Ind Vs Eng 2nd Odi Latest Updates: ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య రెండో వన్డే కు రంగం సిద్ధమైంది. ఒడిషా కటక్ నగరంలోని బారబతి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. మూడు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ ను 4 వికెట్లతో గెలిచిన భారత్ జోరుమీదుంది. ఇప్పటికే సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన ఇండియా.. ఈ మ్యాచ్ లోనే గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఇంగ్లీష్ జట్టుపై టీ20 సిరీస్ ను గెలుచుకుని జోరుమీదున్న సంగతి తెలిసిందే. రేపటి మ్యాచ్ లోనూ విజయం సాధించి సిరీస్ పట్టేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇక ఈ స్టేడియంలో ఇండియాకు తిరుగులేని రికార్డు ఉంది. 2003 నుంచి అసలు ఓటమన్నదే లేదు. గత ఏడు మ్యాచ్ ల్లో అజేయంగా నిలిచింది. రేపటి మ్యాచ్ లోనూ అదే సత్తా ప్రదర్శించాలని భావిస్తోంది. మరోవైపు తొలిమ్యాచ్ లో ఓడిన బట్లర్ సేన.. ఈ మ్యాచ్ లో గెలవాలని భావిస్తోంది. లేకపోతే సిరీస్ చేజారి పోతోంది. ఇప్పటికే భారత్ కు టీ20 సమర్పించుకున్న ఇంగ్లీష్ జట్టు.. కనీసం వన్డే సిరీస్ లోనైనా గట్టి పోటీ ఇవ్వాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.

13 మ్యాచ్ ల్లో విజయం..
ఇక్కడ ఇండియా దాదాపు 80 శాతం వరకు విజయాలు సాధించింది. ఇక్కడ ఆడిన 17 మ్యాచ్ ల్లో 13 వన్డేల్లో భారత్ గెలుపొందింది. దీంతో ఈ స్టేడియాన్ని లక్కీ స్టేడియంగా భారత అభిమానులు భావిస్తారు. మొత్తం మీద ఈ స్టేడియంలో 19 మ్యాచ్ లు జరుగగా, ఏడింటిలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించగా, 12 మ్యాచ్ ల్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపొందింది. దీంతో రేపటి మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ కే మొగ్గు చూపవచ్చు. రాత్రి మంచు ప్రభావం కూడా ఉండనుండటంతో రెండోసారి బ్యాటింగ్ వైపే టాస్ గెలిచిన జట్టు ఇష్టపడే అవకాశముంది. ఇక ఈ స్టేడియంలో అంత భారీ స్కోర్లు నమోదు కావు కానీ, ఇటీవల మాత్రం 300 పరుగులు పైన నమోదు కావడం తరచూ జరుగుతోంది. ఇక్కడ యావరేజీ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు కేవలం 249 కావడం గమనార్హం. ఇక ఈ స్టేడియంలో అత్యధిక స్కోరును భారతే నమోదు చేసింది. 2017లో ఇంగ్లాండ్ పై 381/6తో భారీ స్కోరు నమోదు చేసింది. ఇక అత్యల్ప స్కోరు విషయానికొస్తే పాకిస్థాన్ 148/9తో ఇంగ్లాండ్ పై 1989లో నమోదు చేసింది. ఇక చివరగా ఇక్కడ 2019లో జరిగిన వన్డే మ్యాచ్ లో వెస్టిండీస్ పై భారత్ నాలుగు వికెట్లతో కంఫర్టబుల్ గా గెలిచింది.

పేసర్లకు అనుకూలం..!
అనాదిగా ఇక్కడ పేసర్లే సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల్లో 137 వికెట్లతో పేసర్లు టాప్ లో నిలిచారు. స్పిన్నర్లు కేవలం 88 వికెట్లే తీయగలిగారు. ఇక్కడ మొత్తం 38 ఇన్నింగ్స్ లు జరిగితే కేవలం ఆరుసార్లు మాత్రమే 300+ పరుగులు రికార్డయ్యాయి. అయితే గత ఎనిమిదేళ్లలోనే నాలుగుసార్లు 300+ స్కోర్లు నమోదు కావడం విశేషం. రానురాను ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా మారుతోంది. ఇక రేపటి మ్యాచ్ లో టాస్ నెగ్గిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశముంది. అయినా టాస్ ప్రభావం కూడా నామమాత్రమే ఇక్కడ, టాస్ గెలిచిన జట్లు ఎనిమిది సార్లు గెలిస్తే, ఓడిన జట్లు 11 సార్లు విజయం సాధించాయి. ఆదివారం మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు. దీంతో భారత బ్యాటింగ్ మరింత పటిష్టమైంది. తను కూడా ఈ మ్యాచ్ లో రాణించి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు గాడిన పడాలని భావిస్తున్నాడు. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెండో వన్డేలో సత్తా చాటడం అత్యవసరం. కోహ్లీ తిరిగి రావడంతో యశస్వి జైస్వాల్ బెంచ్ కు పరిమితమయ్యే అవకాశముంది. దీంతో రోహిత్ తో పాటు గిల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు.

Also Read: Ind Vs Eng Odi Series Update: ప్రస్తుత ఇంగ్లాండ్ వాడిని కోల్పోయింది.. అలా ఓడటం ఆనవాయితీగా వస్తోందని ఆ దేశ దిగ్గజ కెప్టెన్ విమర్శలు