హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.రైలు కిందపడి దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయిపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీషలుగా పోలీసులు గుర్తించారు. ఈ దంపతులు ప్రస్తుతం హైదరాబాద్ హయత్‌నగర్ సమీపంలోని కుంట్లూరులో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

గాంధీ ఆసుపత్రికి మృతదేహాలు - పోలీసుల దర్యాప్తు
ఘట్‌కేసర్ - బీబీనగర్ రైల్వే మార్గంలోని ఎన్‌ఎఫ్‌సీ (NFC) పరిసర ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఇది ప్రమాదమవశాత్తూ జరిగిందా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

లంగర్‌హౌస్‌లో లాడ్జ్ గదిలో యువతి అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌: సిటీలోని లంగర్‌హౌస్ పరిధిలో గల లాడ్జ్ లో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రేణుక (26) అనే యువతి, తన ఫ్రెండ్ ఫారూఖ్‌తో కలిసి హోటల్ గ్రాండ్ లాడ్జ్‌లో రూమ్ బుక్ చేసుకుంది. అయితే, ఆమె హొటల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాను వ్యక్తిగత పనిపై కాసేపు బయటకు వెళ్లి వచ్చేసరికి రేణుక గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఫారూఖ్ లంగర్‌హౌస్ పోలీసులకు సమాచారం అందించాడు.

హత్యేనంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే లంగర్‌హౌస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రేణుక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రేణుకది ఆత్మహత్య కాదని.. ఫారూఖే ఆమెను ప్లాన్ ప్రకారం హత్య చేసి ఆత్మహత్యగా చెబుతున్నాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానితుడైన ఫారూఖ్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రేణుకది హత్యా లేక ఆత్మహత్యా అనే అన్ని కోణాల్లో లంగర్‌హౌస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.