Guntur Viral News: సాధారణంగా పోలీసులకు వచ్చే ఫిర్యాదులు ఎలా ఉంటాయి? దొంగతనాలు, గొడవలు, ఆస్తి వివాదాలు లేదా రోడ్డు ప్రమాదాలు. కానీ గుంటూరు జిల్లాలోని లాలాపేట పోలీస్ స్టేషన్‌కు ఓ వింత ఫిర్యాదు వచ్చింది. కేవలం కజ్జికాయలు పెట్టలేదనే కారణంతో ఒక అల్లుడు ఏకంగా పోలీసులనే ఆశ్రయించాడు. వినడానికి నవ్వు తెప్పించినా ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే?

గుంటూరు లాలాపేట పరిధిలో నివసించే ఒక వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురికీ పెళ్లిళ్లు చేశాడు. పండుగకో, శుభకార్యానికే లేదా మరేదైనా సందర్భానికో తన ముగ్గురు అల్లుళ్లను ఇంటికి ఆహ్వానిస్తుంటారు. ఈ మధ్య కూడా అలానే పిలిచాడు. మామగారి పిలుపు మేరకు ఇంటికి వచ్చారు ముగ్గురు అల్లుళ్లు. ఇంటికి వచ్చిన అల్లుళ్లకు మర్యాదలు చేయడం చేశారు. అందులో భాగంగానే పిండి వంటలు చేయించారు.

అక్కడే అసలు సమస్య మొదలైంది. వచ్చిన ముగ్గురు అల్లుళ్లలో ఇద్దరు తోడల్లుళ్లకు మామగారు ఎంతో ఇష్టంగా కజ్జికాయలు వడ్డించారు. కానీ మూడో అల్లుడికి మాత్రం పట్టించుకోలేదట. అతడికి కజ్జికాయు ఇవ్వకుండా వదిలేశారట. ఆ టైంలో ఆ అల్లుడు అవమానంగా భావించాడు. ఇద్దరు తోడల్లుళ్లకు పెట్టి తనకు ఎందుకు పెట్టలేదని కుమిలిపోయాడు.

డయల్ 100కు ఫిర్యాదు

సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలను కుటుంబ సభ్యులతో చెప్పుకొని సర్దుకుంటారు. కానీ ఆ అల్లుడు మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. తన మామ కావాలనే తనను అవమానించాడని, తాను మూడో అల్లుడిని అయినందునే ఈ వివక్ష చూపించారని భావించాడు. వెంటనే తన జేబులో ఉన్న ఫోన్ తీసి ఏకంగా డయల్‌ 100కు కాల్ చేశాడు. అత్యవసర సేవల కోసం ఉద్దేశించిన డయల్‌ 100 పోలీసులకు తన గోడు వెళ్లబోసుకున్నాడు.

సార్‌... మా మామగారు నా ఇద్దరు తోడల్లుళ్లకు కజ్జికాయలు పెట్టి, నాకు మాత్రం పెట్టలేదు. ఇది నాకు జరిగిన పెద్ద అవమానం. దయచేసి నాకు న్యాయం చేయండి" అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మాట విన్న పోలీసులకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది.

పోలీసుల స్పందన

ఈ వింత ఫిర్యాదు విన్న లాలాపేట పోలీసులు మొదటి ఆశ్చర్యపోయారు. అల్లుడి ఆవేదన చూసి నవ్వుకోవాలో లేకా సీరియస్‌ అవ్వాలో వారికి అర్థం కాలేదు. కానీ ఫిర్యాదు అందింది కాబట్టి స్పందించక తప్పలేదు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ మామగారితో మాట్లాడారు. చిన్న పిల్లల గొడవల్లా ఉన్న వ్యవహారాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అందర్నీ సమానంగా చూడాలంటూ హితవు పలికారు. దీంతో ఆ అల్లుడు శాంతించాడు.