AP CM Chandrababu | కుప్పం వేదికగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మున్సిపల్ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా అభివర్ణించిన ఆయన, పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి, అధికారులను అభినందించారు. గత రెండేళ్లుగా ఎన్నో సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూనే ఈ రంగాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఒక్కరోజే రూ. 11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించామని, ప్రస్తుతం జరుగుతున్న పనులతో కలిపి మొత్తం రూ. 50 వేల కోట్ల విలువైన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఏపీ దశ-దిశ పూర్తిగా మారుతుందని పేర్కొన్నారు.

వచ్చే 6 నెలల్లో మరో రూ.17 వేల కోట్ల పనులు

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రూ. 22,330 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని, రాబోయే ఆరు నెలల్లో మరో రూ. 17,000 కోట్ల పనులను కూడా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో రూ. 7,496 కోట్లతో, ఒక్క విశాఖ కార్పొరేషన్ పరిధిలోనే రూ. 3,890 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, పార్కులు, సెంట్రల్ మీడియన్లు, సీవరేజ్ వ్యవస్థల మోడ్రనైజేషన్‌తో పాటు రిజర్వాయర్ల ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టాలని నిర్ణయించారు. వీటితో పాటు 2027 నాటికి రాష్ట్రంలోని టిడ్కో (TIDCO) గృహాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. విశాఖపట్నంలో ఇప్పటికే 28,500 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేశామని, ఎలాంటి అభ్యంతరాలు లేని ఇతర ప్రాంతాల్లో కూడా పేదలకు పట్టాలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో వీకెండ్ లో సగం ఆదాయం ఖర్చు

ఆర్థిక వ్యవస్థలో పట్టణ ప్రాంతాలు ప్రధాన గ్రోత్ ఇంజన్లుగా వ్యవహరిస్తాయని, వారాంతాల్లో ప్రజలు తమ ఆదాయంలో 61 శాతాన్ని ఖర్చు చేస్తున్నారని.. 'వీకెండ్ ఎకానమీ'ని ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు తమ ఆదాయంలో 71 శాతం హౌసింగ్, రవాణాపైనే ఖర్చు చేస్తున్నారు. కనుక అందుకే టిడ్కో గృహాలతో పాటు రవాణా సౌకర్యం కోసం 'స్త్రీశక్తి' వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 24 గంటలూ సురక్షితమైన తాగునీటిని అందిస్తామన్నారు.

గత పాలనలో 120 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోవడమే కాకుండా జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర పథకాల నిధులను పక్కదారి పట్టించారని సీఎం చంద్రబాబు విమర్శించారు. తమ ప్రభుత్వం 143 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేసిందని, వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా వ్యర్థాల నిర్వహిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి 2047 నాటికి ప్రతి మున్సిపాలిటీని స్వర్ణ మున్సిపాలిటీ'గా తీర్చిదిద్దాలని కుప్పం వేదికగా ఆయన పిలుపునిచ్చారు.