BP Patients Diet and Lifestyle Changes : అధిక రక్తపోటు అనేది కేవలం మందులతోనే నియంత్రించాల్సిన సమస్య కాదు. మనం తీసుకునే ఆహారం, శరీర బరువు, శారీరక శ్రమ, ఒత్తిడి, నిద్ర వంటి జీవనశైలి అంశాలు కూడా బీపీపై ప్రభావం చూపుతాయని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్లో సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్గా చేస్తోన్న డాక్టర్ దిలీప్ గూడె తెలిపారు. కొందరు మందులు తీసుకోవడం తప్పనిసరి అయినప్పటికీ.. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన జీవనశైలి బీపీని దీర్ఘకాలం నియంత్రణలో ఉంచడంలో కీలకంగా ఉంటాయని సూచించారు. మరి బీపీ ఉన్నవారు డైట్, లైఫ్స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్

ఆహారంలో ఎక్కువగా సోడియం తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే బీపీ ఉన్నవారు టేబుల్ సాల్ట్‌ను తగ్గించడంతో పాటు ఊరగాయలు, అప్పడాలు, ప్యాక్ చేసిన స్నాక్స్(లేస్, కుర్కురే), ఇన్‌స్టంట్ ఫుడ్స్, సాస్‌లు, నిల్వ ఉంచిన మాంసాహారం వంటి వాటిని పరిమితం చేయాలని డాక్టర్ దిలీప్ సూచించారు. ప్యాకెట్ ఫుడ్స్ కొనేటప్పుడు వాటిపై ఉన్న సోడియం పరిమాణాన్ని ఫుడ్ లేబుల్‌లో చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు.

Also Read : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే

"బీపీ పేషెంట్లు వీలైనంత వరకు తాజా పదార్థాలతో ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకోవడం మంచిది. రుచికోసం అదనంగా ఉప్పు వేసే ఆహారాలకు బదులు నిమ్మరసం, వెల్లుల్లి, కొత్తిమీర, ఇతర సుగంధ ద్రవ్యాలు ఉపయోగించి టేస్టీగా ఆహారం తయారు చేసుకోవచ్చు. తక్కువ సోడియం ఉన్న ఆహారం హైబీపీ ఉన్నవారికి మేలు చేస్తుంది. రక్తపోటు అదుపులో ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది."-డాక్టర్ దిలీప్ గూడె, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్

గుండెకు మేలు చేసే ఆహారం

బీపీ నియంత్రణ కోసం DASH (Dietary Approaches to Stop Hypertension) డైట్ ఒక మంచి ఆహార విధానమని చెప్తున్నారు డాక్టర్ దిలీప్ గూడె. ఎందుకంటే వీటిలో కూరగాయలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు, పప్పులు, నట్స్, విత్తనాలు, చేపలు, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తారు. ఉప్పు, అదనపు చక్కెర, సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారాన్ని తగ్గిస్తారు.

Also Read : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే

ఆకుకూరలు, పండ్లు, బీన్స్, సంపూర్ణ ధాన్యాలు వంటి ఫైబర్, పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు కూడా బీపీని అదుపు చేయడంలో సహాయపడవచ్చు. అయితే కిడ్నీ వ్యాధి ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసూకోకూడదని తెలిపారు.

బరువు అదుపులోనే..

అధిక బరువు, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు కొంత బరువు తగ్గినా బీపీ నియంత్రణలో మెరుగుదల కనిపించవచ్చు. అందుకే సరైన ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. కేవలం బరువును మాత్రమే కాకుండా నడుము చుట్టుకొలతను కూడా దృష్టిలో పెట్టుకుని ఫిట్గా మారాలి.

వ్యాయామం

బీపీ ఉన్నవారు శారీరక శ్రమను తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. వేగంగా నడవడం, సైక్లింగ్, ఈత, డ్యాన్స్ వంటి మితమైన తీవ్రత కలిగిన వ్యాయామాలు చేయవచ్చు. వారానికి సుమారు 150 నిమిషాల మితమైన ఏరోబిక్ వ్యాయామం చేయడం, వారంలో కనీసం రెండు రోజులు కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు చేస్తే బీపీ కంట్రోల్ కావచ్చు. ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాయామం ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Also Read : డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?

స్మోకింగ్కి చెక్.. ఆల్కహాల్‌ లిమిట్

స్మోకింగ్ రక్తనాళాలను దెబ్బతీసి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే బీపీ ఉన్నవారు పొగతాగడం పూర్తిగా మానేయడం మంచిది. అలాగే అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆల్కహాల్ తీసుకునేవారు దాన్ని పరిమితం చేయాలి. బీపీ నియంత్రణ కోసం ఆల్కహాల్‌ను తగ్గించడం లేదా మానేయడం మంచిదని సూచించారు డాక్టర్ దిలీప్ గూడె.

ఒత్తిడి తగ్గకుంటే కష్టమే..

ఎక్కువ ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం వంటి అంశాలు జీవనశైలిని ప్రభావితం చేస్తాయని.. కాబట్టి ప్రతిరోజూ తగినంత నిద్రపోవడం అవసరమని డాక్టర్స్ సూచిస్తున్నారు. రిలాక్సేషన్ టెక్నిక్స్, బ్రీతింగ్ వ్యాయామాలు, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం ఒత్తిడిని అదుపులోకి తెచ్చుకోవడంలో హెల్ప్ చేస్తాయి.

వీటిన్నంటినీ ఫాలో అవుతూనే వైద్యులు సూచించిన విధంగా బీపీని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం కూడా ముఖ్యం. ఇప్పటికే మందులు వాడుతున్నవారు వాటిని వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా తీసుకోవాలి. బీపీ తగ్గిందని అనిపించినా స్వయంగా మందుల మోతాదును తగ్గించడం లేదా పూర్తిగా ఆపేయడం అస్సలు మంచికాదని వైద్యులు చెప్తున్నారు.

Also Read : మధుమేహం, బీపీ, గుండె సమస్యలున్నవారికి 5 బెస్ట్ వ్యాయామాలు ఇవే.. నిపుణుల సూచనలతో

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.