Union Budget : ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టి కేంద్ర బడ్జెట్ 2025 ప్రభుత్వ ఖజానా నింపేందుకు కాదని, ప్రజల జేబులు నింపేందుకు రూపొందించిందని ప్రధాని మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు కేవలం తమ ఆదాయాన్ని పెంచుకునేందుకే బడ్జెట్ ప్రవేశపెట్టవి.. కానీ దానికి విరుద్దంగా మేం ప్రజల కోసం బడ్జెట్ రూపొందించామన్నారు. "బడ్జెట్ అనేది సాధారణంగా ప్రభుత్వ ఖజానాను ఎలా నింపాలన్న విషయంపై దృష్టి పెడుతుంది. కానీ ఈ బడ్జెట్ దానికి ఖచ్చితంగా వ్యతిరేకం. ఈ బడ్జెట్ దేశ పౌరుల జేబులను నింపుతుంది. దేశ పౌరుల పొదుపుకు సహాయపడుతుంది. దేశ పౌరులు అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా చేస్తుంది. ఈ బడ్జెట్ బలమైన పునాది వేస్తుంది’’ అని పన్ను శ్లాబ్‌ను రూ.12 లక్షలకు పెంచడాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ అన్నారు.

140 కోట్ల మంది భారతీయుల కోరికలను తీర్చే బడ్జెట్

భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఈరోజు ఒక ముఖ్యమైన మైలురాయి అని మోదీ చెప్పారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని, ఇది ప్రతి భారతీయుడి కలలను నెరవేర్చే బడ్జెట్ అని తెలిపారు. యువత కోసం అనేక రంగాల్లో కేటాయింపులు ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. స్టార్టప్ లను మరింత ప్రోత్సహించేందుకు అనేక కీలక నిర్ణయాలున్నాయని, ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి సైతం అత్యంత ఎక్కువ ప్రాధాన్యత కల్పించామని చెప్పారు. ఈ బడ్జెట్‌ను నూతన శతాబ్దానికి మార్గదర్శకంగా అభివర్ణించిన పీఎం.. దేశీయ ఉత్పత్తులను పెంచేందుకు అనేక ప్రోత్సాహకాలను అందజేశామన్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకున్నామని ప్రధాని వివరించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ను అభినందించారు. జనతా జనార్దన్ [ప్రజల] కోసం ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టారన్నారు. ఈ బడ్జెట్ పొదుపు, పెట్టుబడి, వినియోగం, ఆదాయాన్ని వేగంగా పెంచుతుందని ఆకాంక్షించారు. అంతేకాకుండా అణుశక్తిలో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. "ఈ బడ్జెట్‌లో సంస్కరణల దిశగా ముఖ్యమైన చర్యలు తీసుకున్నారు. అణుశక్తిలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే నిర్ణయం చారిత్రాత్మకమైనది" అని మోదీ చెప్పారు.

Also Read : Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?