Elephant Attack On Chennai Tourist: కొడగు జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన దుబారే ఏనుగుల శిబిరంలో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడపడానికి కుటుంబంతో కలిసి వచ్చిన ఒక పర్యాటకురాలు, దసరా ఏనుగు కంజన్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా పర్యాటక ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. కర్ణాటకలోని కొడగు జిల్లా దుబారే ఏనుగుల శిబిరం వద్ద సోమవారం ఉదయం ఒక ఊహించని ప్రమాదం జరిగింది. చెన్నైకి చెందిన 33 ఏళ్ల జునేషే అనే పర్యాటకురాలు దసరా ఏనుగు కంజన్ కాలితో తొక్కడంతో అక్కడికక్కడే మరణించారు. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భర్త, చిన్నారితో కలిసి కొడగు విహారయాత్రకు వచ్చిన ఆమె, చివరికి ఇలా విగతజీవిగా మారడం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఏనుగు స్నానం చేసే చోటే ప్రమాదం

కావేరీ నది ఒడ్డున ఏనుగులకు స్నానం చేయించే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ఏనుగుల కార్యకలాపాలను దగ్గర నుంచి చూసేందుకు పర్యాటకులను ఇక్కడ అనుమతిస్తారు. ఈ క్రమంలోనే ఏనుగులకు స్నానం చేయిస్తున్న దృశ్యాలను చూస్తున్న సమయంలో, దసరా ఉత్సవాల్లో పాల్గొనే అనుభవం ఉన్న కంజన్ అనే ఏనుగు ఒక్కసారిగా రెచ్చిపోయి జునేషేపై దాడి చేసింది. ఏనుగు ఆమెను తొక్కడంతో తీవ్ర గాయాలైన ఆమె క్షణాల్లోనే ప్రాణాలు విడిచారు.

A woman tourist from Chennai was trampled to death by Dasara elephant Kanjan at the Dubare Elephant Camp in Kodagu district this morning.

The deceased has been identified as Juneshe (33), a homemaker from Chennai, who had come to Dubare with her family as part of a trip to… pic.twitter.com/jmPPI4oqpE

— Karnataka Portfolio (@karnatakaportf) May 18, 2026

నివ్వెరపోయిన పర్యాటకులు

సాధారణంగా శిక్షణ పొందిన ఏనుగులు పర్యాటకులతో సాధువులుగా ప్రవర్తిస్తుంటాయి. అయితే, హఠాత్తుగా ఏనుగు ఎందుకు కోపానికి గురైందో అర్థం కాక పర్యాటకులు, అక్కడి మావటీలు నివ్వెరపోయారు. భార్యాబిడ్డలతో కలిసి ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా గడుపుతున్న సమయంలో కళ్ల ముందే భార్య ప్రాణాలు కోల్పోవడంతో జునేషే భర్త కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు పర్యాటక శిబిరాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

A tragic incident at the renowned Dubare Elephant Camp in Karnataka’s Kodagu district claimed the life of a 33-year-old tourist from Chennai during a public elephant bathing session on Monday.

The victim, identified as Junesh, had reportedly visited the popular eco-tourism… https://t.co/LlkwzA6NXh pic.twitter.com/mXQuzlmdMZ

— Hate Detector 🔍 (@HateDetectors) May 18, 2026

భద్రతపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు

వన్యప్రాణుల శిబిరాల్లో పర్యాటకుల భద్రతపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఏనుగులు స్నానం చేసే సమయంలో లేదా వాటికి దగ్గరగా వెళ్లే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల విషయంలో పర్యాటక శాఖ విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంత శిక్షణ పొందిన ఏనుగులైనా, అవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేమని, పర్యాటకులను మరింత దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

విషాదంలో ముగిసిన విహారయాత్ర

కొడగు అందాలను చూడాలని ఆశతో వచ్చిన ఆ కుటుంబానికి ఈ పర్యటన తీరని వేదనను మిగిల్చింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా ఈ ప్రమాదంపై అంతర్గత విచారణకు ఆదేశించారు. పర్యాటకులు ఇటువంటి వన్యప్రాణి కేంద్రాలను సందర్శించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.