Five main reasons for Kejriwal defeat: పంజాబ్‌లో తిరుగులేని విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ కన్నా ఓడిపోయిన కేజ్రీవాల్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. గత రెండు సార్లు 70 అసెంబ్లీ స్థానాలున్నరాష్ట్రంలో 60కిపైగా గెలిచిన రికార్డు ఆయన సొంతం. మరి ఆయన ఎందుకు పరాజయం పాలయ్యారు ?. ఆయన ఓటమికి ఐదు ప్రధాన కారణాలు చెప్పుకోవచ్చు.

1. కాంగ్రెస్‌ను దూరం చేసుకోవడం

ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఆప్.. కాంగ్రెస్ ను దూరం చేసుకుంది. ఆ పార్టీపై విరుచుకుపడింది. పొత్తు వద్దే వద్దని ఒంటరి పోటీ చేసింది. కానీ అదే ఆ పార్టీకి విజయాన్ని దూరం చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఏడు శాతం వరకూ ఓట్లు వచ్చాయి ఇది కేజ్రీవాల్ ఓటమిని డిసైడ్ చేసిందని చెప్పక తప్పదు. ఢిల్లీలో పోరు హోరాహోరీగా సాగిందని ఫలితాలు చూపిస్తున్నాయి. చాలా తక్కువ తేడాతో కొన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఇలాంటి ఫలితాలను ప్రభావితం చేసింది కాంగ్రెస్ పార్టీనే. పార్లమెంట్ ఎన్నికల్లో కలసి పోటీ చేసిన కాంగ్రెస్, ఆప్ ఇప్పుడు విడివిడిగా పోటీ చేశాయి. కాంగ్రెస్ హర్యానా ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేదని.. ఆప్ ఢిల్లీలో కాంగ్రెస్ కు ఝులక్ ఇచ్చింది. చివరికి అది తనకు తాను ఇచ్చుకున్న ఝులక్ లాగా మారింది.

2. రాజీనామా చేయనని హామీ ఇచ్చి రాజీనామా చేసిన కేజ్రీవాల్

జైలు నుంచి బెయిల్ పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్ పాలనపై దృష్టి పెట్టలేదు. అరెస్టు అయినప్పటికీ ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా అతిశీ ద్వారా పాలన సాగించారు. కానీ విడుదలైన తర్వాత సానుభూతి రాజకీయాల కోసం తన పదవికి రాజీనామా చేశారు. గతంలో కేజ్రీవాల్ తను మరోసారి రాజీనామా చేసి తప్పు చేయనని ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారు. మొదటి సారి అధికారం చేపట్టినప్పుడు పూర్తి మెజార్టీ లేదు. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో రాజీనామాలు చేసి.. రాజకీయాలు చేశారు. ఆ సమయంలో రెండో సారి గెలిచే ముందు తాను ఆ తప్పు మరోసారి చేయనని ప్రజలకు హామీ ఇచ్చారు. రాజీనామాలు చేయబోనన్నారు. అయితే ఇప్పుడు ఆయన తన వాగ్దానాన్ని మర్చిపోయారు. రాజీనామా చేశారు. ప్రజల ఆగ్రహానికి గురయ్యారు.

3. అవినీతి వ్యతిరేకత ఉద్యమ నేతపైనే అవినీతి ఆరోపణలు

అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ చురుగ్గా పాల్గొని దేశం దృష్టిని ఆకర్షించారు. చివరికి ఆయనకు రాజకీయ లక్ష్యాలు ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీని ప్రకటించడం ద్వారా స్పష్టమయింది. ప్రజలు మొదట్లో పూర్తి మెజార్టీ ఇవ్వలేదు. కానీ తర్వాత రెండు సార్లు పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. రెండు సార్లు 70 అసెంబ్లీ స్థానాల్లో అరవై స్థానాలకుపైగా కట్టబెట్టారు. అలాంటి నమ్మకాన్ని కేజ్రీవాల్ నిలబెట్టుకోలేకపోయారు. రెండో సారి గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన అధికారాన్ని సిసోడియాకు అప్పగించి ఆయన రాజకీయాలు చేయడం ప్రారంభించారు. ఫలితంగా ప్రజలు ఆప్ పై క్రమంగా ఆసక్తి కోల్పోవడం ప్రారంభించారు.

4. కేజ్రీవాల్ అవినీతి చేశారని ప్రజలు నమ్మడం

ఆప్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రావడం ఢిల్లీ ప్రజల్ని ఆగ్రహానికి గురి చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అసలేం లేదని చెప్పినా ప్రజలు నమ్మలేదు. ఆయనను అరెస్టు చేసినా ప్రజలు స్పందించలేదని.. సానుభూతి వ్యక్తం చేయలేదని ఫలితాల ద్వారా స్పష్టమయింది. తాను అవినీతి చేసినట్లుగా నమ్మితే తనను ఓడించాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఆ ప్రకారం ఢిల్లీ ప్రజలు ఆయన అవినీతి చేసినట్లు నమ్మారు. సిసోడియాతో పాటు పలువురు ఆప్ నేతలు అవినీతిలో మునిగి తేలినట్లుగా ప్రజలు గట్టి గా నమ్మారని ఫలితాలు నిరూపిస్తున్నాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో పుట్టిన పార్టీ ఇలా అవినీతి లో మునిగిపోవడం ప్రజల్ని ఆగ్రహానికి గురి చేసింది.

5.కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్ తో గొడవలు

రాజకీయ కారణాలతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కేంద్రంతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితికి వెళ్లారు. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలు స్వల్పం. పోలీసు వ్యవస్థ కూడా కేంద్రం అధీనంలోనే ఉంటుంది. ప్రజల సంక్షేమం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. మొదటి విడతలో అద్భుతమైన పాలన చూపించిన కేజ్రీవాల్.. రెండో విడతకు వచ్చే సరికి కేంద్రంతో గొడవలు పడి.. పనులు జరగకుండా చేసుకున్నారు. ఫలితంగా ఆప్ మార్క్ మిస్ అయిపోయింది. స్కూల్స్ బాగు చేయించామని.. మొహల్లా క్లీనిక్ లు పెట్టామని మొదటి విడత లో చేసిన పనులనే ఇప్పుడూ ప్రచారం చేసుకున్నారు కానీ.. గత ఐదేళ్లలో ఏం చేశారో చెప్పుకోలేకపోయారు. ఫలితంగా కేజ్రీవాల్ కు ప్రజలు ఇంటి దారి చూపించారు.