CM Vijay OSD Appointment Controversy: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే విజయ్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో సంచలనంగా మారుతున్నాయి. తన వ్యక్తిగత జ్యోతిష్యుడు, తమిళగ వెట్రి కళగం అధికార ప్రతినిధి అయిన రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంపై అటు ప్రతిపక్షాలే కాకుండా, విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న మిత్ర పక్షాలు కూడా బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

తమిళనాడు పబ్లిక్ డిపార్ట్‌మెంట్‌ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రికి రాజకీయ విభాగంంలో ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఒక జ్యోతిష్యుడిని ప్రభుత్వ ఖర్చుతో అధికారిక పదవిలో నియమించం అనేది ద్రవిడ రాజకీయాల్లో అరుదైన, వివాదాస్పద పరిణామం.

ఎవరీ రాధన్ పండిట్‌? విజయ్‌తో ఏం సంబంధం?

రాధన్ పండిట్‌ వెట్రివేల్‌ కేవలం ఒక జ్యోతిష్యుడు మాత్రమే కాదు, ఆయన టీవీకే పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే విజం సాధిస్తుందని ఆయన ముందే జోస్యం చెప్పారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయాన్ని కూడా రాధన్ పండిట్ సలహా మేరకు మార్చారు. తొలుత మే 10 మధ్యాహ్నం 3.45 గంటలకు నిర్ణయించారు. అది మంచి సమయం కాదని పండిట్ చెప్పడంతో ఉదయం పది గంటలకు మార్చారు. టీవీకే పార్టీ పేరు విజయ్ పుట్టిన వివరాలకు అనుగుణంగా, సంఖ్యాశాస్త్రం , జ్యోతిష్య సూత్రాల ప్రకారం ఉండేలా చూడటంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

మిత్రపక్షాల అభ్యంతరం

విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటులో మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, వీసీకే, సీపీఎం, ఈ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. ఒక జ్యోతిష్యుడికి ఓఎస్డీ పదవి ఎందుకని? ఎవరైనా వివరించగలరా అని కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్‌ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఒక లౌకిక ప్రభుత్వంలో జ్యోతిష్యుడిని నియమించడం ఆమోదయోగ్యం కాదని, ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వీసీకే ప్రధాన కార్యదర్శి డీ రవికుమార్ కోరారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని, మూఢనమ్మకాలను ప్రోత్సహించేలా జ్యోతిష్యుడిని ప్రభుత్వ అధికారిగా నియమించం సరికాదని సీపీఎం నేత షణ్ముగం పేర్కొన్నారు.

గతంలో కూడా ఇలానే...

తమిళనాడులో జ్యోతిష్యులకు, రాజకీయ నాయకులకు మధ్య ఉన్న అనుబంధం కొత్తేమీ కాదు. గతంలో జయలలిత వంటి నేతలకు కూడా రాధన్ పండిట్ సలహాదారుగా వ్యవహరించారు. అయతే హేతువాదం, ద్రవిడ సిద్ధాంతాలకు నియమైన తమిళనాడులో, ఒక అధికారిక పదవిని ఇలా కేటాయించడం చర్చకు దారి తీసింది.

ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు 107 సీట్లు మాత్రమే ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 118కు తక్కువగా ఉండటంతో కాంగ్రెస్, ఇతర వామపక్షాల మద్ధతుతోనే విజయ్ ప్రభుత్వం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మిత్ర పక్షాల ఆగ్రహం ప్రభుత్వ స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి