Andhra Pradesh Assembly Sessions | ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏపీ పాలిటిక్స్ కి సంబంధించి బోండా ఉమా vs పవన్ కళ్యాణ్ అనే అంశం ఫై చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వేసిన ప్రశ్నలకు ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. పారిశ్రామిక వ్యర్థాలకు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలా పనిచేస్తుంది కొన్ని కంపెనీలు అధిక పొల్యూషన్ విడుదల చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు లేట్ అవుతుంది అంటూ ప్రజా ప్రతినిధి హోదాలో అసెంబ్లీలో బోండా ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నలోనే భాగంగా పొల్యూషన్ బోర్డ్ చైర్మన్ సరిగ్గా స్పందించడం లేదంటూ అంటూనే ఆ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ కూడా అందుబాటులో ఉండడం లేదంటూ తనతో అన్నారని అర్థం వచ్చేలా బోండా ఉమ మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం ఇస్తూ అన్ని ఒక్కరోజులోనే అయిపోవని తాము అధికారంలోకి వచ్చాకే జనసేన సూచనల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో కదలిక వచ్చిందంటూ సామాన్య ప్రజల సైతం వచ్చి ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకున్నామంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై ఆచితూచి వ్యవహరించాలని ఒకవేళ తొందరపడి చర్యలు తీసుకోవడం మొదలుపెడితే కంపెనీలు ఏపీ నుండి వెళ్లిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. నిజానికి ఒక మంత్రికి ఎమ్మెల్యే కి మధ్య జరిగిన ఒక మామూలు ప్రశ్న -జవాబు ప్రక్రియ ఇది. దీనిపై సోషల్ మీడియాలో జనసేన టిడిపి మధ్య పెద్ద రచ్చే మొదలైంది.

ఒకరిపై ఒకరు పోటీపడి పోస్టులు పెట్టుకుంటున్న టిడిపి, జనసేన

తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ని టిడిపి ఎమ్మెల్యే కావాలనే ప్రశ్నించారని అందుబాటులో ఉండరంటూ అర్థం వచ్చేలా మాట్లాడారని జన సైనికులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాస్త పరుషంగానే ఎక్స్ లో ట్వీట్లు పెడుతున్నారు. ఆ పోస్టుల్లో ఏకంగా చంద్రబాబు జైలు జీవితం వరకూ చర్చకు రావడం అనేది ఇరు పార్టీల అగ్ర నాయకత్వాన్ని అప్రమత్తం చేసింది. దానితో వెంటనే రెండు పార్టీలు దిద్దుబాటు చర్యలకు ముందుకు వచ్చాయి.

పవన్ కళ్యాణ్ ని పొగడ్తల్లో ముంచెత్తిన టీడీపీ MLA బోండా ఉమా

టిడిపి జనసేన మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్ గమనించిన బోండా ఉమా తాను ప్రశ్న అడిగిన విధానంలో జరిగిన పొరపాటును గమనించారో లేక టిడిపి అధిష్టానం నుంచి ఫోన్ వెళ్లిందో తెలియదు గానీ వెంటనే పవన్ కళ్యాణ్ పొగుడుతూ వరుస ట్వీట్లు పోస్ట్ చేసారు. "పవన్ కళ్యాణ్ గైడెన్స్ లో పని చేయడం ఎంతో బాగుందని, తాను సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగానే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకున్నారని " పవన్ కళ్యాణ్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఎలాగైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆత్రుత ఆయనలో కనబడింది. దీనితో జనసైనికులు కొంత మేర శాంతించినట్టే కనిపిస్తోంది.

అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం. https://t.co/LrcB2AFbeO

— Bonda Uma (@IamBondaUma) September 20, 2025

వివాదం మధ్యలో దూరిన వైసీపీ

ఇప్పుడు ఈ వివాదంలోకి వైసిపి ఎంటర్ అయింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదని ఏకంగా కూటమి ఎమ్మెల్యే ననే ఆరోపించారు అంటూ ఈ వివాదాన్ని మరింత రాజేసే ప్రయత్నం చేశారు. ఈరోజు నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వివాదం మరోసారి చర్చకు వస్తుందా కూటమి నేతలు అధికారికంగా ఈ వివాదానికి పుల్ స్టాప్ పెడతారా అనేది ప్రస్తుతం ఏపీలో ఆసక్తిగా మారింది. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఒక మంత్రికి ఎమ్మెల్యేకు జరిగిన మామూలు చర్చ ఫై పవన్ అభిమానులు సోషల్ మీడియాలో కాస్త అతిగా రియాక్ట్ అయ్యారేమో అన్న వాదన మొదలైంది.