Deepam 2 Free Gas Cylinders: ఏపీ ప్రభుత్వం ఉచిత సిలిండర్లపై గుడ్‌న్యూస్ చెప్పింది. దీపం-2 పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను అందిస్తున్న ప్రభుత్వం... రాయితీ డబ్బును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో చేస్తుంది. అయితే డబ్బులు ఎప్పుడు పడుతున్నాయో, అసలు పడుతున్న విషయం కూడా లబ్దిదారులకు తెలియడంలేదని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.2,900 కోట్లు దీపం-2 పథకం కింద ఖర్చు పెడుతుంది. అయినా ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో మైలేజీ రావడం లేదనే నివేదికలు అందుతున్నాయి. దీంతో సిలిండర్‌ తీసుకున్నాక తర్వాత నెలలో నిర్ణీత తేదీన రాయితీ డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ విషయంపై పౌర సరఫరాలశాఖ, ఆర్థికశాఖ అధికారులు చర్చిస్తున్నారు.

మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం

ఏపీలో కూటమి ప్రభుత్వం అక్టోబర్ 31, 2024లో దీపం-2 పథకాన్ని ప్రారంభించింది. ప్రతి నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి జులై వరకు ఒకటి, ఆగస్టు నుంచి నవంబర్ వరకు రెండో సిలిండర్, డిసెంబర్ నుంచి మార్చి వరకు మూడో సిలిండర్‌కు.. గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత రాయితీ విడుదల చేస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విడతకు రాయితీ సొమ్మును ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు విడుదల చేస్తుంది.

Also Read: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు

నేరుగా లబ్దిదారుడి ఖాతాలో

వినియోగదారుడు సిలిండర్‌ బుక్‌ చేసుకుని డబ్బు చెల్లించి డెలివరీ తీసుకుంటున్నారు. ఆ తర్వాత రాయితీ మొత్తాన్ని లబ్దిదారుడి ఖాతాలో వేస్తున్నారు. రాయితీ సొమ్ము ఎప్పుడు, ఏ అకౌంట్‌లో జమ చేస్తున్నారో లబ్ధిదారులకు తెలియడం లేదు. ఈ గందరగోళానికి స్వస్తి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత తేదీ విధానాన్ని తీసుకొస్తుంది. ఉదాహరణకు ఆగస్టులో వంటగ్యాస్‌ సిలిండర్లు తీసుకుంటే.. లబ్ధిదారులకు సెప్టెంబర్ నెలలో నిర్ణీత తేదీ ప్రకటించి, రాయితీ సొమ్ము విడుదల చేస్తారు. సెప్టెంబర్‌లో సిలిండర్లు తీసుకున్న వారికి అక్టోబర్‌లో రాయితీ విడుదల చేస్తారు. నెలలో ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారో అధికారులు త్వరలో వెల్లడించనున్నారు.

Also Read: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్

డీబీటీ విధానంలో

అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, నగదు బదిలీ పథకాల తరహాలోనే దీపం-2 రాయితీ సొమ్మును ఎప్పుడు విడుదల చేస్తారో ముందుగానే తెలియజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.61 కోట్ల వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, వీటిలో దీపం-1 కింద 58.42 లక్షలు కనెక్షన్లు, గిరిజన ప్రాంతాల్లో 0.74 లక్షలు, సీఎస్‌ఆర్‌ కింద 6.24 లక్షలు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11.37 లక్షలు, ఇతర కనెక్షన్లు 84.42 లక్షలు ఇచ్చారు. ఇందులో అర్హులకు ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తోంది. ఒక్కో విడతలో సుమారు 92 లక్షల నుంచి కోటి సిలిండర్లకు రాయితీ అందిస్తుంది.

Also Read:  నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు