Kavitha vs Madhavaram Krishna Rao | హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలోని సర్వే నంబర్ 376లో ఉన్న, రూ. 4 వేల కోట్ల విలువైన ఐడీపీఎల్ (IDPL) భూములపై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ భూముల కబ్జా విషయంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరస్పరం ఆరోపణలు చేసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం విలువైన ఐడీపీఎల్ భూముల కబ్జా ఆరోపణలపై సమగ్ర విచారణకు నిర్ణయం తీసుకుంది. కూకట్‌పల్లిలోని రూ. 4 వేల కోట్ల విలువైన ఐడీపీఎల్ (Indian Drugs and Pharmaceuticals Limited) భూములపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే

ప్రభుత్వం నిర్ణయంపై కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. తాను సీఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని ఐడీపీఎల్ భూములపై విచారణ జరిపించాలని కోరారని ట్విస్ట్ ఇచ్చారు. అన్ని ఆధారాలు ప్రభుత్వానికి ఇచ్చానని, తన కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తానన్నారు. ప్రభుత్వ విచారణలోనైనా ఐడీపీఎల్ భూములపై అక్రమాలు, కబ్జాలు చేసింది ఎవరో తేలుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు.

ఐడీపీఎల్‌ భూములు, వాటి నేపథ్యం
ఐడీపీఎల్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒక పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (PSU). ఇది గతంలో దేశంలో ఔషధాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించడం తెలిసిందే. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న ఈ సంస్థకు చెందిన భూములు దశాబ్దాలుగా అనేక వివాదాలకు, కబ్జా ఆరోపణలకు కేంద్రంగా మారాయి. ఈ భూములు మార్కెట్ విలువ పరంగా చాలా విలువైనవిగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడం, కాలక్రమేణా సంస్థ మూతపడటం లేదా బలహీనపడటం వల్ల ఈ ఖాళీ భూములపై కన్నేసి కొందరు కబ్జాలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలోనూ ఈ భూముల విషయంపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ భూముల వాస్తవ పరిస్థితి, కబ్జాలు, అందులో ప్రమేయం ఉన్నవారి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.