Hyderabad It Employees Traffic Diversions Gachibowli: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ప్రయాణించే వాహనదారులకు, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. గచ్చిబౌలి IIIT జంక్షన్ వద్ద ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్టీ-లెవల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నిర్మాణ పనుల వేగాన్ని మరింత పెంచేందుకు వీలుగా.. DLF గేట్ నంబర్ 1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రోడ్డు మార్గాన్ని జూలై 1, 2026 నుంచి పూర్తిగా మూసివేయనున్నారు. ఈ రోడ్డు బ్లాకేడ్ రాబోయే మూడు నెలల పాటు అమల్లో ఉంటుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

IIIT జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి కావడానికి కనీసం ఒక ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రస్తుతం కీలకమైన పిల్లర్ల నిర్మాణం , గార్డర్ల అమరిక పనుల కోసం జూలై 1 నుంచి 90 రోజుల పాటు అత్యవసరంగా ఈ రోడ్డును మూసివేయాల్సి వస్తోంది. పనులు సాగుతున్న కొద్దీ స్థలాన్ని బట్టి ఈ మార్గాన్ని అప్పుడప్పుడు పాక్షికంగా తెరిచే అవకాశం ఉన్నప్పటికీ, ట్రాఫిక్ జామ్‌ల బారిన పడకుండా ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఐటీ ఉద్యోగులను కోరారు. ఈ 90 రోజుల పాటు గచ్చిబౌలి పరిసరాల్లో తీవ్ర రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణ సమయాన్ని ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

ఈ మార్గంలో ఉండే ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉద్యోగుల సౌకర్యార్థం పోలీసులు కీలక మినహాయింపు ఇచ్చారు. నాన్-ఎస్‌ఈజెడ్ గేట్ ద్వారా రాకపోకలు సాగించే టీసీఎస్ ఉద్యోగులు తమ రెగ్యులర్ గేట్ నుంచే యథావిధిగా లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి అనుమతినిచ్చారు.

రోడ్డు మూసివేత కారణం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల మళ్లింపునకు సంబంధించి స్పష్టమైన గైడ్‌లైన్స్ ప్రకటించారు. మొదటి రూట్ ప్రకారం.. రాడిసన్ హోటల్ వైపు నుండి DLF మీదుగా IIIT జంక్షన్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కేవలం DLF గేట్ నంబర్ 1 వరకే అనుమతిస్తారు. అక్కడ నుంచి వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లి.. అక్కడ కుడి మలుపు తీసుకుని ఇందిరానగర్ మీదుగా IIIT జంక్షన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ఐటీ కారిడార్‌లోకి వెళ్లే ప్రధాన వాహన ప్రవాహం దీనిపైనే ఆధారపడి ఉంటుంది.

రెండో ప్రధాన డైవర్షన్ లెక్క ప్రకారం.. లింగంపల్లి వైపు నుంచి వచ్చి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీదుగా DLF బిల్డింగ్ లేదా రాడిసన్ హోటల్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్ వద్దే మళ్లిస్తారు. ఈ వాహనాలు IIIT జంక్షన్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్ చేరుకుని.. అక్కడ ఎడమ మలుపు తీసుకుని రాడిసన్ జంక్షన్ మీదుగా తిరిగి ఎడమ మలుపు తీసుకుని DLF రోడ్డుకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఐటీ హబ్‌లో ప్రయాణం సురక్షితంగా, సాఫీగా సాగడానికి వాహనదారులు, ఐటీ కంపెనీల ప్రతినిధులు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.