Silent Rise of Breast Cancer : రొమ్ము క్యాన్సర్ కేవలం వయసు పైబడిన మహిళలకే వస్తుందని చాలామంది ఇప్పటికీ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం వేగంగా మారుతోంది. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇండియాలో ఆందోళనకరంగా మారింది. బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. గణాంకాల ప్రకారం.. 2012 నుంచి 2022 మధ్య పదేళ్లలో రొమ్ము క్యాన్సర్ రేటు సంవత్సరానికి సుమారు 1.4 శాతం పెరిగింది. ఇది 50 ఏళ్లు పైబడిన మహిళల కంటే కూడా ఎక్కువ.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యువతులలో ఈ ప్రాణాంతక వ్యాధి పెరగడానికి ప్రధాన కారణం ఆధునిక జీవనశైలి. దీనివల్ల చాలామందిలో మద్యం వినియోగం కూడా పెరిగింది. దీనివల్ల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరిగి.. DNA దెబ్బతింటుంది. ఈ రసాయన మార్పులు క్యాన్సర్ కణాలను క్రియాశీలం చేయడానికి నేరుగా సహాయపడతాయి. అందుకే చిన్న వయసులోనే తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి.

ఊబకాయం

ఊబకాయం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదానికి మరొక కారణంగా చెప్తున్నారు. నిశ్చలమైన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, అదుపులేని బరువు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. శరీరంలో కలిగే వాపు, క్యాన్సర్ కణాలు వేగంగా వ్యాప్తి చెందడానికి హెల్ప్ చేసి.. ప్రమాదాన్ని పెంచుతున్నాయని అంటున్నారు. ఇవి కాకుండా BRCA1, BRCA2 వంటి జన్యువులలో మార్పులు కూడా క్యాన్సర్‌కు కారణం కావచ్చు. అయినప్పటికీ అటువంటి జన్యుపరమైన కేసుల సంఖ్య పరిమితంగానే ఉందట.

పర్యావరణ కారకాలు..

క్యాన్సర్ వ్యాప్తిలో ఇప్పుడు పర్యావరణ కారకాలు కూడా పాత్ర పోషిస్తున్నాయి. పెరుగుతున్న కాలుష్యం, ఆహార, పానీయాలలోని మైక్రోప్లాస్టిక్‌లు శరీర అంతర్గత వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. మన చుట్టూ ఉన్న కలుషిత పర్యావరణం యువతుల ఆరోగ్యంపై సైలెంట్ కిల్లర్గా మారుతున్నాయని పరిశోధనలు చెప్తున్నాయి.

అవగాహన ఉండట్లేదు..

రొమ్ము క్యాన్సర్ పెరగడానికి.. అత్యంత తీవ్రంగా మారడానికి అసలు కారణం అవగాహన లేకపోవడమే. చాలా మంది యువతులు తమకు చిన్న వయసులో క్యాన్సర్ రాదని అనుకుంటారు. ఈ అపోహ కారణంగా వారు ప్రారంభ మార్పులను నిర్లక్ష్యం చేస్తారు. రొమ్ములో చిన్న, నొప్పిలేని గడ్డ కనిపించడం.. చర్మం ఎర్రబడటం లేదా ముడతలు పడటం అనేవి రొమ్ము క్యాన్సర్ ప్రధాన లక్షణాలు. వీటిని ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం.

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు..

వైద్యపరంగా కనిపించే ఇతర లక్షణాలలో చనుమొన నుంచి అసాధారణంగా రక్తం లేదా ఇతర ద్రవం రావడం జరుగుతుంది. రొమ్ము పరిమాణం లేదా ఆకారంలో ఆకస్మిక మార్పు రావడం వంటివి ఉంటాయి. ఇది కాకుండా ఎటువంటి కారణం లేకుండా శరీరంలో నిరంతరం తీవ్రమైన బలహీనత, అలసటను ఉంటుంది. దానిని సాధారణమైనదిగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి ముందుగా గుర్తించడమే ఏకైక, ఉత్తమమైన మార్గం.

ఆ తప్పులు చేస్తే..

యువతులలో రొమ్ము కణజాలం దట్టంగా ఉంటుంది. దీనివల్ల సాధారణ మామోగ్రఫీ లేదా స్క్రీనింగ్ సమయంలో చిన్న గడ్డలను గుర్తించడం కష్టమవుతుంది. యువతులు తరచుగా వాటిని సాధారణ హార్మోన్ల మార్పులుగా లేదా కొవ్వు గడ్డలుగా (ఫైబ్రోఅడెనోమాలు) భావించి.. వైద్యుడిని సంప్రదించడంలో ఆలస్యం చేస్తారు. ఈ ఆలస్యం వల్ల మొదటి దశ రొమ్ము క్యాన్సర్ 3 లేదా 4వ దశకు చేరుకుని, చికిత్స మరింత కష్టతరం కావచ్చు.

మీ రొమ్ముల్లో మార్పులు గమనిస్తే.. ఎలాంటి సిగ్గు లేదా భయం లేకుండా వైద్యుడిని సంప్రదించాలి. జీవనశైలిలో మార్పులు, పోషకాహారం, క్రమం తప్పని వ్యాయామం ఈ ప్రమాదాన్ని తగ్గించగలవు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.