Purification Dispute Near KCRs Erravelli Farmhouse | సిద్దిపేట: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేయడం ఇటీవల వివాదాస్పదం కావడం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు ఏడుగుర్ని అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్ వద్ద దళితులు నిరసన తెలిపారంటూ శుద్ధి కార్యక్రమం నిర్వహించి వారిని అవమానించారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వరదరాజ్ పూర్‌కు చెందిన మాజీ సర్పంచ్, మరో ఆరుగురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

విజయవాడలోని ఓ లాడ్జిలో ఉండగా సోమవారం నాడు వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి గజ్వేల్ కు తరలించారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రెండు వారాలపాటు రిమాండ్ విధించారు. రిమాండ్ అనంతరం పోలీసులు బీఆర్ఎస్ నేతలను సిద్దిపేట జైలుకు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎర్రవల్లిలోని ఫాంహౌస్ పరసరాల్లో ఫోరెన్సిక్ ఆధారాలను టీం సేకరించింది.

అసలేం జరిగిందంటే..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన తరువాత జరిగిన పరిణామాల్లో భాగంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అనుచిత వ్యాఖ్యలు చేశారని దళిత సంఘాలు ఆరోపించాయి. అందుకు నిరసనగా కాంగ్రెస్ ఎస్సీ సెల్, దళిత సంఘాలు సెప్టెంబర్ 8న ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఎర్రవల్లి ఫాం హౌస్ సమీపానికి చేరుకుని చావు డప్పు (డప్పుల మోత) తో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అయితే కాంగ్రెస్ నేతలు వెళ్లిన తరువాత బీఆర్‌ఎస్ నేతలు, బీఆర్‌ఎస్ మహిళా విభాగం అదే రోజు నిరసన తెలిపిన చోట రోడ్లపై పసుపు నీళ్లు, పాలు చల్లి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. దళితుల్ని అవమానించారనే తాము ఎర్రవల్లి ఫాం హౌస్ వద్దకు వెళ్లి నిరసన తెలిపితే.. మళ్లీ పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడం రాజకీయంగా దుమారం రేపింది. దీనిపై కాంగ్రెస్ నేతలు, దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఏడుగురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేయగా మేజిస్ట్రేట్ వారికి 14 రోజుల రిమాండ్ విధించడంతో సిద్దిపేట జైలుకు తరలించారు.