మెయినాబాద్: హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫాంహౌస్ లలో పార్టీ కల్చర్ పెరుగుతోంది. మొన్నటివరకూ వీకెండ్ వచ్చిందంటే చాలు ఎక్కడో చోట ఫాంహౌస్‌లో పర్మిషన్ లేకుండా పార్టీలు జరిపేవారు. పోలీసులు ఆకస్మిక దాడులు చేసి వారిని అరెస్ట్ చేసేశారు. తాజాగా మొయినాబాద్‌లోని 'ది పెండెంట్' ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా వైసీపీ నేత మద్యం పార్టీ నిర్వహించడం కలకలం రేపుతోంది. ఈ పార్టీలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, ఆయన భార్య మాధురి పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

మాధురి పుట్టినరోజు సందర్భంగా గురువారం మొయినాబాద్ లోని ఫామ్‌హౌస్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి లిక్కర్ పార్టీ నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. ఈ మందు పార్టీలో అనుమతి లేకుండా మద్యం వినియోగించారు. దీనిపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు పెండెంట్ ఫామ్‌హౌస్‌పై గురువారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు.

పోలీసుల దాడుల్లో అక్కడి నుంచి మద్యం బాటిళ్లతో పాటు హుక్కాను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అనుమతి లేకుండా మద్యం పార్టీలో పాల్గొన్న దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి సహా పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్వాహకులు ఎవరు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

పెండెంట్ ఫామ్‌హౌస్‌ పార్టీపై పోలీసుల కేసు నమోదు
మొయినాబాద్‌లోని 'ది పెండెంట్' ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు పార్టీ ఆర్గనైజర్ పార్థసారథి మరియు ఫామ్‌హౌస్ ఓనర్ సుభాష్ లపై కేసులు నమోదు చేశారు.

పోలీసులు ఎక్సైజ్ చట్టంలోని 223 మరియు 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు నిర్వహించిన దాడుల్లో దువ్వాడ మాధురి, శ్రీనివాస్‌తో కలిపి మొత్తం 29 మంది పార్టీలో ఉన్నట్లు గుర్తించారు. అలాగే, అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఈ పార్టీ నుంచి పోలీసులు 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించినందుకు రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు ఈ రైడ్ నిర్వహించారు.