Minister Seethakka | హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేక, ప్రశ్నించే సబ్జెక్ట్ లేక బీఆర్‌ఎస్ నేతలు శాసనసభ గేటు వద్ద డ్రామాలు ఆడారని దుయ్యబట్టారు. పోలీసులు, భద్రతా సిబ్బందిపై దౌర్జన్యం చేయడమే కాకుండా, దేవాలయం వంటి శాసనసభను నడిపిస్తున్న దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని ఉద్దేశించి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తీవ్ర దురహంకారం, కుసంస్కారంతో అసభ్యకర పదజాలంతో మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు.

స్పీకర్ పై, ఆయన తల్లిపై అత్యంత నీచమైన పదజాలంతో దుర్భాషలాడిన ఎమ్మెల్సీ తాతా మధును బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఒక అట్టడుగు వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉంటే సభకు రావడానికి కేసీఆర్‌కు మనస్కరించడం లేదన్నారు. అందుకే బయట తమ పార్టీ నాయకులతో కేసీఆర్ వికృత చేష్టలు చేయిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్‌ను అనుచిత పదజాలంతో దూషించిన సదరు నేతను వెనుకేసుకొస్తున్న కేటీఆర్, హరీష్ రావులకు కనీస సంస్కారం ఉందా అని సీతక్క ప్రశ్నించారు.

మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్

సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన BRS ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని శాసనమండలి చైర్మన్ వెంటనే రద్దు చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఆడవారి పట్ల, దళిత జాతి పట్ల బీఆర్‌ఎస్‌కు ఏమాత్రం గౌరవం ఉన్నా KCR ఆయనను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలని స్పష్టం చేశారు. యువతకు, పిల్లలకు చెడు మార్గాన్ని నూరిపోస్తూ రాజకీయాల్లో ఇటువంటి నీచ సంస్కృతిని ప్రోత్సహిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు ఎన్నికల్లో మరోసారి బొందపెట్టాలని ఆమె పిలుపునిచ్చారు.