Durga Puja In Amalapuram Temple | రాష్ట్రవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. న‌వ‌రాత్రులు వివిధ రూపాల్లో అమ్మ‌వారిని ద‌ర్శ‌నం క‌ల్పించేవిధంగా ఆల‌య క‌మిటీలు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అలంకర‌ణ చేస్తుంటారు.. ఇందులో క‌న‌క‌మ‌హాల‌క్ష్మ అమ్మ‌వారిగా ద‌ర్శ‌నం అంటే చాలా డిఫ‌రెంట్ అనే చెప్పాలి.. ఎందుకంటే క‌రెన్సీతో అలంక‌ర‌ణ చేయ‌డం ద్వారా మ‌హాల‌క్ష్మి ప్ర‌తిరూపంగా భ‌క్తులకు క‌నిపించాల‌నే ఆకాంక్ష‌తో ఈ ప్ర‌య‌త్నం చేస్తుంటారు భ‌క్తులు.. స‌రిగ్గా అలాగే వాస‌వి క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి అమ్మ‌వారిని క‌న‌క‌మ‌హాల‌క్ష్మిగా ద‌ర్శించుకునేందుకు ఆల‌య క‌మిటీ, ఆర్య‌వైశ్య పెద్ద‌లు క‌లిపి రూ.4కోట్ల 44లక్షల 99 వేల 9 వందల 99 రూపాయల నూతన కరెన్సీ తో అత్యంత వైభ‌వంగా అలంక‌రించారు.. అది ఎక్క‌డంటారా.. మీరే చ‌ద‌వండి ఇక‌..

క‌న‌క‌మ‌హాల‌క్ష్మ అమ్మ‌వారిగా ద‌ర్శ‌నం

అమలాపురం: అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఐదవ రోజు శుక్రవారం వాసవీ అమ్మవారు భక్తులకు శ్రీ మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్నారు. ఉత్స వాల సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని నూతన కరెన్సీ నోట్లతో అలంకరించడం ఇక్కడ ఆనవాయి తీగా వస్తోంది. ఈ సారికూడా 4కోట్ల 44లక్షల 99 వేల 9 వందల 99 రూపాయల నూతన కరెన్సీ తో ఆలయం ముఖ మండపం, అంతరాలయం, ఘర్భాలయం నందు ప్రత్యేక అలంకారం చేశారు. ప్రత్యేక అలంకరణతో కొలువుదీరిన అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తండోపతండాలుగా వస్తున్నారు. శ్రీ వాసవి కన్యకా పర మేశ్వరి ఆర్య వైశ్య సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 11 వేల రూపాయలతో మొదలైన ఈ అలంకారం ఇప్పుడు 4 కోట్లకు పైబడి చేరడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భక్తుల సహకారంతో తాము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రత్యేక అలంకారం కొరకు కరెన్సీ నోట్లను అందించిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ఈ సంద ర్బంగా ధన్యవాదాలు తెలిపారు. భారీ నగదు తో అమ్మవారిని అలంకరించిన నేపద్యంలో నలుగురు ఆర్మ్డ్ పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేసినట్లు అమలాపురం డీఎస్పీ టీ ఎస్ ఆర్ కే ప్రసాద్ తెలిపారు.. ఆయన సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.. పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు దర్శించుకున్నారు.

నెల రోజులుగా నూత‌న క‌రెన్సీకోసం ప్ర‌య‌త్నం..

ప్ర‌తీ ఏటా అమ్మ‌వారిని క‌న‌క‌మ‌హాలక్ష్మిగా అలంక‌రించేందుకు అమ‌లాపురం ఆర్య‌వైశ్య సంఘం, వాస‌వి క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి ఆల‌య క‌మిటీ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటుంది.. ఈనేప‌థ్యంలోనే గ‌త కొన్నేళ్లుగా కొన‌సాగుతున్న ఈసంప్ర‌దాయాన్ని కొన‌సాగేంచే క్ర‌మంలో ఈ ఏడాది పెద్ద టాస్క్ ఎంచుకున్నారు. దీనికోసం నెల రోజుల ముంద‌నుంచి బ్యాంకుల‌ను సంప్ర‌దించి వారి వ‌ద్ద‌నున్న కొత్త క‌రెన్సీ నోట్ల‌ను సేక‌రించారు.. అంతేకాకుండా కొంత మంది పెద్ద‌లు, స‌భ్యులు క‌లిసి మ‌రికొంత న‌గ‌దును సేక‌రించారు.. ఇలా ఏకంగా రూ. 4కోట్ల 44లక్షల 99 వేల 9 వందల 99 రూపాయల నూతన కరెన్సీ ని సిద్ధం చేసి రెండు రోజులు క‌ష్ట‌ప‌డి అత్యంత వైభ‌వోపేతంగా అలంక‌రించారు.

ఆర్య‌వైశ్య సంఘానికి చెందిన ప‌దిమంది యువ‌కులు ఈ ప్ర‌క్రియ‌ను క‌న్నులకు ఇంపుగా రూప‌క‌ల్ప‌న చేశారు. 2000 నోట్ల నుంచి 500, 200, 100, 50 ఇలా కొత్త నోట్ల‌ను సేక‌రించి పూల మాల‌లుగా అల్లి చేసిన అలంక‌ర‌ణ చూస్తున్న భ‌క్త‌జ‌నం మంత్ర‌ముగ్ధుల‌వుతున్నారు.. ఇక సెక్యూరిటీ కోసం అమ‌లాపురం పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తే జిల్లా ఎస్పీ రాహుల్‌మీనా ఆదేశాల మేర‌కు అయిదుగురు ఆర్మ్ఢ్ పోలీసుల సిబ్బందిని బందోబ‌స్తుగా ఏర్పాటు చేశారు..