హైదరాబాద్: జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించిన టి జీవన్ రెడ్డి త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. జీవన్ రెడ్డి పార్టీని వీడటం బాధాకరమని, ఓ మంచి అవకాశాన్ని కోల్పోయారని నేతలు చెబుతున్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడటంపై దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజ్యసభ ఆఫర్ వదులుకున్న జీవన్ రెడ్డి..!
జగిత్యాల మాజీ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లడం ఒక తొందరపాటు చర్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను పార్టీలోనే కొనసాగేలా చేసేందుకు చివరి నిమిషం వరకు ఎంతో ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. జీవన్ రెడ్డికి తదుపరి విడతలో రాజ్యసభ సీటు ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ, ఆయన ఓపిక పట్టకుండా ఎమోషనల్‌గా నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరనుండటం దురదృష్టకరమని దానం వ్యాఖ్యానించారు.

జీవన్ రెడ్డి పార్టీని వీడటం బాధాకరం..
పార్టీ సీనియర్ నాయకుడిగా జీవన్ రెడ్డి ఎన్నో సేవలు అందించారని, అటువంటి నేత పార్టీని విడటం బాధాకరమని దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్‌లోని పెద్ద గణేష్ విగ్రహం వద్ద 99 రోజుల ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ప్రియాంకతో కలిసి నిర్వహించిన "ఫ్రైడే డ్రైడే" ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు.

ఇదే క్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై దానం నాగేందర్ విమర్శలు గుప్పించారు. సమస్యల పరిష్కారం కంటే పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. కేవలం ప్రచారం కోసమే దోమతెరలు వేసుకుని బయట తిరుగుతున్నారని సుధీర్ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప, ఇలాంటి విన్యాసాలు చేయకూడదని ఆయన హితవు పలికారు. సంబంధిత అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లాలని, వారు పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. కానీ ఒక్కరోజు స్టంట్స్, పబ్లిసిటీ పిచ్చితో ఏదో ఒకటి చేస్తే వైరల్ అవుతారు తప్పా, పనులు మాత్రం కావని సూచించారు.