GST Reduction Effect On Two-wheelers India: మన దేశవ్యాప్తంగా, కొత్త GST స్లాబులు ఈ రోజు (సెప్టెంబర్ 22, 2025) నుంచి అమల్లోకి వచ్చాయి. 350 సీసీ లోపు ఇంజిన్‌ ఉన్న బైకులు 28% GST పరిధి నుంచి 18% GST పరిధిలోకి మారాయి. దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, 18% GST శ్లాబ్‌ ప్రకారం, తన ద్విచక్ర వాహనాలపై రూ. 15,743 వరకు ధర తగ్గింపును ప్రకటించింది. ఈ కంపెనీ అందిస్తున్న చవకైన బైక్ Hero HF Deluxe బైకు రేటు ఇప్పుడు రూ. 5,805 తగ్గింది. తత్ఫలితంగా, ఈ బైక్ ధర ఇప్పుడు రూ. 54,933 నుంచి ప్రారంభం అవుతుంది. తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు ఇది పెద్ద శుభవార్తగా మారింది.

హీరో బైక్‌లు చవక

తెలుగు రాష్ట్రాల్లో, హీరో HF డీలక్స్ ధర నిన్నటి వరకు రూ. 60,738 గా ఉండేది, ఈ రోజు నుంచి 10% జీఎస్టీ తగ్గింపుతో ఈ బండిని రూ. 54,933 ఎక్స్‌-షోరూమ్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు.

హీరో కంపెనీ, తన బెస్ట్ సెల్లింగ్ బైక్ Hero Splendor Plus ధరను రూ. 6,820 తగ్గించింది. ఈ బైక్ ప్రారంభ ధర ఇప్పుడు రూ. 80,166 నుంచి రూ. 73,346 కు తగ్గింది.

కోతను ప్రకటించిన బజాజ్ ఆటో

బజాజ్ ఆటో, తన ద్విచక్ర వాహనాలపై రూ. 20,000 వరకు ఆకర్షణీయమైన తగ్గింపులు ప్రకటించింది.

ఈ బ్రాండ్‌లోని అత్యంత చవకైన బైక్ అయిన Bajaj CT 110X ధర ఇప్పుడు రూ. 6,500 తగ్గింది. దీంతో, ఈ టూవీలర్‌ ప్రారంభ ధర రూ. 67,561 నుంచి ఇప్పుడు రూ. 61,000 కు దిగి వచ్చింది.

Bajaj Pulsar EV కూడా దాదాపు రూ. 8,000 ప్రైస్‌ డిస్కౌంట్‌ పొందింది, దీంతో ఈ బైక్ ఇప్పుడు మరింత పోటీ ధరలో లభిస్తోంది.

యమహా మోటార్స్ జీఎస్టీ ఆఫర్‌

జీఎస్‌టీ 2.0 కారణంగా, యమహా మోటార్స్‌ కూడా తన టూవీలర్ల ధరలను కాస్త నేల వరకు దించింది.

స్కూటర్లు & బైకులకు ఈ కంపెనీ రూ. 17,581 ధర తగ్గింపును ప్రకటించింది. కొన్ని మోడళ్లపై బీమా ప్రయోజనాలను యమహా మోటార్స్‌ అందిస్తోంది.

స్పోర్ట్స్‌ బైక్ అభిమానులకు యమహా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ బ్రాండ్‌లోని పాపులర్‌ స్పోర్ట్స్ బైక్ Yamaha R15 ధరను ఈ రోజు నుంచి రూ. 15,761 తగ్గింది, ఇప్పుడు ఈ బండి ధర రూ. 1.74 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారులకు లాభం

హైదరాబాద్‌, విజయవాడ సహా అన్ని తెలుగు నగరాలు, పట్టణాల్లో ఈ తగ్గింపులు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. బైక్ కొనాలని ప్లాన్‌ చేస్తున్న యువతకు ఇది మంచి అవకాశంగా మారింది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్‌ బైక్‌ల ధరలు 55 వేలు నుంచి ప్రారంభం కావడం వల్ల బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఆప్షన్‌లు పెరిగాయి.

జీఎస్టీ తగ్గింపు వల్ల బైక్ మార్కెట్‌లో మళ్లీ ఉత్సాహం పెరగనుంది. హీరో, బజాజ్, యమహా మాత్రమే కాకుండా హోండా, టీవీఎస్ వంటి కంపెనీలు కూడా ధరలను సవరించాయి. కాబట్టి, ఈ పండుగ సీజన్‌లో తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు బైక్ కొనుగోలు మరింత లాభదాయకం కానుంది.