<p>West Godavari Crime News | యలమంచిలి: మరో కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఇటీవల ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరి నదిలోకి దూకారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి వద్ద ఓ కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది.</p>
<p>కుటుంబం గోదావరి నదిలోకి దూకినట్లు గమనించిన వెంటనే అక్కడే ఉన్న జాలర్లు వివాహితను కాపాడారు. ఆమె భర్తతో పాటు ఇద్దరు పిల్లల కోసం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఆర్థిక సమస్యలతో కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. </p>