Harmanpreet Led India Thump Sri Lanka To Retain Asian Games Gold: ఆసియా గేమ్స్ 2026లో ఇండియా పసిడి కల నెరవేరింది. మహిళల క్రికెట్ ఫైనల్ పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సంపూర్ణ ఆధిపత్యం కనబరిచి దేశానికి ఈ ఎడిషన్‌లో మొట్టమొదటి బంగారు పతకాన్ని అందించింది. మొదట ఆసియా కప్ విజయం, ఇప్పుడు ఆసియా క్రీడల్లో వరుసగా రెండోసారి స్వర్ణం సాధించి ఖండాంతర స్థాయిలో భారత మహిళల జట్టు తిరుగులేని శక్తిగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన తుది సమరంలో శ్రీలంకను ఏకంగా 147 పరుగుల భారీ తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో లంక రజత పతకంతో సరిపెట్టుకోగా, పాకిస్తాన్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. ఆసియా క్రీడల మహిళల క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక జట్టు స్కోరుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. స్మృతి మంధాన (79) టాప్ స్కోర‌ర్ గా నిలిచింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కేవలం15.4 ఓవ‌ర్లలోనే 69 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ చ‌మారి ఆట‌ప‌ట్టు (29) టాప్ స్కోర‌ర్ గా నిలిచింది. దీప్తి శ‌ర్మ మూడు వికెట్ల‌తో అద‌ర‌గొట్టింది.

📸📸 from the Gold Medal match as #TeamIndia secure their biggest victory (by runs) in women's T20Is 🙌👏

Scorecard ▶️ https://t.co/DVlhLBajxB#AsianGames pic.twitter.com/hIOUJIwf1x

— BCCI Women (@BCCIWomen) September 22, 2026

మంధాన రిచా విధ్వంసం.. బోర్డుపై 216 పరుగుల రికార్డు స్కోరు
భారత ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ 99 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి గట్టి పునాది వేశారు. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన లంక బౌలర్లపై విరుచుకుపడుతూ 45 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 22 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 49 పరుగులు బాది ప్రత్యర్థికి ఏమాత్రం ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వలేదు. దీంతో భారత్ భారీ స్కోరు అందుకుంది.

దీప్తి మ్యాజిక్..
217 పరుగుల భారీ కొండంత లక్ష్యంతో ఛేదనకు దిగిన శ్రీలంక జట్టు ఆరంభం నుంచే ఒత్తిడికి తలొగ్గింది. కెప్టెన్ చమరి అటపట్టు సాధించిన 29 పరుగులే ఆ జట్టులో టాప్ స్కోరుగా నిలిచింది. ఆమెతో పాటు మరో ఇద్దరు బ్యాటర్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరును చేరుకోగలిగారు. ఫీల్డింగ్‌లో శ్రేయాంక పాటిల్ చేసిన చిన్న తప్పిదం మినహా మిగిలిన సమయమంతా భారత ఫీల్డర్లు కట్టుదిట్టంగా వ్యవహరించి బౌలర్లకు పూర్తి సహకారాన్ని అందించారు. బోర్డుపై ఉన్న భారీ స్కోరు ఒత్తిడికి లంక బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ఇక భారత స్పిన్ బౌలర్లు పూర్తి స్థాయి ప్రతాపం చూపించారు. సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. లంకను 69 పరుగులకే పరిమితం చేయడంలో ఆమె స్పెల్ మ్యాచ్‌లోనే హైలైట్‌గా నిలిచింది. మిగ‌తా బౌల‌ర్ల‌లో శ్రేయాంక పాటిల్, తెలుగు స్టార్ శ్రీచ‌ర‌ణి, షెఫాలీ వ‌ర్మ ల‌కు త‌లో రెండు వికెట్లు ద‌క్కాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ తమ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుని పసిడి కాంతులతో మెరిసింది.