పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ టూవీలర్ల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ బైక్ కంపెనీల ఫోకస్ మెరుగైన రేంజ్, వేగవంతమైన స్పీడ్, మరింత ప్రాక్టికల్ ఈవీలను తయారు చేయడంపైనే ఉండేది. కానీ ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్‌లలో సాంప్రదాయ పెట్రోల్ బైక్‌ల వంటి ఫీల్‌ను అందించేందుకు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టూవీలర్ కంపెనీ హోండా ఒక కొత్త టెక్నాలజీపై పేటెంట్ పొందింది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌లో ఫేక్ క్లచ్ (ఆర్టిఫిషియల్ క్లచ్), వైబ్రేషన్ సిస్టమ్‌ను అందించనుంది. ఎలక్ట్రిక్ బైక్‌లో క్లచ్ పని ఏమిటి, హోండా తన కొత్త ఈవీలో నకిలీ క్లచ్‌ను ఎందుకు ఇస్తోందో పూర్తి వివరాలు తెలుసుకోండి.

హోండా కొత్త ఈవీలో నకిలీ క్లచ్
సాధారణంగా ఎలక్ట్రిక్ బైక్‌లలో గేర్లు, క్లచ్ అవసరం ఉండదు. ఈవీ మోటార్ నేరుగా పవర్‌ అందిస్తుంది. దాంతో బైక్ గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండా డ్రైవింగ్ చేయవచ్చు. అయితే చాలా మంది రైడర్లు పెట్రోల్ బైక్ లాగా క్లచ్, గేర్, ఇంజిన్ వైబ్రేషన్స్ అనుభూతిని మిస్ అవుతున్నారు. ఈ ఎక్స్‌పీరియన్స్ మళ్లీ అందించడానికి, హోండా ఇప్పుడు తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌లో సూడో క్లచ్ అంటే ఆర్టిఫిషియల్ క్లచ్ టెక్నాలజీపై పని చేస్తోంది. హోండా తన 'సీఆర్ ఎలక్ట్రిక్ ప్రోటో' ఎలక్ట్రిక్ మోటోక్రాస్ బైక్ కోసం ఈ పేటెంట్‌ను తీసుకోవాలని చూస్తోంది. ఈ బైక్ ప్రస్తుతం ఒక ప్రోటోటైప్ మోడల్ కాగా, హోండా రేసింగ్ కార్పొరేషన్, ముగెన్‌లతో కలిసి తయారు చేశారు. ఇదే టెక్నాలజీతో కంపెనీ ప్రొడక్షన్ మోడల్ ఎలక్ట్రిక్, డర్ట్ బైక్‌లను కూడా లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు.

ఈ నకిలీ క్లచ్ ఎలా పనిచేస్తుంది?
హోండా కొత్త టెక్నాలజీలో క్లచ్ లివర్ ఉంటుంది. కానీ దాని పనితీరు పూర్తిగా ఎలక్ట్రానిక్‌గా ఉంటుంది. ఇది మెకానికల్ క్లచ్ లాగా నేరుగా ఇంజిన్‌తో అనుసంధానించి ఉండదు. దానికి బదులుగా ఎలక్ట్రిక్ మోటార్ పవర్‌ఫుల్ అవుట్‌పుట్‌ నియంత్రిస్తుంది. పేటెంట్ ప్రకారం, రైడర్ క్లచ్ లివర్‌ను సగం నొక్కితే మోటార్ పవర్ కూడా సగానికి తగ్గుతుంది. క్లచ్ పూర్తిగా నొక్కినప్పుడు మోటార్ పవర్ పూర్తిగా కట్ అవుతుంది. పెట్రోల్ బైక్‌లో క్లచ్ ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. అంటే రైడర్ ఎలక్ట్రిక్ బైక్‌లో కూడా క్లచ్‌ను వదులుతూ ఫాస్ట్ పికప్‌ ఎక్స్‌పీరియన్స్ ఆస్వాదించవచ్చు. కంపెనీ ఈవీలో ఐసిఈ (ICE - ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) బైక్ లాంటి ఫీల్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

ఈవీ బైక్‌లో వైబ్రేషన్

హోండా కేవలం క్లచ్ ఫీల్‌కే పరిమితం చేయాలనుకోలేదు. కంపెనీ బైక్‌లో హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్‌ను అందించబోతోంది. దీని ద్వారా రైడర్‌కు ఇంజిన్ లాంటి వైబ్రేషన్ పీల్ వస్తుంది. రిపోర్టుల ప్రకారం, హ్యాండిల్‌బార్ రెండు చివరలలో, క్లచ్ లివర్‌లో చిన్న హాప్టిక్ మోటార్లను అమర్చుతారు. ఇవి బైక్ నడుపుతున్నప్పుడు వైబ్రేషన్‌ను క్రియేట్ చేస్తాయి. రైడర్‌కు పెట్రోల్ బైక్ నడుపుతున్నట్లే అనుభూతిని అందించడం దాని ఉద్దేశం.

పలు కంపెనీలు దీనిపై చేశాయి
సూడో క్లచ్ టెక్నాలజీ అనేది పూర్తిగా కొత్తదేమీ కాదు. దీనికి ముందు కిమ్కో (Kymco) తన సూపర్ నెక్స్, రెవో నెక్స్ ఎలక్ట్రిక్ బైక్‌లలో సాంకేతికతను ప్రదర్శించింది. జీరో మోటార్ సైకిల్స్ కూడా తన హైపెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ ఎస్ఆర్ఎఫ్ (SRF) కోసం ఇదే తరహా టెక్నాలజీపై పేటెంట్ తీసుకుంది. అయితే హోండా లాంటి పెద్ద కంపెనీ ఈ టెక్నాలజీపై పనిచేస్తుండటం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఈ కంపెనీ భారీ స్థాయిలో ఉత్పత్తి (ప్రొడక్షన్) చేయగల సామర్థ్యాన్ని, గ్లోబల్ మార్కెట్‌లో మంచి పట్టు సాధిస్తోంది.