Gongura Pickle with Sesame Seeds Recipe : తెలుగు రాష్ట్రాల్లో గోంగూర పచ్చడికి ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని గోంగూర పచ్చడి కలిపి తింటే ఆ రుచే వేరు. రెగ్యులర్ గోంగూర పచ్చడే కాదు.. నువ్వులు వేసి చేసే గోంగూర నిల్వ పచ్చడి కూడా మంచి రుచిని అందిస్తుంది. సరైన పద్ధతిలో, సరైన మోతాదులో పదార్థాలు తీసుకుంటే టేస్టీగా వస్తుంది. మరి నువ్వులతో గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు

గోంగూర - 4 కప్పులు

ఎండు మిరపకాయలు - 12

నువ్వులు - అర కప్పు

ధనియాలు - 1 టేబుల్ స్పూన్

మెంతులు - అర టీస్పూన్

ఆవాలు - 1 టీస్పూన్

జీలకర్ర - 1 టీస్పూన్

వెల్లుల్లి రెబ్బలు - 10

ఉప్పు - తగినంత

పసుపు - పావు టీస్పూన్

నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు

Also Read : క్వినోవా కిచిడీ ఇలా చేసుకోండి.. రుచితో పాటు ఆరోగ్యానికి ప్రయోజనాలు ఇచ్చే రెసిపీ ఇదే

తాలింపు కోసం

నువ్వుల నూనె - 1 టేబుల్ స్పూన్లు

ఆవాలు - 1 టీస్పూన్

మినప్పప్పు - 1 టీస్పూన్

శనగపప్పు - 1 టీస్పూన్

ఎండు మిరపకాయలు - 2

ఇంగువ - చిటికెడు

కరివేపాకు - కొద్దిగా

Also Read : నోరూరించే పాలకూర పప్పు రెసిపీ.. కుక్కర్లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది

తయారీ విధానం

ముందుగా గోంగూర ఆకులను కాడల నుంచి వేరు చేసి శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత నీరు పూర్తిగా ఆరిపోయేలా ఒక గుడ్డపై లేదా ప్లేట్‌లో పరిచి ఆరబెట్టాలి. నిల్వ పచ్చడి కాబట్టి ఆకుల్లో తేమ ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అవి తేమ పోయే లోపు స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టాలి. దానిలో నువ్వులు వేసి చిన్న మంటపై మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. నువ్వులు రంగు మారకుండా జాగ్రత్తగా వేయించి పక్కన పెట్టాలి.

అదే పాన్‌లో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిరపకాయలను విడివిడిగా లేదా కలిపి వేయించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొద్దిగా బరకగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా నువ్వుల నూనె వేసి గోంగూర ఆకులను వేయాలి. ఆకులు మెత్తగా మారి వాటిలోని తేమ పూర్తిగా ఆవిరయ్యే వరకు మీడియం మంటపై వేయించాలి. గోంగూర రంగు కొద్దిగా మారి.. మిశ్రమం దగ్గరగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.

Also Read : పల్లీలతో బెండకాయ ఫ్రై.. జిగురు తగ్గి టేస్టీగా ఉండాలంటే ఇలా చేసుకోండి, రెసిపీ ఇదే

వేయించిన గోంగూరను పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్‌లో గోంగూర, వేయించిన నువ్వులు, మిరపకాయల పొడి, ఉప్పు, పసుపు, వెల్లుల్లి వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నువ్వుల నూనె వేసుకోవచ్చు. ఇప్పుడు పాన్‌ స్టౌవ్పై పెట్టి నువ్వుల నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేయాలి. అవి వేగిన తర్వాత ఎండు మిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. ఈ తాలింపును గోంగూర పచ్చడిలో వేసి బాగా కలపాలి. అంతే టేస్టీ టేస్టీ గోంగూర నువ్వుల పచ్చడి రెడీ.

పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత తేమ లేని, శుభ్రమైన గాజు సీసాలో వేసుకోవాలి. పైభాగంలో కొద్దిగా నువ్వుల నూనె పోసి మూత గట్టిగా పెట్టాలి. అలాగే పచ్చడి తీసుకునేటప్పుడు ఎప్పుడూ శుభ్రమైన, పొడి చెంచానే ఉపయోగించాలి. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ నువ్వుల గోంగూర పచ్చడిని కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. దోశ, ఇడ్లీ, పెరుగు అన్నంతో కూడా ఈ పచ్చడి రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి.

Also Read : గుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ.. అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది