H1N1 Flu Prevention at Work : ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లడం.. గంటల తరబడి ఏసీ గదిలో పనిచేయడం.. సహోద్యోగులతో మీటింగ్స్, లంచ్, కాఫీ బ్రేక్స్.. ఇలా చాలామంది రోజులో ఎక్కువ సమయం ఆఫీసులోనే గడిపేస్తున్నారు. అయితే ఇలాంటి మూసివేసిన ప్రదేశాల్లో వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా H1N1 వైరస్ వ్యాప్తి ఈ మధ్యకాలంలో పెరుగుతుందని.. దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

H1N1 వైరస్ అంటే..

H1N1ను సాధారణంగా స్వైన్ ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఇది శ్వాసకోశ వైరస్. దగ్గు, తుమ్ము, మాట్లాడటం వంటి సందర్భాల్లో వెలువడే శ్వాస బిందువులు, గాలిలోని సూక్ష్మ కణాల ద్వారా ఇది వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వైరస్ ఉన్న చేతులతో కళ్లను, ముక్కును లేదా నోటిని తాకడం ద్వారా కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం పెరుగుతుంది.

Also Read : వర్షాల వల్ల జలుబు, దగ్గు వస్తున్నాయా? రోగనిరోధక శక్తి కోసం వీటిని తినమంటోన్న వైద్యులు

ఆఫీసుల్లోనే రిస్క్ ఎందుకు ఎక్కువంటే..

ఈ H1N1 వైరస్ రిస్క్ ఆఫీస్ల్లోనే ఎక్కువ అని వినిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కార్యాలయాల్లో ఒకే గదిలో చాలామంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఓపెన్ వర్క్‌స్పేస్‌లు, మీటింగ్ రూమ్‌లు, లిఫ్టులు, క్యాంటీన్లు వంటి ప్రదేశాల్లో జనసామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. పైగా కిటికీలు మూసి.. నిరంతరం ఏసీ మాత్రమే నడుస్తూ ఉంటుంది. దీంతో తాజా గాలి అనేది లోపలికి రాదు. దీంతో శ్వాసకోశ వైరస్‌లు వ్యాప్తి చెందే అవకాశం పెరుగుతుంది. ఎవరైనా ఉద్యోగి అనారోగ్యంతో ఆఫీసుకు వస్తే.. వారి నుంచి ఇతరులకు ఇన్ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

డెస్క్‌పైనే భోజనం చేయకండి..

చాలామంది పని ఒత్తిడిలో లేదా ఇతర కారణాల వల్ల డెస్క్‌పైనే లంచ్ లేదా స్నాక్స్ తింటుంటారు. భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోకపోతే వైరస్‌లు చేతుల నుంచి ముఖానికి చేరే అవకాశం ఉంటుంది. అందుకే తినే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. అవసరమైనప్పుడు హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించాలి. కీబోర్డ్, మౌస్, ఫోన్, డోర్ హ్యాండిల్స్ వంటి తరచుగా ఉపయోగించే వస్తువులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.

Also Read : డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా దగ్గు, జలుబు మందులు వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు!

H1N1 వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సీజనల్ ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్.. ఫ్లూ నుంచి రక్షణ కల్పించడంలో సహాయపడుతుంది. కాబట్టి ముందుగా వైద్యుడి సలహాతో టీకా తీసుకోండి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నీరసం వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తే.. చిన్న నీరసమే కదా అని ఆఫీసుకు వెళ్లడం మంచిది కాదు. ఎందుకంటే మీ ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుంది. వీలైతే ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి.

బయటి వస్తువులను తాకిన తర్వాత, భోజనం ముందు, ముఖాన్ని తాకే ముందు చేతులను శుభ్రం చేసుకోవడం మంచిది. ఎందుకంటే చేతులకు వైరస్ ఉంటే అది ముక్కు, నోరు లేదా కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఆఫీస్ రూమ్లోని కిటికీలు తెరవడం, వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, తాజా గాలి వచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. దగ్గు, తుమ్ములు ఉంటే మాస్క్ వేసుకోండి. ఆఫీసులో ఉన్నా సరే శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి.

Also Read : థైమ్ వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. జలుబు నుంచి గుండె ఆరోగ్యం వరకు

వైద్య సహాయం..

ఫ్లూ లక్షణాలు తీవ్రంగా ఉన్నా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, అధిక జ్వరం, నీరసం ఎక్కువగా ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి. H1N1 అనేది ఇన్ఫ్లుయెంజా A వైరస్‌లో ఒక రకం. లక్షణాలు కనిపించినప్పుడు స్వయంగా యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు వాడకుండా వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

Also Read : చలికాలంలో వచ్చే వ్యాధులు దూరం చేసే ఇంటి చిట్కాలు.. వీటితో జలుబు, దగ్గు, కీళ్లనొప్పులు దూరం

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.