Chandrababu Naidu Bhuvaneshwari 45th Wedding Anniversary:  రాజ్యాల గెలుపోటములు, రాజకీయ పోరాటాలు, బాధ్యతల భారాల నడుమ కొన్ని అనుబంధాలు కాలంతో పాటు మరింత బలంగా మారుతాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతిమణి నారా భవనేశ్వరిల బంధం సరిగ్గా అలాంటిదే. తాజాగా వారు తమ 45వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మార్పిడి చేసుకున్న సందేశాలు, వారి మధ్య ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని, ఆప్యాయతను చాటిచెబుతూ నెటిజన్లను, టీడీపీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ముందుగా నారా భవనేశ్వరి తమ పాత జ్ఞాపకాల మధుర ఘట్టాన్ని పంచుకుంటూ.. "నారా చంద్రబాబు నాయుడు గారికి 45వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇన్ని సంవత్సరాల సాన్నిహిత్యం, స్నేహం , కలసి పంచుకున్న మధుర జ్ఞాపకాలకు ధన్యవాదాలు. ఈ ఏడాది వివాహ వార్షికోత్సవ ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా?" అంటూ సరదాగా, అత్యంత ప్రేమగా ట్వీట్ చేశారు. క్లిష్ట సమయంలోనూ ఒకరికొకరు అండగా నిలిచిన తమ దంపతుల ప్రయాణాన్ని స్మరించుకుంటూ, చిలిపి ప్రశ్నతో ముగించిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది.

Wishing @ncbn garu a very happy 45th wedding anniversary. Thankful for the many years of companionship, friendship and memories together. ❤️Any anniversary promises this year? pic.twitter.com/l18Z2PGYNW

— Nara Bhuvaneswari (@ManagingTrustee) September 10, 2026

దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన రీ-ట్వీట్ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది. "హ్యాపీ యానివర్సరీ, భు.. నన్ను అందరూ ముఖ్యమంత్రి లేదా పార్టీ అధ్యక్షుడు అని పిలవవచ్చు.. కానీ నాకు అత్యంత ఇష్టమైన, నేను ఎంతో గర్వంగా భావించే భర్త అనే హోదాను ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. ఇన్ని సంవత్సరాలుగా ఒకే ఒక్క హామీ, ప్రమాణం మార్పు లేకుండా నిలిచిపోయింది — ఈ సుదీర్ఘ జీవిత ప్రయాణంలో నీతో కలిసి చివరివరకు అడుగులు వేయడమే!" అంటూ ఎంతో భావోద్వేగంతో ఆయన బదులిచ్చారు.

Happy anniversary, Bhu. ❤️ They may call me Chief Minister or Party President… but thank you for giving me the designation I cherish most - husband.

One promise has remained unchanged all these years - to keep walking this journey with you! https://t.co/njds7Qao7Z

— N Chandrababu Naidu (@ncbn) September 10, 2026

సమకాలీన రాజకీయంలో నిరంతరం బిజీగా ఉండే అగ్రనేత, ఇంట్లో ఒక సగటు భర్తగా తన అర్ధాంగి పట్ల చూపించిన ఈ ఆప్యాయత అందరినీ కట్టిపడేసింది. 45 ఏళ్ల వివాహ బంధంలో ఎన్నో సవాళ్లు, గెలుపోటములు, సంక్షోభాలు ఎదురైనా.. భువనేశ్వరి చూపించిన సహనం, అందించిన సహకారం తన ప్రయాణానికి కొండంత బలమని చంద్రబాబు పలు సందర్భాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రజల సేవకే అధిక సమయం కేటాయించినప్పటికీ, భార్య స్థానానికి ఆయన ఇచ్చే గౌరవం ఈ ట్వీట్ ద్వారా మరోసారి స్పష్టమైంది.

అటు నాయకులు, ఇటు పౌరుల నుంచి ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలతో సందడిగా మారింది. రాజకీయాల హోరాహోరీల మధ్య ఈ దంపతుల మధ్య ఉన్న స్వచ్ఛమైన స్నేహం, అనురాగం కొత్త తరం దంపతులకు ఒక చక్కని మార్గదర్శకంగా నిలిచాయని నెటిజన్లు కొనియాడుతున్నారు. చంద్రబాబు-భువనేశ్వరిల ప్రేమ, పరస్పర గౌరవం జీవితాంతం ఇలాగే సాగాలని ఆకాంక్షిస్తూ వేలాదిమంది ఆశీస్సులు అందిస్తున్నారు.