హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వరుసగా రెండోరోజు వర్షం (Hyderabad Rains) దంచికొడుతోంది. శనివారం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ఆదివారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

జీహెచ్ఎంసీ పరిధిలోని పలు చోట్ల ఉదయం నుంచి వర్షం పడుతోంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, జూబ్లీహిల్, బంజారాహిల్స్, ఫిలింనగర్, పెన్షన్ ఆఫీస్, అబీడ్స్, యూసఫ్‌గూడ, మణికొండ సహా పలు ప్రాంతాల్లో ఆదివారం భారీగా వర్షం కురుస్తోంది. ఖాళీగా ఉండాల్సిన హైదరాబాద్ రోడ్లు వర్షం కారణంగా ఆదివారం ట్రాఫిక్‌ తో నిండిపోయాయి. జీహెచ్ఎంసీ అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అప్రమత్తం అయ్యాయి. నీళ్లు నిలిచిపోతున్న చోట్ల క్లియర్ చేస్తున్నారు.

HyderabadRains ALERT 2 ⚠️⛈️

As mentioned earlier, MODERATE - HEAVY RAINS to continue in North, Central, East HYD in next 1hr, thereafter reduce to LIGHT RAIN. Thereafter break in rains ahead. MORE DOWNPOURS expected again during late afternoon to overnight

Scattered SEVERE…

— Telangana Weatherman (@balaji25_t) October 5, 2025

క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరద ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో అత్యవసరమైతే తప్పా ఇండ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రంగారెడ్డి, వికారాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. దాంతో మూసీ నదికి వరద క్రమంగా పెరుగుతోంది. దీని ప్రభావం హైదరాబాద్, జీహెచ్ఎంసీ ప్రాంతాలపై పడనుంది. మూసీ నుంచి నీటిని విడుదల చేస్తే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలను వరద నీరు ముంచెత్తనుంది. వర్షాలతో వికారాబాద్ జిల్లాలో కోటిపల్లి ప్రాజెక్టు అలుగు పారుతోంది. గొట్టిముక్కల వాగు ప్రవహిస్తుండటంతో గొట్టిముక్కల - నాగారం గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. తెలంగాణ ఊటీగా పిలుచుకునే అనంతగిరి ప్రకృతి అందాలు వీక్షించేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు.