Hyderabad Crime News | హైదరాబాద్/నిడదవోలు: డబ్బులు ఇవ్వకపోతే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను బెదిరించి, ఆమె నుంచి రూ.2.5 కోట్ల రూపాయలు కాజేశాడు. అయినా ఇంకా డబ్బులు కావాలని వేధింపులకు పాల్పడుతుంటే, ఇక భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే..
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన యువతి చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. నగరంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఆఫీసుకు వెళ్తుంటుంది. అదే హాస్టల్‌లో ఉండే చిన్నప్పటి ఫ్రెండ్ కాజా అనూషదేవిని బాధితురాలు ఇటీవల ఆమెను కలిసింది. నినావత్‌ దేవనాయక్‌ అలియాస్‌ మధు సాయికుమార్‌ను తన భర్త అంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు అనూషదేవి పరిచయం చేసింది. టెకీ సంపన్న కుటుంబానికి చెందిన యువతి అని తెలుసుకుని దేవనాయక్‌ డబ్బులు కాజేసేందుకు ప్లాన్ చేశాడు.

అనూషదేవి నుంచి మహిళా టెకీ నెంబర్ తీసుకున్నాడు దేవనాయక్. అది మొదలుకుని మహిళా టెకీకి ఫోన్ చేసి నీ నగ్న వీడియోలు నా వద్ద ఉన్నాయి.. వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయకూడదంటే నాకు డబ్బులు ఇవ్వాలని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను డిమాండ్‌ చేశాడు. అతడి నెంబర్ టెకీ వద్ద లేకపోవడం, గొంతు మార్చి అపరిచిత వ్యక్తిలా మాట్లాడటంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ క్రమంలో టెకీని కలుసుకున్న దేవనాయక్.. ఆమె సమస్యను తాను పరిష్కరించినట్లు చెప్పి నమ్మించాడు. బ్లాక్ మెయిలర్ నుంచి ఆమెకు కాల్ రావొద్దంటూ తనకు నగదు ఇవ్వాలని పలుదఫాలుగా ఆమె నుంచి క్యాష్ తీసుకున్నాడు. ఇప్పటికే బాధితురాలు పలు విడతలుగా రూ.2.53 కోట్లకు పైగా నిందితుడికి ఇచ్చింది.
అయినా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా, అందుకు ఆమె నిరాకరించడంతో మళ్లీ బెదిరింపులు మొదలయ్యాయి. తనకు న్యాయం చేయాలంటూ మహిళా టెకీ నిడదవోలు పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఫిబ్రవరి 2న గుంటూరు జిల్లా చిన్నకాకానిలో నిందితుడు దేవనాయక్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.1.81 కోట్ల మేర ఆస్తులు సీజ్‌ చేసినట్లు తెలిపారు.