Budget 2025 Education Sector Highlights: కేంద్ర బడ్జెట్ 2025లో విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ముఖ్యంగా విద్య, నైపుణ్యాభివృద్ధికి ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు. దేశంలోని పాఠశాలలు, కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చేయూతనిస్తూనే.. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో సాంకేతిక, పరిశోధన రంగాల్లో అవగాహన పెంచేలా బడ్జెట్‌‌ రూపొందించినట్లు ఆర్థికమంత్రి సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ‘భారతీయ భాషా పుస్తక్‌ (Bharatiya Bhasha Pustak Scheme)’ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దీనిద్వారా పాఠ్య పుస్తకాలను అన్ని భారతీయ భాషల్లో డిజిటల్‌ రూపంలో తీసుకురానున్నట్లు స్పష్టంచేశారు.

బడ్జెట్ ప్రతిపాదనలు ఇలా..

➤ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ కొన్ని కీలకమైన ప్రతిపాదనలు చేశారు. రాబోయే 5 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 50 వేల 'అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌(Atal Tinkering Labs)'లను ఏర్పాటుచేయనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ ల్యాబ్‌లు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్‌ (స్టెమ్‌)లో పరిశోధనలకు తోడ్పాటు అందించనున్నాయి. విద్యార్థుల్లో కొత్త ఆలోచనలను ప్రోత్సహించేలా తోడ్పాటునందించనున్నాయి.

➤ ‘భారత్‌ నెట్‌ (Bharat Net)’ ప్రాజెక్టులో భాగంగా దేశంలోని సెకెండరీ పాఠశాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ(Broad Bank Connectivity)ని అందుబాటులోకి తీసుకురానున్నారు. సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఇది ఎంతో దోహదం చేయనుంది.

➤ దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలలో అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలని సీతారామన్‌ ప్రతిపాదించారు. 10 సంవత్సరాల కిత్రం దేశంలో ఐఐటీ సీట్ల సంఖ్య 65 వేలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 1.35 లక్షలకు చేరింది. అంటే దాదాపు 100 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదనపు మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ముఖ్యంగా 2014 తర్వాత ప్రారంభించిన 5 ఐఐటీలలో అదనంగా 6,500 మంది విద్యార్థులు చదువుకునేలా ప్రణాళికలు రచించారు.

భారీగా పెరిగిన మెడికల్ సీట్లు...

➤ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. రూ.500 కోట్లతో 'సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(COEAI)' కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. విద్యా విధానం, పరిశోధనల్లో ఏఐని అనుసంధానించేందుకు ఇది తోడ్పాటునందించనుంది.

➤ మెడికల్ ఎడ్యుకేషన్ పైనా కేంద్రం వైద్య విద్య పైనా కేంద్రం దృష్టిసారించింది. రానున్న 10 సంవత్సరాల్లో దేశంలో అదనంగా 1.1 లక్షల యూజీ, పీజీ వైద్య సీట్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాదికి కనీసం 10 వేల సీట్లు చొప్పున రానున్న 5 సంవత్సరాల్లో 75 వేల మెడికల్‌ సీట్లను పెంచాలని నిర్ణయించింది.

దేశవ్యాప్తంగా ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలు..
యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యలో చేయూత కోసం పెట్టుబడులపై దృష్టిసారించడం కోసం దేశవ్యాప్తంగా ఐదు 'నేషనల్‌ సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(NCEC)' కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా (Make in Indai), మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌(Make for the World)’ సాధనకు కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకునేందుకు, అందుకనుగుణంగా యువతను సన్నద్ధం చేయడానికి ఇవి తోడ్పడనున్నాయి. సాంకేతిక పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు వీలుగా రానున్న ఐదేళ్లల్లో ఐఐటీ, ఐఐఎస్‌సీలకు 10 వేల ఫెలోషిప్‌‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. యువతకు నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 'పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌(PM Internship Scheme)'ను గతేడాది తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిని మరింత బలోపేతం చేయనున్నారు. రాబోయే పదేళ్లలో 4.1 కోట్ల మందికి ఉపాధి కల్పనే ధ్యేయంగా కేంద్రం ముందుకెళ్తోంది.

Also Read:

ప్రతి స్కూల్‌కు ఇంటర్‌నెట్‌- బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన నిర్మల

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..