భారతదేశంలో ఎప్పటి నుంచో కుమార్తెలను తండ్రి ఆస్తి నుండి దూరంగా ఉంచారు. తరతరాలుగా పాటిస్తున్న విధానం ప్రకారం, కుటుంబ ఆస్తి కేవలం కుమారులకు మాత్రమే పంపిణీ అయ్యేది. కుమార్తెలకు తమ తండ్రి, పూర్వీకుల ఆస్తిపై ఎలాంటి హక్కు ఉండదు అని భావించారు. అయితే, మారుతున్న కాలం, చట్టపరమైన సంస్కరణలు ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు కుమార్తెలు, వివాహం చేసుకున్నా లేదా చేసుకోకపోయినా వారి వారసత్వ ఆస్తిలో సమాన హక్కును కలిగి ఉన్నారు. అయితే, దీని గురించి భారతీయ చట్టం ఏం చెబుతుంది, రూల్స్ ఇక్కడ తెలుసుకుందాం.

వారసత్వ చట్టం ఏం చెబుతోంది

భారత రాజ్యాంగం ప్రకారం, హిందూ వారసత్వ (సవరణ) చట్టం 2005లో అమలులోకి వచ్చింది. ఈ చట్టం కుమార్తెలు, కుమారులకు ఆస్తి హక్కు సమానం చేసింది. చట్ట సవరణ తర్వాత, కుమార్తెలు తండ్రి ఆస్తిలో కుమారుల తరహాలో ఆస్తిలో హక్కు, వాటా కోసం చూస్తున్నారు. దీని అర్థం ఏంటంటే, ఒకవేళ తండ్రికి ఆస్తి ఉంటే అందులో కుమార్తె, కుమారుడికి సమాన వాటా లభిస్తుంది. వివాహిత అయిన కుమార్తెను కూడా ఆమెకు దక్కాల్సిన వారసత్వ ఆస్తి హక్కు నుండి దూరం చేయలేరు.

గతంలో సుప్రీంకోర్టు తీర్పులు

హిందూ కుటుంబంలో జన్మించిన ఒక బాలికకు పుట్టిన వెంటనే తన కుటుంబానికి చెందిన ఆస్తిలో సమాన వాటా లభిస్తుందని సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు స్పష్టం చేసింది. ఒకవేళ కుమార్తె వివాహం చేసుకున్నప్పటికీ ఆమెను ఆస్తి హక్కు నుంచి దూరం చేయలేరని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ చట్టం హిందూ మతంపైనే కాకుండా బౌద్ధ, సిక్కు, జైన కుటుంబాలకు కూడా వర్తిస్తుంది.

ఎవరికి ఆస్తిలో హక్కు లభించదు

అయితే, కొన్ని పరిస్థితులలో కుమార్తె తండ్రి ఆస్తిపై కోర్టులను ఆశ్రయించడం కుదరదు. ఒకవేళ తండ్రి తన మరణానికి ముందు వీలునామాను సిద్ధం చేసి, అందులో కుమార్తె పేరిటి ఆస్తి రాయకపోతే, కుమార్తె ఆ ఆస్తిపై పిటిషన్ వేసే హక్కును కోల్పోతుంది. తాను సొంతంగా సంపాదించిన ఆస్తిని తల్లిదండ్రులు ఎవరికైనా ఇచ్చే హక్కు, స్వేచ్ఛ వారికి ఉంటుంది. చట్టం ప్రకారం వీలునామా చెల్లుబాటు అవుతుంది. వారసత్వంగా వచ్చిన ఆస్తి అయితే కుమార్తెలకు అందులో వాటా దక్కాలి. కానీ తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తి ఎవరి పేరిట రాస్తే, వారికే ఆస్తిపై హక్కు ఉంటుంది.

ఆస్తులు వెనక్కి తీసుకుంటున్న తల్లిదండ్రులు

కుమారుడు, కుమార్తెలకు ఆస్తులు రాసిచ్చిన తరువాత తమను కన్నబిడ్డలు సరిగ్గా చూసుకోవడం లేదని భావిస్తే తల్లిదండ్రులు వారి నుంచి ఆస్తి తిరిగి తీసుకునే హక్కు కలిగి ఉన్నారు. గత కొంతకాలం నుంచి ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. ప్రాణంగా చూసుకుని వారే సర్వస్వంగా బతికిన తల్లిదండ్రులను చివరి దశలో సరిగ్గా చూసుకోకపోతే అలాంటి పిల్లల నుంచి ఆస్తి వెనక్కి తీసుకోవాలని కోర్టులు సైతం తల్లిదండ్రులకు సూచిస్తున్నాయి. చివరి దశలో తల్లిదండ్రుల బాగోగులు చూసుకోకపోతే వారు సంపాదించిన ఆస్తిని సైతం కోల్పోతారని కోర్టులు తీర్పులు చెప్పాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కొందరు తల్లిదండ్రులు అధికారులను సంప్రదించిన సమయంలో వారి పరిస్థితి అర్థం చేసుకుని ఆస్తులను తిరిగి తల్లిదండ్రుల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలు ఉన్నాయి.