Cab and Bike Ride Tips for Women : ఈ రోజుల్లో చాలామంది ప్రయాణించడానికి ఆన్‌లైన్ క్యాబ్‌లు, బైక్ రైడ్‌లు ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా నగరాల్లో ఉద్యోగాలకు వెళ్లేందుకు, కాలేజీకి వెళ్లేవాళ్లు కూడా వీటిని బుక్ చేసుకుంటారు. దీనికోసం ఓలా, ఉబెర్, లేదా రాపిడో వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఉపయోగిస్తారు. అలాగే ఈ సేవలు సురక్షితమైనవిగా చెప్తారు. కానీ ఇటీవలి సంఘటనలు మహిళల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తాయి.

క్యాబ్ లేదా బైక్ రైడ్ బుక్ చేసుకునేప్పుడు మహిళలు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయాణించాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఆన్‌లైన్‌లో క్యాబ్ లేదా బైక్ బుక్ చేసేటప్పుడు మహిళలు పరిగణించవలసిన ఐదు ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.

డ్రైవర్ ప్రొఫైల్

క్యాబ్ బుక్ చేసిన తర్వాత, ముందుగా డ్రైవర్ ప్రొఫైల్, రేటింగ్‌ను చెక్ చేసుకోవాలి. యాప్ డ్రైవర్ ఫోటో, వాహనం నంబర్, వారు పూర్తి చేసిన రైడ్‌ల గురించిన సమాచారాన్ని చూడాలి. డ్రైవర్‌కు తక్కువ రేటింగ్ ఉన్నా లేదా గతంలో ఫిర్యాదులు ఉన్నా.. ఏమాత్రం సంకోచించకుండా రైడ్‌ను క్యాన్సిల్ చేసుకోవడం ఉత్తమం. క్యాబ్ ఎక్కే ముందు, యాప్‌లో చూపిన డ్రైవరే మీ ఎదురుగా ఉన్న వ్యక్తి అని నిర్ధారించుకోండి.

షేర్ ట్రిప్

మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు.. మీకు నమ్మకమైన వారితో మీ ప్రయాణ సమాచారాన్ని తప్పకుండా పంచుకోండి. దాదాపు అన్ని క్యాబ్ యాప్‌లు 'షేర్ ట్రిప్' లేదా 'లైవ్ లొకేషన్' అనే ఎంపికను అందిస్తాయి. దీనివల్ల మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు మీరు ఎక్కడ ఉన్నారో.. మీ క్యాబ్ ఎక్కడికి చేరిందో.. మీరు సురక్షితంగా ఉన్నారో లేదో తెలుస్తుంది.

మ్యాప్ ఫాలో అవ్వండి

అంతేకాకుండా క్యాబ్ లేదా బైక్ ఎక్కిన తర్వాత.. మీ ఫోన్‌లో మ్యాప్‌ను తెరిచి.. డ్రైవర్ యాప్‌లో చూపిన మార్గంలోనే వెళ్తున్నాడో లేదో నిర్ధారించుకోండి. డ్రైవర్లు తరచుగా షార్ట్‌కట్‌ల పేరుతో నిర్మానుష్యమైన రోడ్లలో వెళ్తుంటారు. డ్రైవర్ నిర్దేశించిన మార్గం నుంచి పక్కకు వెళ్లడం మీరు గమనిస్తే.. వెంటనే అతడిని సరైన మార్గంలో వెళ్లమని చెప్పండి.

ఎమర్జెన్సీ బటన్

క్యాబ్, బైక్ బుకింగ్ యాప్‌లలో SOS అత్యవసర బటన్ ఉంటుంది. మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు.. ఈ ఫీచర్ ఎక్కడ అందుబాటులో ఉందో తెలుసుకోవడం ముఖ్యం. అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితిలో తక్షణ సహాయం పొందడానికి మీ ఫోన్‌లో 112 అత్యవసర నంబర్‌ను సెట్ చేసుకోండి.

ఆపేయండి.. దిగిపోండి..

ప్రయాణ సమయంలో డ్రైవర్ ప్రవర్తన అసాధారణంగా అనిపించినా లేదా మీకు అసౌకర్యంగా అనిపించినా.. మీ గమ్యస్థానానికి చేరుకునే వరకు వేచి ఉండకండి. రద్దీగా ఉండే ప్రాంతంలో, పెట్రోల్ పంపు వద్ద లేదా పోలీస్ చెక్‌పాయింట్ వద్ద ఆగి దిగడం సురక్షితమైన మార్గం. అవసరమైతే సమీపంలోని వ్యక్తుల నుంచి సహాయం కోరడానికి సంకోచించకండి. ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మీరు సేఫ్గా గమ్యస్థానానికి చేరుకుంటారు.