EPFO WhatsApp services: ఈపీఎఫ్ఓ తమ సబ్‌స్క్రైబర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై వాట్సాప్‌లోనూ ఈపీఎఫ్ఓ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈపీఎఫ్‌ఓ 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఈ కొత్త సేవలను అధికారికంగా ప్రకటించారు. డిజిటల్ సేవలను మరింత విస్తరింపజేసేలా వాట్సాప్ చాట్‌బాట్ సేవలతో పాటు, ఇనాక్టివ్ ఖాతాల కోసం ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ విధానాన్ని ప్రారంభించారు.

వాట్సాప్‌ ద్వారా ఈపీఎఫ్‌ఓ సేవలు

ఇకపై పీఎఫ్‌ చందాదారులు తమ మొబైల్‌లో 8796441800 నెంబర్ సేవ్ చేసుకుని, వాట్సాప్ ద్వారా ఆ నెంబరుకు 'Hi' లేదా 'Hello' అని మెసేజ్ చేస్తే సరిపోతుంది. వెంటనే ఈపీఎఫ్‌ఓ చాట్‌బాట్ స్పందించి, వివిధ రకాల ఆప్షన్లను చూపిస్తుంది. ఈ సేవలను మరింత సులభంగా పొందడానికి, పీఎఫ్‌ అకౌంట్‌కు లింక్ చేసిన మొబైల్ నెంబర్ నుంచే వాట్సాప్ చాట్ చేయడం బెస్ట్ ఆప్షన్.

వాట్సాప్‌లో సేవలు

పీఎఫ్‌ బ్యాలెన్స్ చెక్ చేయడం

పీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం

లాస్ట్ 5 లావాదేవీల చెక్ చేయడం

ఆటోమేటిక్ సెటిల్‌మెంట్‌

చాలా కాలంగా వాడుకలో లేని పీఎఫ్‌ ఖాతాల కోసం ఈపీఎఫ్‌ఓ సరికొత్త ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఆధార్‌తో వెరిఫికేషన్ అయ్యి, వాడకంలో లేని రూ.1,000 వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలకు ఇది వర్తిస్తుంది. ఈ తక్కువ మొత్తాన్ని విత్‌డ్రా చేయడానికి చందాదారులు ఎటువంటి ప్రత్యేక క్లెయిమ్‌లు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తింపు, బ్యాంక్ ఖాతా ధ్రువీకరణ పూర్తయిన తర్వాత, ఈపీఎఫ్‌ఓ సంస్థే స్వయంగా ఆ డబ్బును లబ్ధిదారుల ఖాతాకు జమ చేస్తుంది. దీనివల్ల సుమారు లక్ష ఖాతాల్లో నిరుపయోగంగా ఉన్న రూ.5 కోట్ల నిధులు నేరుగా లబ్ధిదారులకు చేరనున్నాయి.

దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా సభ్యులు ఈపీఎఫ్‌ఓలో రూ.32 లక్షల కోట్లను దాచుకున్నారు. చందాదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి మన్సుఖ్‌ మాండవీయ వెల్లడించారు.

వాట్సాప్ చాట్‌బాట్ సేవలను వినియోగించుకునే సమయంలో యూనివర్సల్ అకౌంట్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు యాక్టివ్‌గా ఉండటం ముఖ్యం. ఒకవేళ మీ మొబైల్ నంబర్ పీఎఫ్ ఖాతాకు లింక్ అయి ఉండకపోతే, ముందుగా అధికారిక ఈపీఎఫ్‌ఓ పోర్టల్ ద్వారా నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. వాట్సాప్‌తో పాటు పీఎఫ్ సేవలు పొందడానికి ఉమంగ్ యాప్, ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్, టోల్-ఫ్రీ నంబర్ల సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి.