Sharwanand Biker Review In Telugu: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ కథానాయకుడిగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా 'బైకర్'. ఆయన తండ్రిగా యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటించారు. మాళవికా నాయర్ హీరోయిన్. బైక్ రేసింగ్ కథతో తెరకెక్కిన చిత్రమిది. సంక్రాంతికి విడుదలైన 'నారీ నారీ నడుమ మురారి'తో శర్వానంద్ సక్సెస్ కొట్టారు. దాన్ని కంటిన్యూ చేసేలా 'బైకర్' ఉందా?

కథ (Biker Movie Story): వికాస్ నారాయణ్ (శర్వానంద్) బైక్ రేసర్. కన్నతండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్)యే అతని కోచ్. ఇండియాలో బైక్ రేసింగ్‌కు క్రేజ్ లేని సమయంలో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం వస్తుంది. తండ్రీ కుమారులు మలేషియా వెళతారు. అక్కడ రేస్ పూర్తైన వెంటనే మరొక రేసుకు వెళ్ళకుండా ఇండియా వచ్చేస్తారు. తండ్రికి కనిపించకుండా దూరంగా వెళతాడు విక్కీ అలియాస్ వికాస్ నారాయణ్.

తండ్రీ తనయులు సునీల్, వికాస్ మధ్య దూరం ఏర్పడటానికి కారణం ఏమిటి? తండ్రికి దూరంగా వెళ్లిన వికాస్, మళ్ళీ వెనక్కి వచ్చి రేసింగ్ చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు? కొడుకును మళ్ళీ దగ్గరకు తీసి ట్రైనింగ్ ఇచ్చాడా? లేదా? విక్కీని రేసింగ్ చేయవద్దని భార్య అనూష (మాళవికా నాయర్) ఎందుకు చెప్పింది? విక్కీ ఓటమిని కోరుకుంటున్న ఇంద్రనీల్ (అతుల్ కులకర్ణి) ఎవరు? నారాయణ్ ఫాదర్ అండ్ సన్స్‌, ఆయనకు మధ్య ఏం జరిగింది? వరల్డ్ ఛాంపియన్షిప్‌లో విక్కీ విజేతగా నిలిచాడా? లేదా? అనేది సినిమా.

విశ్లేషణ (Biker Review Telugu): స్పోర్ట్స్ డ్రామాలు అన్నిటిలో 'పడిలేచిన కెరటం' తరహా కథలను చెబుతారు. అందువల్ల క్యారెక్టర్లలో కొత్తదనం ఉన్నప్పటికీ... కథ, కథనాలు రొటీన్ అనే విమర్శ వినిపిస్తుంది. బట్, ఫర్ ఏ ఛేంజ్... 'బైకర్'లో రొటీన్ కథ లేదు. బైక్ రేసింగ్ నేపథ్యంలో తండ్రీ కొడుకుల ఎమోషన్ హైలైట్ చేస్తూ తీసిన చిత్రమిది.

బైక్ రేసింగ్ అనేది ఇండియాలో పాపులర్ కాదు. అయినా సరే రేసింగ్ సీన్లను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా చాలా బాగా తెరకెక్కించారు దర్శకుడు అభిలాష్ రెడ్డి. రేస్ వరకు వచ్చేసరికి ఆ సీన్స్ బాగా తీశారు. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్ సీన్స్ కూడా బాగా తీశారు. అయితే... ఆ రెండిటినీ బ్యాలెన్స్ చేయడంలో తడబడ్డారు. నిడివి పెంచుతూ వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. 'బైకర్'కు ప్రధాన సమస్య... ఈ సినిమాను స్టార్ట్ చేసిన విధానం. బైక్ రేసింగ్ కథ అయినప్పటికీ... శర్వా, మాళవిక మధ్య ప్రేమకథ - అబ్బాయితో శర్వా సన్నివేశాలు గానీ 'జెర్సీ'ని గుర్తు చేస్తాయి. ముఖ్యంగా మాళవికా నాయర్ క్యారెక్టర్. అందువల్ల, ఫస్టాఫ్ అసలు ఎంగేజ్ చేయదు. తండ్రీ తనయుల మధ్య ఎమోషన్, ఆ సన్నివేశాలను మొదటి నుంచి బలంగా బిల్డ్ చేస్తే బావుండేది.

Also Read: Raakaasaa Review - 'రాకాస' రివ్యూ: సంగీత్ శోభన్ హ్యాట్రిక్ కొట్టాడా? నిహారిక కొణిదెల నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

'బైకర్'కు సమస్య... మోటోరేస్ / బైక్ రేసింగ్ అనేది ప్రేక్షకులకు తెలియకపోవడం కాదు. సరైన విలన్ లేకపోవడం. తండ్రీ తనయుల మధ్య బాండింగ్ లేదన్నట్టు మొదటి నుంచి చూపించినా... తండ్రి కోసం తనయుడు రావడం బావుంది. అయితే ఆ వచ్చేటప్పుడు చూపించిన కారణాలు, తండ్రికి దూరంగా తనయుడు అన్ని రోజులు దూరంగా ఉండటానికి గల కారణం ఆకట్టుకునేలా లేదు. అయితే చివరిలో ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం కట్టిపడేశాయి. క్లిప్ జంప్, క్లైమాక్స్ సినిమాకు బలంగా నిలిచాయి. టెక్నికల్ పరంగా సినిమా బావుంది. సినిమాటోగ్రఫీ, పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి. జిబ్రాన్ ఆర్ఆర్ సినిమాకు బలంగా నిలిచింది. రేసింగ్ సీన్స్ చూసేలా చేసింది. యువి క్రియేషన్స్ ఖర్చుకు వెనుకాడలేదు.

'బైకర్'కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్... శర్వానంద్ నటన, ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్. పద్దెనిమిదేళ్ల కుర్రాడు అంటే ప్రేక్షకులు ఎవరైనా సరే ఈజీగా నమ్మేస్తారు. అంత సన్నబడ్డారు (సినిమా కోసం 23 కేజీలు తగ్గారు). నటుడిగానూ ది బెస్ట్ ఇచ్చారు. ఇక శర్వాతో పాటు రాజశేఖర్ సైతం సినిమాకు ప్లస్ అయ్యారు. తండ్రిగా తన నటనలో హుందాతనం చూపించారు. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చూపించారు. క్లైమాక్స్ వచ్చేసరికి డైలాగులు లేవు... తండ్రీ తనయుల మధ్య ఎమోషనల్ సన్నివేశాల్లో శర్వా, రాజశేఖర్ నటన కంటతడి పెట్టిస్తుంది. శర్వా సరసన భార్యగా మాళవికా నాయర్ చూడముచ్చటగా ఉన్నారు. అయితే ప్రేయసిగా కనిపించే సన్నివేశాల్లో ఆమె మిస్ ఫిట్ అనిపిస్తారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు తమ పాత్రల మేరకు నటించారు.

టెక్నికల్లీ 'బైకర్' బావుంది. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, సాంగ్స్ & ఆర్ఆర్ వంటివి అప్రిషియేట్ చేసేలా ఉన్నాయి. అయితే... కథలో పూర్ విలన్ ట్రాక్, స్ట్రాంగ్ కాన్‌ఫ్లిక్ట్‌ లేకపోవడం వల్ల తండ్రీ కొడుకుల ఎమోషన్ డైల్యూట్ అయ్యింది. ఎంగేజ్ చేస్తూ రేసీగా వెళ్లాల్సిన సినిమా నిదానంగా ముందుకు కదిలింది. శర్వానంద్, రాజశేఖర్ మాత్రం తమ నటనతో మెప్పించారు. స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే కాస్త శాటిస్‌ఫై అవ్వొచ్చు. శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్ మాత్రం సూపర్బ్. ఆయన్ను అప్రిషియేట్ చేయాలి.

Also Read: Carmeni Selvam Review - 'కార్మేని సెల్వం' రివ్యూ: తప్పులు చేయించే అప్పులు - మిడిల్ క్లాస్ కష్టాలపై సినిమా ఎలా ఉందంటే?