e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు మద్దతు ఇచ్చేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆగస్టు 26, 2021న ఇ-శ్రమ్ పథకాన్ని ప్రారంభించింది. కేంద్రం అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ డేటాబేస్ రూపొందించింది. వ్యవసాయం, నిర్మాణం, గృహ కార్మికులు, వీధి వ్యాపారం వంటి రంగాలలోని కార్మికులకు సంక్షేమ, సామాజిక పథకాల్లో అవకాశం కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అసంఘటిత రంగ కార్మికులను అధికారికంగా ఆర్థిక వ్యవస్థలో భాగం చేసేందుకు ఇ-శ్రమ్ స్కీమ్‌ను ప్రారంభించింది. అసంఘటిత రంగాల్లో పనిచేసే ఎవరైనా శ్రామిక్ కార్డు లేదా ఇ-శ్రమ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇ-శ్రమ్ పోర్టల్ 30 వ్యాపార రంగాలకు, సుమారు 400 వృత్తులు రిజిస్టర్‌కు అవకాశం ఉంది.

ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు

అసంఘటిత రంగంలో పనిచేసే ఎవరైనా లేబర్ కార్డు లేదా ఇ-శ్రమ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద, అసంఘటిత రంగ కార్మికులు 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత రూ. 3 వేల పెన్షన్, రూ. 2 లక్షల మరణ బీమా, ప్రమాదంలో వైకల్యం సంభవిస్తే రూ.1 లక్ష ఆర్థిక సహాయం వంటి ప్రయోజనాలను పొందవచ్చు. లబ్ధిదారులకు దేశమంతటా చెల్లుబాటు అయ్యే 12-అంకెల UAN నెంబర్ కల్పిస్తారు.

ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదుకు అర్హతలు

వయస్సు 16 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్వయం ఉపాధి చేసుకుంటున్న వ్యక్తులు, రోజువారీ కూలీలు, గిగ్ వర్కర్లతో సహా అసంఘటిత రంగాల్లోని వారు అర్హులు.
ఆధార్ కార్డు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్, బ్యాంకు అకౌంట్ ఉండాలి.
ఈపీఎఫ్‌ఓ, ఈఎస్ఐసీలో నమోదై ఉండకూడదు.

Also Read: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ

ఇ-శ్రమ్ పోర్టల్ ఫీచర్లు

యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN): ఇ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న కార్మికులు తమ ఆధార్‌కు లింక్ అయిన UANను పొందుతారు. ఇది అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది.

ఒకసారి మాత్రమే నమోదు: ఈ పోర్టల్‌లో ఆధార్, బ్యాంకు అకౌంట్ వివరాలతో నమోదు చేసుకోవచ్చు. ఒకసారి మాత్రమే నమోదుకు అవకాశం ఉంటుంది.

ఇ-శ్రమ్‌లో రిజిస్టర్ చేసుకున్న కార్మికులు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్య శిక్షణ, అప్రెంటిస్‌షిప్, పింఛన్ పథకాలు, డిజిటల్ స్కిల్ ట్రైనింగ్, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం వంటి అవకాశాలు కల్పిస్తారు.

తమ కుటుంబాలతో ఉపాధి కోసం వలస వెళ్లిన వారికి పిల్లల విద్య, మహిళలకు పథకాలను అందించేందుకు వలస కార్మికుల కుటుంబ వివరాలు సేకరిస్తారు.

ఇ-శ్రమ్ కార్డ్ ఉచిత నమోదు

ఇ-శ్రమ్ కార్డు పొందిన కార్మికులు బీమా, పింఛన్, ఇతర ప్రభుత్వ పథకాలలో ప్రయోజనం పొందుతారు. ఈ కార్డును ఉచితంగా పొందవచ్చు. దీనిని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ https://eshram.gov.in/ లేదా CSC కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చు.

Also Read: బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!

ఎలా నమోదు చేసుకోవాలి?

ఇ-శ్రమ్ పోర్టల్ https://eshram.gov.in/పై క్లిక్ చేయండి.

ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, 'Send OTP' బటన్‌పై క్లిక్ చేయండి.

ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌ను క్లిక్ చేయండి.

అడ్రస్, విద్యార్హత అన్ని వివరాలను నమోదు చేయాలి.

స్కిల్, వ్యాపార అనుభవం, చేసే పని ఎంచుకోండి.

బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేయాలి.

మీ మొబైల్ నెంబర్ ఒక OTP పంపిస్తుంది. దానిని ఎంటర్ నమోదు చేయాలి.

మీ ఇ-శ్రమ్ కార్డు వివరాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. ఇ-శ్రమ్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి.

Also Read:  రెండో ఫోన్‌కి బ్యాంకు అకౌంట్ అక్కర్లేదు - గూగుల్ పే యూపీఐ సర్కిల్ తో మీ ఫోనే మీ డిజిటల్ బ్యాంక్! ఫుల్ డీటైల్స్

కావాల్సిన పత్రాలు

ఆధార్ కార్డు

ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్

బ్యాంకు అకౌంట్ వివరాలు