ఉభ‌య గోదావ‌రి జిల్లాలోని ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ ఆయా జిల్లాల ఎస్పీలు హెచ్చ‌రించ‌డంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వారినికి గుర‌వుతున్నారు.. మ‌ధ్య ప్ర‌దేశ్ నుంచి ఇక్క‌డికి వ‌చ్చి దోపిడీలు చేసే ధార్ గ్యాంగ్ గురించి పోలీసులు హెచ్చ‌రిక‌లు సోష‌ల్ మీడియాలో స‌ర్కులేట్ అవుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.. ఇప్ప‌టికే మ‌ద్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ధార్ గ్యాంగ్‌తోపాటు ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన మ‌రో గ్యాంగ్‌ల వ‌రుస దోపిడీలు వెలుగులోకి రావ‌డంతో పోలీసులు మ‌రింత అప్ర‌మ‌త్తమ‌య్యారు.. లూటీ చేస్తున్న క్ర‌మంలో ఎవ్వ‌రైనా అడ్డువ‌చ్చినా చంపేందుకు వెనుకాడ‌ని ఈ గ్యాంగ్ కోసం ప్ర‌త్యేక పోలీసు బృందాలు జ‌ల్లెడ ప‌డుతున్నాయి..

ఇప్ప‌టికే ప‌లు చోట్ల దొంగ‌త‌నాలు..

ఏపీలో ఇటీవ‌ల కాలంలో ప‌లు చోట్ల జ‌రిగిన దొంగ‌త‌నాల శైలిని ప‌రిశీలించిన పోలీసులు ఈ ప‌ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దార్ గ్గ్యాంగ్, అలాగే మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్‌లకు చెందిన మరికొన్ని గ్యాంగ్‌లు చేసిన‌వేన‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. దొంగ‌త‌నాలు జ‌రిగిన ప‌ద్ద‌తిని బ‌ట్టి గ‌తంలో చోటుచేసుకున్న ప‌లు సంఘ‌ట‌న‌ల‌కు ఆధారంగా ఎవ్వ‌రు పాల్ప‌డి ఉంటార‌న్న అంచ‌నా వేసే ప‌రిస్థితి ఉండ‌గా గత పది రోజులుగా నెల్లూరు, కాకినాడ, నల్లజర్ల వంటి ప్రాంతాల్లో రాబరీలు, ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఈ గ్యాంగ్‌ల ప‌నేన‌ని నిర్ధారించుకునే ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌రించిన‌ట్లు తెలుస్తోంది.. ఈ గ్యాంగ్‌లు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా చురుగ్గా ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

ప‌గ‌టిపూట రెక్కీ.. ఆపై రాత్రిపూట దోపిడీ..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ గ్గ్యాంగ్, అలాగే మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్‌లకు చెందిన మరికొన్ని గ్యాంగ్‌లు రాష్ట్రంలోకి చొర‌బ‌డి గత పది రోజులుగా ప‌దుల సంఖ్య‌లో దోపిడీల‌కు పాల్ప‌డిన నేప‌థ్యంలో ఈ గ్యాంగ్‌ల క‌ద‌లిక‌ల‌పై పోలీసులు నిఘా పెట్టారు. వీరు పాల్ప‌డిన దోపిడీల ఘ‌ట‌నా స్థలాల వ‌ద్ద సీసీ కెమెరా పుటేజీల ద్వారా అంచాన‌వేసిన పోలీసులు ఈ ధార్ గ్యాంగ్‌కు చెందిన ఓ ముఠా నాయ‌కుని ఫొటో కూడా విడుద‌ల చేశారు. వీరు పగటిపూట ఒంటరిగా ఉన్న మహిళల ఇళ్లను, తాళాలు వేసిన ఇళ్లను గమనించి, రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడ‌తార‌ని పోలీసులు చెబుతున్నారు.

ముఖ్యంగా హైవేల‌ను ఆనుకుని ఉన్న ఆవాస‌ప్రాంతాల‌తోపాటు హైవేల‌నుంచి క‌నెక్టివీటీ ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుంటార‌ని, అదేవిధంగా సిటీలను ఆనుకుని ఉన్న ఇళ్ల‌ను, విశాల స్థ‌లంలో ఒంట‌రిగా ఉన్న ఇళ్ల‌ను కూడా టార్గెట్ చేస్తుంటార‌ని హెచ్చ‌రిస్తున్నారు.. రాత్రివేళ‌ల్లో త‌లుపులు కొట్టినా, ఏదైనా చంటిపిల్ల‌ల ఏడుపులు విన‌ప‌డినా కంగారు ప‌డి త‌లుపులు తీయ‌కూడ‌ద‌ని సూచిస్తున్నారు. ఎక్కువ‌గా ప‌గ‌టి పూట ఆటోల్లో తిరుగుతూ రెక్కీ నిర్వ‌హించి ఆపై రాత్రివేళ‌ల్లో ముసుగులు ధ‌రించి మార‌ణాయుధాల‌తో దోపిడీల‌కు పాల్ప‌డ‌తార‌ని చెబుతున్నారు.

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో అలెర్ట్‌..

ఉమ్మ‌డి తూర్ప‌ు గోదావ‌రి జిల్లా ప‌రిధిలోని తూర్పుగోదావ‌రి, కాకినాడ‌, అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాల ఎస్పీలు ఇప్ప‌టికే వేర్వేరుగా హెచ్చ‌రిక ప్ర‌క‌ట‌న‌లు జారీ చేశారు. తూర్పుగోదావ‌రి జిల్లా ప‌రిధిలోని హైవేల‌కు ఆనుకుని ఉన్న ప‌లు ప్రాంతాల‌తోపాటు సిటీను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ సంచ‌రించే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. అదే విధంగా కాకినాడ జిల్లాలోనూ హైవేల‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ హెచ్చ‌రించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం, ఆలమూరు, మండపేట, రామచంద్రపురం, అమలాపురం, రాజోలు, ముమ్మిడివరం ఏరియాల్లో ఈ గ్యాంగ్‌లు దొంగతనాలు చేసే అవకాశం ఉన్నందున, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మీ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు కనిపిస్తే, వెంటనే దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.