ఆదిలాబాద్ జిల్లా బోరింగ్ గూడలో వేసవిలో బోరు నుంచి ఉబికి వస్తున్న నీరు

బోరింగ్ వల్లే బోరింగ్ గూడ గ్రామంగా పేరు.!

ఆదిలాబాద్ జిల్లాలో ఈ వేసవిలో భానుడి భగభగ తీవ్రంగా కొనసాగుతోంది. 45°డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వేడి ఉక్కపోత వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న ఎండల కారణంగా జిల్లాలోనీ పలు ప్రాంతాల్లో బోర్లు, వాగులు, చెరువులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కానీ ఇంతటి ఎండల్లోను ఓ గ్రామంలో మాత్రం ఓ బోరు నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఇంతకు ఆ ఉబికి వస్తున్న నీళ్ల బోరుబావి ఎక్కడ ఉంది. abp దేశం స్పెషల్ స్టోరీలో చూద్దాం.

ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఓ మారుమూల గ్రామం ఇది. దీని పేరు బోరింగ్ గూడ. ఇక్కడ 70కి పైగా కోలాం ఆదివాసి గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా ఎక్కువగా అడవి పై ఆధారపడి జీవిస్తున్నారు. అడవుల్లో లభించే వెదురు కర్రలతో తడకలు, బుట్టలు, గుల్లలు అల్లి వాటిని ఇంద్రవెల్లిలోని వారసంతకు తీసుకొచ్చి అమ్మి వచ్చిన డబ్బులతో ఇంటికి అవసరమయ్యే సరుకులు కొనుగోలు చేసి పూట గడుపుతారు. ఇక వర్షాకాలంలో అయితే పోడు భూములలో పత్తి, కంది, జొన్న, మొక్కజొన్న, ఇతర పంటలు వేసి వర్షాధార వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

గత 35 ఏళ్ల క్రితం ఈ గ్రామం పక్కనున్ను రాజుగూడ సమీపంలో ఉండేది. అప్పటి వీరి గ్రామం పేరు సోనుగూడ. అయితే సోనుగూడలో అప్పట్లో తాగునీటి ఇబ్బంది అధికంగా ఉండేది. అయితే వారి వ్యవసాయ భూమి ఉన్న ఈ ప్రాంతంలో ఓ బోరు వేయగా పుష్కలంగా నీళ్లు వచ్చాయి. ఆ నీళ్ళు బోరు నుంచి ఉబికి వస్తున్నాయి. బోరులో నుండి ఉబికి వస్తున్న నీళ్లను చూసిన గ్రామస్తులంతా సోనుగూడను వదిలి ఒక్కొక్కరుగా వలస వచ్చి ఈ వ్యవసాయ భూమిలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు.

సోనుగూడలో ఉన్న గ్రామస్తులంతా గ్రామాన్ని ఖాళీ చేశాక.. ఇక్కడే ఒక గ్రామంగా ఏర్పడింది. ఇక అందరూ గ్రామానికి ఏం పేరు పెట్టాలని నిర్ణయించుకోగా... 24గంటలు ఉబికి వచ్చే నీళ్ళ బోరింగ్ ఉంది అని అలా అందరు బోరింగ్ గూడ అని పిలుస్తూ పొగా..గ్రామానికి బోరింగ్ గూడ అని నామకరణం చేశారు. బోరు నుంచి ఉబికి వస్తున్న ఈ నీళ్ళ వల్ల ఇలా బోరింగ్ గూడ అని పేరు రావడం ఒక చరిత్ర.

అయితే తమ పాత గ్రామమైన సోనుగూడలో నీళ్ళ కష్టాలు చాలా ఉండేదని, అందుకే తమ కష్టాలు చూసి దేవుడే తమను ఇక్కడకి పంపాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఏడాది పాటు వేసవిలోనూ ఇలా బోరు నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయని ఈ బోరింగ్ గూడ తమ అదృష్టమని అంటున్నారు. బోరింగ్ గూడలో ప్రస్తుతానికి 70 కి పైగా కోలాం ఆదివాసి గిరిజన కుటుంబాలు ఉన్నాయని, గ్రామంలో ఉన్న వారంతా ఈ నీటినే తాగుతూ అన్నిటికీ ఉపయోగిస్తున్నారు.

మడావి చిన్ను పటేల్, (బోరింగ్ గూడ గ్రామ పటేల్)

ఇక ప్రస్తుతం తమకు ఇందిరమ్మ ఇళ్లు కూడా వచ్చాయి. ఇళ్లు కట్టుకుంటున్నామని, ఆ ఇళ్లకు ఈ బోరు నీళ్ళు వేస్తున్నామని ఈ బోరు తమకు ఓ వరప్రదాయని అని దేవుడిచ్చిన వరం అని బోరింగ్ గూడ గ్రామ పటేల్ మడావి చిన్నుపటేల్, గ్రామస్తురాలు టెకం నాగుబాయి abp దేశంతో తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. తమ గ్రామంలో ఉబికి వస్తున్న ఈ బోరు నీళ్లను చూసేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారని ఈ బోరుబావిని చూసి ఆశ్చర్యపోతుంటారని తమతో వచ్చి కలిసి మాట్లాడుతూ.. బోరు నీళ్లను తాగుతూ దాని రుచి చూస్తుంటారని, బాటిల్స్‌లోనూ ఈ నీళ్లను తీసుకెళ్తుంటారని, బోరు నీళ్ళ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ సందడి చేస్తూ తిరిగి వెళుతుంటారని, తమ బోరు వల్ల బోరింగ్ గూడ గ్రామం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పరిచయం అవుతుందన్నారు.

టెకం నాగుబాయి (బోరింగ్ గూడ గ్రామస్తురాలు)

రోడ్డుమార్గం లేక ఇబ్బందులు

తమ గ్రామానికి రావాలంటే అటవీ ప్రాంతంలో అటవీ ఆంక్షల వల్ల రహదారి నాలుగు కిలోమీటర్ల వరకు సరిగా లేదని, తమకు దగ్గరగా ఇంద్రవెల్లి ఉంటుందని బోరింగ్ గూడ నుండి 16 కిలోమీటర్లు మాత్రమే ఉందని, ఏ పనైనా ఇంద్రవెల్లి వారసంతకు వెళ్లి తమ ఇంటి అవసరాల కోసం వస్తువులు కొనుగోలు చేసుకుని తిరిగి వస్తుంటామని, ప్రభుత్వం ఐటీడీఏ అధికారులు తమకు రవాణా సౌకర్యం మెరుగుపరిచే దిశగా రహదారి నిర్మించాలని వేడుకుంటున్నారు.