Kohli In Full Fitness: ఇంగ్లాండ్ తో తొలి వన్డేలో గెలిచి ఉత్సాహం మీదున్న భారత్ కు గుడ్ న్యూస్. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఆదివారం జరిగే రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడు. తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్లో ఉత్సాహంగా పాల్గొన్న కోహ్లీ.. రెండో వన్డేకు రెడీ అని సంకేతాలు పంపాడు. మరోవైపు ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ కూడా ధ్రువీకరించాడు. రేపటి వన్డేకు ఆడటానికి కోహ్లీ రెడిగానే ఉన్నాడని, ప్రాక్టీస్ సెషన్లో తను సౌకర్యవంతంగా కదిలాడని శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. అయితే కోహ్లీ ఎవరి ప్లేసులో ఆడతాడో తనకు తెలియదని, జట్టు కూర్పు గురించి కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతం గంభీర్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించాడు. మోకాలిలో వాపు కారణంగా తొలి వన్డేకు కోహ్లీ దూరం కావడంతో అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చి, సూపర్ ఫిఫ్టీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కోహ్లీ రాకంతో జట్టుకు సెలెక్షన్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవనున్నాయి. ఎవరిని తీసేసి, కోహ్లిని ఆడిస్తారో కాస్త ప్రశ్నార్థకంగా మారింది.

ఓపెనర్ గా గిల్..!
తొలి వన్డేలో వన్ డౌన్ లో ఆడిన శుభమాన్ గిల్ 87 పరుగులతో సత్తా చాటాడు. అతను స్టార్టింగ్ నుంచి దాదాపు విజయం సాధించేంత వరకు నిలబడటంతో భారత్ సునాయసంగా గెలుపొందింది. సాధారణంగా మూడో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్ కు దిగుతాడు. తొలి వన్డేలో గాయపడటంతో అతని స్థానంలో వచ్చిన గిల్ సత్తా చాటాడు. ఇక అదే మ్యాచ్ లో ఆడిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ విఫలమయ్యాడు. దీంతో అతనిపై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. గిల్ ను ఓపెనింగ్ కు పంపి, మూడో స్థానంలో కోహ్లీ ఆడినట్లయితే శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడు. దీంతో బ్యాటింగ్ ఫర్ఫెక్టుగా ఉండనుంది. రేపటి వన్డేలో టీమిండియా దాదాపు ఇదే బ్యాటింగ్ లైనప్ తో బరిలోకి దిగుతుందని స్పష్టమవుతోంది. అయితే ఆశ్చర్యకర నిర్ణయాలకు కెప్టెన్ రోహిత్ పెట్టింది పేరు. తను కొత్తగా ఆలోచించి, మరేదైనా నిర్ణయం కూడా తీసుకోవచ్చే అవకాశాలను తోసి పుచ్చలేం.

14 వేల రన్స్ మైలురాయికి చేరువలో కోహ్లీ..
ఇటీవల ఫామ్ కోల్పోయి విమర్శల పాలు అవుతున్న కోహ్లీ.. ఈ వన్డే సిరీస్ లో రాణించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈనెల 19 నుంచి ప్రారంభం కాబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగగలడు. ఈ ఫార్మాట్ కు కొట్టిన పిండి. ఎన్నో రికార్డులు తన పేరిట ఉన్నాయి. 50 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా తను బద్దలు కొట్టాడు. మరోసారి అలాంటి ప్రదర్శనే తన నుంచి అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇటీవల ప్రాక్టీస్ కోసం రంజీల్లో ఆడినా పెద్దగా ప్రయోజనం కోహ్లీకి లేకపోయింది. కేవలం ఆరు పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే వన్డేల్ల్లో ఎలా రాణించాలో కోహ్లికి బాగా తెలుసని, తనను వేధిస్తున్న ఔట్ సైడ్ ఆఫ్ బలహీనతకు కూడా అధిగమిస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ ఫార్మాట్లో మరో 94 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 14 వేల పరుగుల మార్కును చేరిన క్రికెటర్ గా కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఇప్పటివరకు కేవలం ఇద్దరు మాత్రమే ఈ ఫార్మాట్లో ఈ మార్కును చేరారు. సచిన్ టెండూల్కర్ (18,456 పరుగులు కెరీర్ రన్స్) 350 ఇన్నింగ్స్ ల్లో, కుమార సంగక్కర (14, 234 పరగులు కెరీర్ రన్స్) 378 ఇన్నింగ్స్ ల్లో ఈ మార్కును చేరకున్నారు. కెరీర్లో 283వ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ అత్యంత వేగంగా ఈ మైలురాయిని రెండో వన్డేలోనే చేరకుంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రెండో వన్డే కటక్ లో జరగుతుంది.

Also Read: Rohit Poor Form: ఆ ఒత్తిడి రోహిత్ పై ఉంది.. అందుకే విఫలమవుతున్నాడు. గాడిలో పడకపోతే..