India vs Pakistan Asia Cup 2025 Final | ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ప్రారంభానికి ముందే వివాదాల్లో చిక్కుకుంది. అందులోనూ భారత్, పాక్ మ్యాచ్ అంటే కొత్త వివాదానికి స్వాగతం పలుకుతున్నట్లే. ఇప్పుడు అందరి దృష్టి సెప్టెంబర్ 28న జరగనున్న భారత్- పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ పైనే ఉంది. ఈ టైటిల్ పోరుకు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త డ్రామాను మొదలుపెట్టింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ చర్యపై కొత్త వివాదం చెలరేగే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 21న సూపర్-4 రౌండ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్‌ (India beats Pakistan)ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ మ్యాచ్‌లో పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ 6-0తో పాటు ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లు సైగ చేశాడు. అదే సమయంలో పాక్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక గన్ సెలబ్రేషన్ చేసి వివాదం రేపాడు. ఈ సంజ్ఞపై భారత క్రికెట్ బోర్డు BCCI హారిస్ రౌఫ్, ఫర్హాన్ లపై ICCకి ఫిర్యాదు చేసింది.

PCB ఛైర్మన్ కొత్త డ్రామా
ఒకవైపు ICC పాక్ పేసర్ హారిస్ రౌఫ్ పై మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించగా, మరోవైపు సాహిబ్‌జాదా ఫర్హాన్ కు వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. పాకిస్తాన్ మీడియా ప్రకారం, హారిస్ రౌఫ్ పై ఎంత జరిమానా విధించినా, PCB ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ స్వయంగా చెల్లిస్తానని చెప్పారు. ఈ నిర్ణయంతో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లు చేసిన సైగలకు తాను పూర్తిగా మద్దతు ఇస్తున్నానని స్పష్టం చేశారు.

అంతకుముందు మొహ్సిన్ నక్వీ దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో స్లో-మో వీడియోను కూడా షేర్ చేశారు, ఇందులో అతను క్రాష్ అయ్యే సంజ్ఞలు చేశాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై కూడా మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది ఐసీసీ. ఎందుకంటే సూర్యకుమార్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ ICCకి ఫిర్యాదు చేసింది, ఇందులో అతను పాకిస్తాన్‌పై సాధించిన విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో అమరులైన వారికి, భారతీయ సైనికులకు అంకితం చేశాడు.

కొత్త మిస్టరీ పోస్ట్ షేర్
PCB ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ ఆసియా కప్ 2025లో భారత్- పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు ఒక మిస్టరీ పోస్ట్ కూడా చేశారు. అందులో ‘మీరు మీ బ్యాలెన్స్ సరి చేయడానికి, కారణాలను వివరించడానికి ఎంత సమయం కావాలి? అని పోస్ట్ చేశాడు. పీసీబీ చైర్మన్ నఖ్వీ ఈ పోస్ట్ ఎందుకు చేశారో అర్థం చేసుకోలేం. కానీ భారత్- పాక్ ఫైనల్ మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు అతను ఉద్దేశపూర్వకంగానే హారిస్ రౌఫ్‌నకు జరిమానా డబ్బులు ఇస్తానని చెప్పడంపై వివాదం చెలరేగింది.

ఆదివారం జరగనున్న ఫైనల్లోనూ పాకిస్తాన్‌ను ఓడించి ఆసియా కప్ ట్రోఫీని సొంతం చేసుకోవాలని సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ ఉవ్విళ్లూరుతోంది. అయితే టోర్నీలో రెండుసార్లు భారత్ చేతిలో దారుణ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. సోనీ లివ్, ఫ్యాన్ కోడ్ యాప్‌, సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు మ్యాచ్ వీక్షించవచ్చు.