Escalator Safety Alert : మాల్స్, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు ఇలా ఎక్కడ చూసినా ఎస్కలేటర్లు కనిపిస్తాయి. రోజూ వేలాది మంది వాటిపై ప్రయాణిస్తారు. కానీ ఎస్కలేటర్ అంచున అడుగు భాగంలో ఉండే బ్రష్‌ లైన్ చూశారా? కచ్చితంగా చూసే ఉంటారు. ఎందుకంటే చాలా మంది వాటిని షూ క్లీనర్లుగా వాడేసుకుంటారు. కానీ అవి షూ క్లీనర్స్ కాదు. వాటికి దూరంగా ఉంటే ప్రాణాలు కాపాడుతాయి.. లేదు షూ క్లీన్ చేసుకుంటామంటూ ఆటలు ఆడితే.. ప్రాణాల మీదకి ప్రమాదం తెచ్చిపెడతాయి.

అసలు ఆ బ్రష్‌లు ఏంటి?

ఎస్కలేటర్ అడుగుభాగంలో ఉండే బ్రష్‌లను స్కర్ట్ డిఫ్లెక్టర్స్ (Skirt Deflectors) అంటారు. ఇవి ఎస్కలేటర్ సైడ్ ప్యానెల్కు అమర్చి ఉంటాయి.

వీటి పని ఏంటంటే..

బట్టలు, షూ లేసులు, స్కార్ఫ్‌లు లేదా బ్యాగ్ స్ట్రాప్‌లు ఎస్కలేటర్ సైడ్ ప్యానెల్, మూవింగ్ స్టెప్ మధ్యలో చిక్కుకోకుండా నిరోధించేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి. అయితే మీరు ఆ బ్రష్‌లకు దగ్గరగా వెళ్లినప్పుడు లేదా తగిలినప్పుడు వెంటనే మీరు అలెర్ట్ అవ్వాలి. లేదంటే.. మీ డ్రెస్, షూ లేస్ ఒక్కసారి లోపలికి వెళ్తే అది చాలా వేగంగా లాగుతుంది. ఇలా జరిగితే మీ వేళ్లు, కాళ్లు, చేతులు తీవ్రంగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.

షూ క్లీనర్లు

చాలా మంది పిల్లలు, పెద్దలు వీటిని షూ క్లీనర్లుగా ఉపయోగిస్తారు. పైకి వెళ్లేప్పుడు, కిందకి వెళ్లేప్పుడు ఈ బ్రష్‌లపై షూ రుద్దుతారు. అలా చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే.. షూ లేస్ లేదా చెప్పు అంచు బ్రష్‌ల్లో చిక్కుకుంటుంది. అలా జరిగితే ఎస్కలేటర్ మూవింగ్ పార్ట్స్ వెంటనే దాన్ని లోపలికి లాగుతాయి. పిల్లల చిన్న వేళ్లు లేదా కాళ్లు కూడా సులభంగా ఆ గ్యాప్‌లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అలెర్ట్గా లేకుంటే ఒక్క సెకండ్‌లో తీవ్రమైన గాయాలు, ఎముకలు విరగడం, కొన్నిసార్లు వేళ్లు తెగిపోవడం జరుగుతుంది.

ఎస్కలేటర్ ప్రమాదాలు జరగకుండా..

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది ఎస్కలేటర్ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో చాలా వరకు ఈ బ్రష్‌ల గురించి తెలియకపోవడం వల్లే జరుగుతున్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందుకే ఎస్కలేటర్‌పై వెళ్లేప్పుడు సురక్షితంగా ఉండటానికి కొన్ని నియమాలు ఫాలో అవ్వాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎస్కలేటర్ మీద వెళ్లేప్పుడు హ్యాండ్‌రెయిల్ గట్టిగా పట్టుకోండి. మధ్యలో ఉంటే మంచిది. మరీ సైడ్లకు వెళ్లకండి. పిల్లలను మీకు దగ్గరగా పట్టుకోండి. ఎస్కలేటర్ దిగే ముందే సిద్ధంగా ఉండండి. లేదంటే ఎండింగ్లో మీ షూ లేదా చెప్పు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అలాగే బ్రష్‌లపై షూతో రుద్దకండి. షూ లేసులు సరిగా కట్టుకోకుండా ఎక్కకండి. స్కర్ట్‌లు, లూజ్ బట్టలు, లాంగ్ స్కార్ఫ్‌లు ఉంటే మరింత జాగ్రత్తగా ఎక్కాలి. ఫోన్ చూస్తూ ఎక్కకపోతే మంచిది. పిల్లలను ఒంటరిగా ఎస్కలేటర్ ఎక్కించకండి.