Ranveer Singh's Dhurandhar Review In Telugu: రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'దురంధర్'. 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' వంటి దేశభక్తి సినిమా తీసిన ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సారా అర్జున్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. హిందీలో ఈ రోజు విడుదల చేశారు. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

కథ (Dhurandhar Movie Story): పార్లమెంట్ (2001) సహా దేశంలో వివిధ ప్రాంతాల్లో టెర్రరిస్ట్ ఎటాక్స్ తర్వాత... ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) అధినేత అజయ్ సన్యాల్ (ఆర్ మాధవన్) ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదన ఉంచుతాడు. ప్రపంచంలో ఏ చోట తీవ్రవాదుల దాడి జరిగినా దాని వెనుక పాకిస్తాన్ ఉందని, దాయాది దేశంలో తీవ్రవాద - చీకటి సామ్రాజ్యంలోకి 'ఇండియన్ ఏజెంట్'ను పంపుదామని!

ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో హమ్జా అలీ మజారీ (రణవీర్ సింగ్)ను పాక్ పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రెహమాన్ డకాయత్ బలూచ్ (అక్షయ్ ఖన్నా) గ్యాంగులోకి హమ్జా ఎలా వెళ్ళాడు? వెళ్ళాక ఏం చేశాడు? రెహమాన్ వర్సెస్ ఎస్పీ చౌదరి అస్లాం (సంజయ్ దత్) యుద్ధంలో హమ్జా పాత్ర ఏమిటి? ఇండియా ఐబీ చీఫ్ కోరుకున్నట్టు చేశాడా? లేదా? అనేది సినిమా.

విశ్లేషణ (Dhurandhar Movie Review Telugu): టెర్రరిస్ట్ ఎటాక్ నేపథ్యంలో పలు సినిమాలు వచ్చాయి. అయితే మెజారిటీ సినిమాల్లో టెర్రర్ మూలాలు చూపించే దిశగా దర్శక రచయితలు దృష్టి పెట్టలేదు. భారతీయ కోణంలో తీవ్రవాదాన్ని ఎక్కువగా చూపించారు. పాక్ అంతటినీ ఒక్క గాటిన కట్టేవారు. బట్, ఫర్ ద ఫస్ట్ టైమ్... పాక్ మాఫియా / అండర్ వరల్డ్ / చీకటి రాజకీయాలు / తీవ్రవాదాన్ని చాలా లోతుగా 'దురంధర్'లో చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ విపులంగా చూపించారు.

'దురంధర్' విడుదలకు ముందు నుంచి రన్ టైమ్ డిస్కషన్ పాయింట్ అయ్యింది. మూడున్నర గంటల సినిమాను థియేటర్లలో చూడగలమా? ప్రేక్షకులు చూస్తారా? వంటి ప్రశ్నలు తలెత్తాయి. కొన్ని సన్నివేశాల్లో సాగదీత ఉన్నట్టు అనిపించినా... ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకులు ఆసక్తిగా సినిమా చూసేలా ఆదిత్య ధర్ తీశారు. షాట్ ఫ్రేమింగ్, సీన్ కంపొజిషన్, ఫిల్మ్ మేకింగ్... ఆదిత్య ధర్ విజన్ స్క్రీన్ మీద ఎలివేట్ అవ్వడంలో శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం ప్రాణం పోసింది. పాటలు, నేపథ్య సంగీతంతో ప్రేక్షకులను కట్టిపడేశారు శాశ్వత్. ముఖ్యంగా కొన్ని ఓల్డ్ ట్రాక్స్ - ఉదాహరణకు మోనికా, హవా హవా, రంభ హో హో వంటివి వాడిన తీరు బావుంది. సన్నివేశాలను మరింత ఎంగేజింగ్‌గా మార్చింది ఆర్ఆర్. వికాస్ నౌలఖ సినిమాటోగ్రఫీ బావుంది. ఇంటెన్స్ & యాక్షన్ మూడ్ సెట్ చేయడంలో కలర్ టోన్, ఫ్రేమ్స్ హెల్ప్ అయ్యాయి. రా యాక్షన్ సీన్స్ చూస్తే గగుర్పాటుకు గురి అవుతారు. యాక్షన్ కొరియోగ్రఫీ బావుంది. అయితే పిల్లలకు అంత హింస, రక్తపాతం చూపించలేం.

'దురంధర్'లో కథ కంటే క్యారెక్టరైజేషన్లు బలంగా రాశారు ఆదిత్య ధర్. ముఖ్యంగా ప్రధాన పాత్రధారుల లక్ష్యం ఏమిటి? అనేది స్పష్టంగా చెప్పారు. ఒక్క హీరో లక్ష్యం తప్ప! పాక్ చీకటి ప్రపంచంలోకి తన మనిషిని పంపించడం ఐబీ చీఫ్ మాధవన్ గోల్. ఆయన ఆ పని చేశారు. రాజకీయంగా ఎదగడం అక్షయ్ ఖన్నా లక్ష్యం. ఆ దిశగా అడుగులు వేస్తారు. అతడిని అంతం చేయడమే ఎస్పీ సంజయ్ దత్ గురి. ఈ విధంగా ప్రతి ఒక్కరి పాత్రలనూ, నేపథ్యాన్ని చక్కగా వివరించారు. అయితే పాక్ వెళ్లిన హీరో నేపథ్యాన్ని రెండో పార్టు కోసం దాచేశారు. అందువల్ల అతడి పెయిన్ ప్రేక్షకులకు తెలియదు. ప్రాణాలకు తెగించి ఎందుకు పోరాడుతున్నాడు? అనే ప్రశ్నకు సమాధానం లభించదు. దాంతో యాక్షన్ సీన్స్ ఎంజాయ్ చేసినంతగా రణవీర్ ఎమోషనల్ సన్నివేశాలకు కనెక్ట్ అవ్వలేం. ఇప్పటి వరకు వచ్చిన గ్యాంగ్‌స్టర్ సినిమాలు కొన్నిటిని చూస్తే... కథ, క్యారెక్టర్లు కొత్తగా కనిపించవు. రెగ్యులర్ రొటీన్ మాఫియా డ్రామాకు పాక్ బ్యాక్‌డ్రాప్ కొత్త కలర్ అద్దింది.

ఇండియాలో టెర్రరిస్ట్ ఎటాక్స్ జరిగిన సమయంలో దాయాది దేశంలో ఎవరెవరు ఏం చేశారు? అనేది ఆదిత్య ధర్ చూపించిన తీరు బావుంది. ఆసక్తి కలిగిస్తుంది. ఈ కథలో హీరో ఒక్కరు అని చెప్పలేం. రణవీర్ సింగ్ సహా అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ సైతం ప్రధాన పాత్రలు పోషించారు. రణవీర్ సింగ్ సరసన సారా అర్జున్ మరీ చిన్నపిల్లలా కనిపించింది. ప్రేక్షకులకూ ఆ ఫీలింగ్ కలుగుతుందని ఏమో... ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర వయసు 19 ఏళ్ళు అని చెప్పించారు. 19 కాదు, 25 / 30 అని చూపించినా ఆ పాత్రకు వచ్చే నష్టం ఏమీ ఉండదు.

Also Read: 'అఖండ 2' వాయిదాకు కారణాలు... మద్రాస్ హైకోర్టులో, ల్యాబ్ దగ్గర ఏం జరిగింది?

'దురంధర్'లో కథానాయకుడు రణవీర్ సింగ్. అందులో మరో సందేహం లేదు. కానీ అక్షయ్ ఖన్నా తెరపై కనిపించిన ప్రతిసారీ ఆయన్ను తప్ప స్క్రీన్ మీద మరొకర్ని చూడలేం. అక్షయ్ నటన అంత ప్రభావం చూపించింది. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ స్వాగ్ మిగతా ఆర్టిస్టులను డామినేట్ చేసింది. తక్కువ డైలాగులు చెప్పారు. కానీ, నటనతో ఎక్కువ ఇంపాక్ట్ కలిగించారు. అక్షయ్ ఖన్నా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన సినిమాల్లో 'దురంధర్' ఒకటిగా నిలుస్తుంది. రణవీర్ సింగ్ పాత్రకు తగ్గట్టు బాడీ బిల్డ్ చేయడమే కాదు... నటనలో ఇంటెన్సిటీ చూపించారు. సారా అర్జున్ స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో చక్కగా నటించారు. సంజయ్ దత్ పవర్ ఫుల్ రోల్ చేశారు. మధ్యలో కొన్ని డైలాగులతో నవ్వించారు. అర్జున్ రాంపాల్ యాక్టింగ్ ఓకే. మాధవన్ మేకోవర్ సర్‌ప్రైజ్ చేస్తుంది. మిగతా ఆర్టిస్టులు సైతం తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు కాస్త భిన్నమైన పంథాలో సాగిన సినిమా 'దురంధర్'. స్పై జానర్ ఫిలిమ్స్ ఇష్టపడే ప్రేక్షకులు చివరి వరకు ఉత్కంఠగా చూసేలా చేశారు ఆదిత్య ధర్. షో మొదలైన కాసేపటికి కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లారు. అక్షయ్ ఖన్నా పెర్ఫార్మన్స్ - శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం ఎక్సట్రాడినరీగా ఉన్నాయి. వాళ్ళిద్దరి అవుట్ స్టాండింగ్ ట్యాలెంట్‌తో పాటు మిగతా టీమ్ ఎఫర్ట్స్ (Dhurandhar Telugu Review)ను అప్రిషియేట్ చేయకుండా ఉండలేం. అయితే సినిమా లెంగ్తీగా ఉంది. కానీ ఎంగేజ్ చేస్తుంది. థియేటర్లలో మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. పాక్ అండర్ వరల్డ్‌ ఎస్టాబ్లిష్‌ చేసిన ఆదిత్య ధర్... ఇండియా ప్లాన్‌ ఏంటి? అనేది చూపించలేదు. రెండో పార్ట్‌ కోసం దాచేశారు.

Also Read: Bhuta Shuddhi Vivaha: భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి? సమంత - రాజ్ పెళ్లి ఏ పద్ధతిలో, ఎలా జరిగిందో తెలుసా?