Revanth Reddy vs KCR Assembly 2026: తెలంగాణలో మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధాన్ని సూచిస్తున్నాయి. బీజేపీ ఎక్కడా కనిపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ దాదాపు 16-18 శాతానికి పడిపోవడం, కాంగ్రెస్ - బీజేపీ చెరో 8 స్థానాలు గెలుచుకోవడంతో.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యామ్నాయం తామేనని కమలనాథులు భావించారు. కానీ, గత కొన్ని రోజులుగా అసెంబ్లీ లోపల, బయట చోటుచేసుకున్న హైవోల్టేజ్ పరిణామాలను గమనిస్తే.. తెలంగాణ రాజకీయం మళ్లీ పాత రోజుల్లా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే మారిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేస్తున్న రాజకీయ వ్యూహాలు, బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు, అరెస్టులు, కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దర్యాప్తులు మొత్తం పొలిటికల్ స్పేస్‌ను ఆక్రమించేశాయి. ఈ హోరాహోరీ పోరు మధ్య బీజేపీ తీవ్రంగా వెనుకబడి, రేసులో లేనట్లే కనిపించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.

దూకుడుగా బీఆర్ఎస్

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జాతీయ అంశాల ప్రాతిపదికన వచ్చినవి తప్ప, స్థానిక రాజకీయాల్లో బీజేపీ బలం పెరిగినట్లు కాదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో క్షేత్రస్థాయి యంత్రాంగం, నిలకడైన కేడర్ ఇప్పటికీ బీఆర్ఎస్ వద్దే ఉంది. శాసనసభ వేదికగా ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కేటీఆర్, హరీశ్‌రావు నాయకత్వంలోని గులాబీ దళం దూకుడుగా ముందుకెళ్తోంది. అదే సమయంలో, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి కాంగ్రెస్‌తో నేరుగా తలపడుతున్నది కూడా బీఆర్ఎస్ మాత్రమే. దీంతో సహజంగానే మీడియా ఫ్రేమ్‌లో, ప్రజల చర్చల్లో బిఆర్‌ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తోంది.

బీజేపీని రేసులోకి రానివ్వని కాంగ్రెస్

మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలివిగా బీజేపీని రేసులోకి రానివ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డి టార్గెట్ ఎప్పుడూ కేసీఆర్ మరియు బీఆర్ఎస్ నాయకత్వమే. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు, శాసనసభలో దళిత స్పీకర్ అవమాన ఉదంతం, ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కుట్రలంటూ చర్చ అంతా తమకూ-బీఆర్ఎస్‌కూ మధ్యే పరిమితమయ్యేలా కాంగ్రెస్ నెరేటివ్‌ను సెట్ చేయగలిగింది. కాంగ్రెస్ వ్యూహంలో కేసీఆర్ విలన్‌గా, రేవంత్ నాయకుడిగా కనిపిస్తున్నప్పుడు, మూడో పక్షంగా ఉన్న బీజేపీకి ఎలాంటి పొలిటికల్ స్పేస్ లేదా ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ రచ్చ అంతటిలోనూ బీజేపీ సొంతంగా ఒక బలమైన నెరేటివ్‌ను తయారు చేసుకోవడంలో ఘోరంగా విఫలమవుతోంది.

బీజేపీ నాయకత్వం వైఫల్యం

ఢిల్లీ నాయకత్వం, లోక్‌సభ విజయాలను మాత్రమే నమ్ముకుంటే స్థానిక రాజకీయాల్లో మనుగడ కష్టమని కమలనాథులు గ్రహించలేకపోతున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు బీజేపీకి లభించే అవకాశం చాలా పరిమితంగా ఉండటంతో పాటు, వీధుల్లో కాంగ్రెస్‌ను ఢీకొట్టే ఆందోళన కార్యక్రమాలను సృష్టించడంలో పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దీంతో బీజేపీ ఇచ్చే నిరసన ప్రకటనలు బీఆర్ఎస్-కాంగ్రెస్ దాడుల ముందు కొట్టుకుపోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తదుపరి మైలేజ్‌ను నిలబెట్టుకోవడంలో బీజేపీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్‌ను ఢీకొట్టగల ఏకైక శక్త్య బీఆర్ఎస్ మాత్రమే అనే నమ్మకం మళ్లీ బలపడితే, బీజేపీ సాధించిన 8 లోక్‌సభ సీట్ల విజయం ఒక తాత్కాలిక బబుల్‌గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బీజేపీ ఇదే రకమైన సైలెంట్ రోల్ పోషిస్తే.. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్-బీఆర్ఎస్ ద్విముఖ పోరే కంటిన్యూ అవ్వడం ఖాయం.