వాషింగ్టన్: హెచ్‌1బీ వీసాలకు ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. విదేశాలకు చెందిన ప్రొఫెషనల్స్‌కు భారీ ఊరట కలిగిస్తూ అమెరికా ఫెడరల్ కోర్టు సోమవారం నాడు కీలక తీర్పును వెలువరించింది. హెచ్‌1బీ వీసాల కోసం డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన లక్ష డాలర్ల భారీ ఫీజును బోస్టన్‌లోని ఫెడరల్‌ కోర్టు కొట్టేసింది. ఈ నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది.

అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం తెలపకుండా ఇలాంటి భారీ ఫీజులు వసూలు చేయడం చట్ట విరుద్ధమైన పన్ను కిందకే వస్తుందని, అందువల్ల ఇది చెల్లదని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి లియో సొరొకిన్‌ సోమవారం నాడు తన తీర్పులో వెల్లడించారు. కాగా, గత సెప్టెంబరులో ట్రంప్‌ ప్రభుత్వం విదేశీయులకు జారీ చేసే తాత్కాలిక వలస వీసా అయిన హెచ్‌1బీ ప్రక్రియలో ఒక వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుంది. దీని ప్రకారం వీసాకు ఎంపికైన విదేశాలకు చెందిన నిపుణులు లక్ష డాలర్ల ఫీజును చెల్లించాల్సి ఉంటుందని కండీషన్ పెట్టింది. అయితే, ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్‌ బోస్టన్‌ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన జడ్జి, ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు.

విచారణ అనంతరం జడ్జి జస్టిస్ లియో సొరొకిన్ మాట్లాడుతూ.. విదేశీ ప్రొఫెషనల్స్ అమెరికాకు రావడానికి 1 లక్ష డాలర్ల ఫీజు చెల్లించడం కేవలం పెనాల్టీ కాదు, అది ముమ్మాటికీ వారి నుంచి వసూలు చేస్తున్న ట్యాక్స్. అమెరికా పార్లమెంట్ అనుమతి లేకుండా ఇలా పన్నుల విధింపుపై నిర్ణయం తీసుకునే అధికారం దేశ అధ్యక్షుడికి లేదు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని’ స్పష్టం చేస్తూ ఆ హెచ్1బీ వీసా ఫీజును రద్దు చేశారు.