Hyundai Creta Electric Price, Range And Features Telugu: మన దేశంలో SUV అనగానే గుర్తొచ్చే పేర్లలో హ్యుందాయ్ క్రెటా ముందుంటుంది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో ఇప్పటికే ఈ కారు భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఎలక్ట్రిక్ క్రెటాకు మాత్రం అదే స్థాయిలో ఆదరణ కనిపించడం లేదు. కానీ, 11,240 కిలోమీటర్ల లాంగ్ టర్మ్ అనుభవం చూస్తే అసలు సమస్య కారులో లేదని స్పష్టమవుతోంది.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లో సౌకర్యాలకు కొదవ లేదు. బోస్ సౌండ్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, ముందు సీట్లకు వెంటిలేషన్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వెనుక ప్రయాణికుల కోసం సన్ బ్లైండ్స్, ఫోల్డ్ అవుట్ టేబుల్స్ కూడా ఉన్నాయి.

స్పేస్‌
కారు లోపల స్థలం మరో ప్రధాన బలం. ముందు సీట్లలోనే కాదు, వెనుక కూడా పెద్దలకు సరిపడా స్థలం ఉంటుంది. కాస్త పొడవుగా ఉన్న వ్యక్తులు సైతం వెనుక సీటులో ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు. సాధారణంగా కొన్ని ఎలక్ట్రిక్ కార్లలో వెనుక సీట్లలో కాళ్లు పైకి లేపి కూర్చోవాల్సి వస్తుంది. క్రెటా ఎలక్ట్రిక్‌లో ఆ సమస్య తక్కువగా ఉంటుంది.

రైడ్ కంఫర్ట్ కూడా ఆకట్టుకుంటుంది. బ్యాటరీ బరువు కారణంగా సస్పెన్షన్‌ను కొంత గట్టిగా సెట్ చేశారు. దీంతో కారు ఎక్కువగా ఊగదు. రోడ్డుపై స్థిరంగా ఉంటుంది. మోషన్ సిక్‌నెస్‌కు ఇబ్బంది పడే ప్రయాణికులకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.

పనితీరు విషయానికి వస్తే 171hp శక్తి, 255Nm టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 8.2 సెకన్లలో అందుకుంటుంది. రోజువారీ కుటుంబ వినియోగానికి ఈ పనితీరు సరిపోతుంది. అయితే స్టీరింగ్ చాలా తేలికగా ఉండటం వల్ల డ్రైవింగ్‌లో ఉత్సాహం కొంత తగ్గుతుంది.

నిజమైన రేంజ్‌
లాంగ్ రేంజ్ వెర్షన్‌లో 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. పరీక్షలో 432 కిలోమీటర్ల రేంజ్ వచ్చింది. కంపెనీ ప్రకటించిన 473 కిలోమీటర్లకు ఇది దగ్గరగా ఉంది. దీర్ఘకాలిక వినియోగంలో 8.1 కిలోమీటర్లు/కిలోవాట్ అవర్ సామర్థ్యం నమోదైంది.

ఇది కూడా చదవండి: రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తున్న Hyundai Creta.. హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ధర వివరాలు

ఛార్జింగ్
ఛార్జింగ్ విషయంలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కీలక మార్పు తీసుకొచ్చింది. అప్‌డేట్‌కు ముందు డీసీ ఛార్జింగ్ వేగం గరిష్ఠంగా 46 కిలోవాట్ల వరకు ఉండేది. సగటు వేగం సుమారు 41 కిలోవాట్లు. అప్‌డేట్ తర్వాత గరిష్ఠ వేగం 72 కిలోవాట్లకు చేరింది. సగటు వేగం కూడా 67 కిలోవాట్లకు పెరిగింది. దీంతో 20 నుంచి 80 శాతం ఛార్జింగ్‌కు సుమారు 30 నిమిషాలు పడుతోంది.

సాఫ్ట్‌వేర్ పరంగా కూడా కారు మంచి అనుభవాన్ని ఇచ్చింది. 11 వేల కిలోమీటర్ల ప్రయాణంలో పెద్ద సమస్యలు ఏవీ ఎదురుకాలేదు. అయితే ప్రాక్సిమిటీ సెన్సార్ ఒకసారి అనవసరంగా శబ్దం చేసింది. డోర్ రిక్వెస్ట్ సెన్సార్ కూడా అప్పుడప్పుడు సరిగా పనిచేయలేదు.

లోపాలు
కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. టెయిల్‌గేట్ బరువుగా ఉండటం వాటిలో ఒకటి. పవర్డ్ టెయిల్‌గేట్ ఉంటే మరింత సౌకర్యంగా ఉండేది. HVAC కోసం ఫిజికల్ బటన్లకు బదులుగా టచ్ కంట్రోల్స్ ఇవ్వడం కూడా అంతగా నచ్చదు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్‌ప్లే లేకపోవడం మరో మైనస్.

ఇది కూడా చదవండి: 7-సీటర్ ఫ్యామిలీ కారు Nissan Gravite ను లోన్‌పై తీసుకోవచ్చు - 5, 6 లేదా 7 ఏళ్ల లోన్‌కు ఇంత EMI చెల్లించాలి!

మొత్తంగా చూస్తే క్రెటా ఎలక్ట్రిక్ ఒక బ్యాలెన్స్‌డ్‌ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఈ రియల్‌ వరల్డ్‌ టెస్ట్‌లో, 11,240 కిలోమీటర్లు పూర్తయ్యే నాటికి నిర్వహణ ఖర్చు సున్నా. పెద్ద లోపాలు కూడా నమోదు కాలేదు. ధర కొంత ఎక్కువగా ఉన్నా, సౌకర్యం, రేంజ్, పనితీరు & నమ్మకమైన వినియోగాన్ని కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.