Head Coach Details Selection Dilemmas And Backs Shreyas Iyer: భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బయటకు ఎంతో దృఢంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిలా కనిపించినా, జట్టు ఎంపిక సమయంలో అతడికీ తీవ్ర మానసిక ఒత్తిడి తప్పదని స్వయంగా వెల్లడించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కోసం సంజూ శాంసన్‌ను పక్కన పెట్టడం తన కోచింగ్ ప్రయాణంలోనే అత్యంత కఠినమైన నిర్ణయమని తెలిపాడు. "రెండేళ్ల నా కోచింగ్ కెరీర్‌లో నిద్రపట్టని ఏకైక రాత్రి అదే. టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచిన ఆటగాడిని కేవలం మూడు నాలుగు మ్యాచ్‌ల వైఫల్యం తర్వాత తప్పించడం అంత తేలిక కాదు. ఈ విషయాన్ని నేను సంజూకు నేరుగా చెప్పాను. వైభవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం, టాప్ ఆర్డర్‌లో మెరుగైన ఆరంభం అవసరం కావడం వల్ల ఆ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సంజూతో చాలా నిజాయతీగా మాట్లాడాను, అతడు కూడా దాన్ని సానుకూలంగా స్వీకరించాడు" అని వెస్టిండీస్ హోమ్ సిరీస్‌కు ముందు మాట్లాడుతూ గంభీర్ వివరించాడు.

Read Also: IPL Auction Shift: విదేశీ వేదికలకు గుడ్‌బై చెప్పిన‌ బీసీసీఐ.. ఆ స్టేట్ లో డిసెంబర్‌లో ఐపీఎల్ మినీ వేలం..

సోషల్ మీడియా మాటలతో టీమ్ సెలెక్షన్ ఉండదు..
డ్రెస్సింగ్ రూమ్‌లో సెక్యూరిటీ ఫీలింగ్ ను కాపాడటం చాలా ముఖ్యమని గంభీర్ పేర్కొన్నాడు. "సోషల్ మీడియా లేదా బయట వినిపించే శబ్దాలు తుది జట్టును నిర్ణయించవు. కోచ్, కెప్టెన్ ఇద్దరూ కలిసి ఏ జట్టు మ్యాచ్‌ను గెలిపిస్తుందో నిర్ణయిస్తారు. ప్రజాదరణ పొందే నిర్ణయాలు తీసుకోవడం చాలా సులువు, కానీ సరైన నిర్ణయాలు తీసుకోవడమే కఠినం. రెండేళ్లుగా నిరూపించుకున్న ఆటగాళ్లను మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యారని తీసేసి, ఫామ్‌లో ఉన్న కొత్త కుర్రాడిని ఆడించడం భావ్యం కాదు. వైభవ్ చాలా టాలెంటెడ్ ప్లేయర్, అయితే సీనియర్లు రాణిస్తున్నప్పుడు యువ ఆటగాళ్లు తమ సమయం వచ్చేవరకు ఓపిక పట్టాల్సిందే. సంజూ, అభిషేక్‌లకు మద్దతుగా నిలవడమే మేము తీసుకున్న సరైన నిర్ణయం" అని త‌న స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Read Also: Dhoni Masterstroke Move: ధోని ప్లాన్‌తోనే సీఎస్కే కోచ్‌గా జహీర్ ఎంట్రీ.. ఫ్లెమింగ్ స్థానంలో బాధ్యతలు, మహీ ఫ్యూచర్‌పై కాశీ విశ్వనాథన్ క్లారిటీ

శ్రేయస్ నిస్వార్థ సారథ్యం..
టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వ లక్షణాలను గంభీర్ కొనియాడాడు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ తరఫున మెంటార్, కెప్టెన్‌గా కలిసి పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నాడు. "శ్రేయస్‌లో నాకు బాగా నచ్చిన విషయం అతడి నిస్వార్థ గుణం. జట్టు అవసరాల కోసం, లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం నాలుగో స్థానాన్ని వదులుకోవడానికి కూడా అతడు సిద్ధపడేవాడు. ప్రధాన బ్యాటర్‌గా ఉండి తన బ్యాటింగ్ పొజిషన్‌ను త్యాగం చేయడం అరుదైన విషయం. ఎంత కష్టపడినా, క్రమశిక్షణ ఉన్నా నిస్వార్థం లేకపోతే ఏ నాయకుడూ గొప్పవాడు కాలేడు. శ్రేయస్ వద్ద ఆ అత్యుత్తమ నాయకత్వ లక్షణం ఉంది" అని కొనియాడాడు.

మూడేళ్లలో రెండు ప్రపంచకప్‌లు.. తొందరపాటు నిర్ణయాలు వద్దు
ఒకటి రెండు పరాజయాలు రాగానే జట్టుపై విమర్శలు చేయడం సరికాదని గంభీర్ పేర్కొన్నాడు. ఏ జట్టు కూడా వరుసగా ప్రపంచకప్‌లలో ఓటమి లేకుండా గెలవలేదని, రెండో టైటిల్ కొట్టడానికి గతంలో 17 ఏళ్లు పడితే ఈ తరం 17 నెలల్లోనే మూడో ట్రోఫీ గెలిచిందని గుర్తుచేశాడు. స్వల్ప వైఫల్యాల ఆధారంగా జట్టును అంచనా వేయలేమని వివరించాడు.