గుండె నిండా గుడి గంటలు నవంబర్ 25 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 November 25th Episode

కార్తీక పౌర్ణమి సందర్భంగా అంతా కలసి గుడికి వెళతారు. కారు పార్కింగ్ చేస్తుండగా..ఓతాగుబోతు 100 రూపాయల కోసం అడుక్కుంటాడు. అది చూసి బాలు నేను చెప్పింది చేస్తే.. నీకు వెయ్యిరూపాయలు ఇస్తానంటాడు. మనోజ్ గురించి మొత్తం చెప్పేసి..వేషం వేసుకుని రమ్మంటాడు. తన పేరు బయటపెట్టొద్దని చెబుతాడు. ఆ తాగుబోతు సరే అని చెప్పి..వేషం మార్చుకుని..వేపకొమ్మలు పట్టుకుని వచ్చి మనోజ్ ని ఉతికి ఆరేస్తాడు. నువ్వు ఎవర్ని మోసం చేశావో తెలుసు...కన్నవాళ్లని మోసం చేశావ్, కట్టుకున్నదాన్ని మోసం చేశావ్..ఈ మధ్య కొత్తగా మరొకర్ని మోసం చేశావ్ చెప్పు అని ఉతికేస్తాడు. తమ బండారం బయటపడుతుందని ప్రభావతి వణికిపోతుంది. నిజం చెబుతానంటూ మనోజ్ చెప్పేలోగా.. ఆ తాగుబోతు భార్య వచ్చి..డబ్బులకోసం వేషం వేసి ఇలా చేస్తున్నావా అంటూ ఉతికి ఆరేసి తీసుకెళ్లిపోతుంది.

మౌనిక గుడికి బయలుదేరుతుంది..అడ్డుకున్న సంజూ నానామాటలు అంటాడు. గుడికి వెళ్లామా..దీపాలు వదిలామా ..ఇంటికి వచ్చామా అన్నట్టుండాలి..కానీ నీ వాళ్లను కలిస్తే మాత్రం ఊరుకోను అంటాడు. ఇంతలో తల్లి వచ్చి క్లాస్ వేయడంతో సంజూ సైలెంట్ గా ఉండిపోతాడు. మౌనిక గుడికి వెళుతుంది. నువ్వు ఎందుకురా టార్చర్ చేస్తున్నావ్..నువ్వు మీనాన్నలా కాకుండా అప్పుడప్పుడు మనిషిలా ప్రవర్తించు అంటుంది. ఇంతలో సంజూ తండ్రి వస్తాడు. నేను చిన్నప్పుడే నేర్పించాను వాడికి అన్నీ.. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదంటాడు. కాఫీ తెస్తాను అని సంజూ తల్లి వెళ్లేలోగా మౌనిక ఏది అని అడుగుతాడు. గుడికి వెళ్లింది నేనే పంపించాను..నేనంటే చాలా భయం.. నా మాట దాటి ఏమీ చేయదు అంటాడు. అవునా నువ్వు భ్రమలో ఉన్నావ్ అంటూ క్లాస్ వేస్తాడు సంజూ తండ్రి. ఇదిగో ఫొటోస్ అంటూ.. వాళ్ల నానమ్మ పుట్టినరోజుకి మౌనిక వెళ్లిన ఫొటోస్ చూపిస్తాడు. షాక్ అవుతుంది సంజూ తల్లి..ఇప్పుడు మౌనిక పని అయిపోయింది అనుకుంటుంది. ఆ రోజు ఎన్నిసార్లు అడిగినా నన్ను మోసం చేస్తావా? ఎన్నిసార్లు అడిగినా గుడికే అని చెప్పావ్ కదా అని ఫైర్ అవుతాడు. ఇప్పుడైనా గుడికే వెళ్లిందా వాళ్లింట్లో వాళ్లని కలిసేందుకు వెళ్లిందా అని నిలదీస్తారు. ఇప్పుడు గుడికే వెళ్లిందని అడ్రస్ చెబుతుంది. వెంటనే బయలుదేరుతాడు సంజూ. అక్కడ వాళ్ల అన్నయ్య కనిపించాలి అప్పుడు చెప్తా అని కోపంగా బయలుదేరుతాడు.

గుడికి వెళ్లిన మౌనికకు తన పుట్టింటివాళ్లంతా కనిపిస్తారు. అంతా కలసి పూజ చేస్తారు..దీపాలు వదులుతారు. ఈ సారి ఎవరికి వాయనం ఇవ్వాలి అనుకుంటున్నాం..ఇంతలో నువ్వు వచ్చావ్.. మా ఇంటి మాహాలక్ష్మి నువ్వే అని ప్రభావతి వాయనం ఇవ్వాలి అనుకుంటుంది. మీనాను పిలిచి తాంబూలం తీసుకురమ్మంటుంది. మౌనికకు ప్రభావతి వాయనం ఇస్తుండగా సంజూ ఎంట్రీ ఇస్తాడు. మౌనికను లాగిపెట్టి కొడతాడు. నన్ను మోసం చేయాలి అనుకుంటున్నావా? నాకు తెలియకుండా నన్ను కొట్టినవాళ్లను కలుస్తావా? మొన్న కూడా నాతో గుడికి అని చెప్పి బామ్మ పుట్టినరోజు ఫంక్షన్ కి వచ్చింది? ఎందుకు నన్ను మోసం చేస్తోంది? నాతో ఎందుకు అబద్ధాలు చెబుతోంది? అని నిలదీస్తాడు. ఇంటికి వచ్చాక అయినా నిజం చెప్పొచ్చుకదా..అయినా గుడి పేరు చాలాసార్లు బయటకు వస్తోంది..మీ ఇంటికే వస్తోందా ఇంకా ఎవరి ఇంటికైనా వెళుతోందా? అంటాడు సంజూ. అంతా షాక్ అవుతారు..