్రవర్తిస్తే మాత్రం పై అధికారులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాలి.

చట్టపరమైన సహాయం ఎలా పొందాలి ?
పోలీస్ స్టేషన్‌కు వెళ్లేముందు ఎప్పుడైనా మీ తరపు లాయర్‌తో మాట్లాడటం మంచిది. దీనివల్ల చట్టపరమైన చిక్కులు ఉండవు. నోటీసు లేకుండా పోలీసులు ఒత్తిడి తెస్తే, సంబంధిత DCP లేదా SPకి రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వొచ్చు. ఒకవేళ మీకు సొంతంగా లాయర్ లేకపోతే, జిల్లా చట్టపరమైన సేవల అథారిటీ (DLSA) ద్వారా ఉచితంగా చట్టపరమైన న్యాయ సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది.