<p>Vijayawada SAAP Office | విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలకు సంబంధించి జిల్లాల అధికారులు సాక్ష్యాలతో వివరణ ఇచ్చినా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల భర్తీపై వివాదం సద్దుమణగలేదు. ఈ క్రమంలో విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికలపై పోటాపోటీ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పలు జిల్లాల నుంచి వైసీపీ కార్యకర్తలతో పాటు మెగా డీఎస్సీ అభ్యర్థులు సైతం శాప్ కార్యాలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎగ్జామ్ నిర్వహించకుండా, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు లేకున్నా నియామకాలు జరిగాయని, ఒకే ఇంట్లో ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చారనివైసీపీ ఆరోపిస్తోంది.</p>
<p>మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైఎస్సార్‌సీపీ (YSRCP) చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, ఆ ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ స్పోర్ట్స్ కోటా టీచర్లు శాప్ కార్యాలయం వద్ద శాంతియుత ర్యాలీకి సిద్ధమయ్యారు. మరొకవైపు, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని, వీటిపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు కూడా శాప్ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు చేరుకుంటున్నారు. </p>
<p>అయితే ఈ రెండు వర్గాల నిరసన కార్యక్రమాలకు పోలీసులు ముందస్తు అనుమతిని నిరాకరించారు. ఆ ప్రాంతంలో సెక్షన్ 30 అమలులో ఉన్నందున ఎలాంటి ధర్నాలు, నిరసనలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ నిరసన తెలిపి తీరుతామని వైఎస్సార్‌సీపీ శ్రేణులు పట్టుబట్టడంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాప్ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.</p>
<p>విజయవాడలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ నేతలకు నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనవద్దని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలకు పోలీసులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.</p>