Patna police suspension: బిహార్‌లోని మేకమా ప్రాంతంలో జరిగిన ఒక వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. సాధారణంగా పోలీసులు ఎవరి ఇంటికైనా రైడ్‌కు వెళ్తే.. అక్కడ ఉన్నవాళ్లు వణికిపోవాలి, పోలీసులు సోదాలు చేయాలి. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది! నువ్వు పోలీసువైతే నాకేంటి.. ముందు నా తనిఖీ దాటుకుని లోపలికి వెళ్లు అన్నట్లుగా ఒక చిన్న పిల్లాడు ఏకంగా తుపాకులు పట్టుకున్న పోలీసులనే తనిఖీ చేసి పంపించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

బనీను వేసుకున్న ఒక కుర్రాడు గేటు దగ్గర నిలబడి, లోపలికి వస్తున్న ప్రతి పోలీసు అధికారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సదరు పోలీసులు కూడా ఎంతో వినయంగా, క్రమశిక్షణ గల విద్యార్థుల్లా ఆ పిల్లాడి ముందు చేతులు చాచి తనిఖీ చేయించుకుంటున్నారు. వెనుక నుంచి ఒక మహిళ లైన్లో వెళ్లని పోలీసుల్ని హెచ్చరించారు. ఏయ్ పోలీసులు ఇటు రండి, లైన్లో నిలబడండి, ఇటు నుంచే వెళ్ళాలి అని ఆర్డర్లు వేస్తుంటే, మన పోలీసులు 'జీ హుజూర్' అన్నట్లుగా ఆ గట్టు దాటుతున్నారు. ఇది పోలీస్ రైడా లేక పిల్లాడితో ఆడుకుంటున్న దొంగ-పోలీస్ ఆటా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Bihar is not for beginners.
A team of @bihar_police went to arrest a member of the Sonu-Monu gang in the Mokama area of Bihar’s Patna district where policemen themselves were frisked by so called desi body guards of the Gangster before they were allowed entry inside the… pic.twitter.com/4MjA3Eu5FB

— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) May 26, 2026

అసలు ఈ రైడ్ ఎందుకు జరిగిందంటే.. సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వల్ల రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవ జరిగి, కాల్పుల వరకు వెళ్లింది. దీంతో సోను-మోను గ్యాంగ్ ఇంట్లో సోదాలు చేయడానికి వెళ్లిన పోలీసులకు ఈ అపురూప గౌరవం దక్కింది. పోనీ, తనిఖీలతో ఆగారా అంటే అది లేదు! లోపలికి వెళ్ళాక ఒక మహిళ ఫోన్ ఇస్తే, అందులో పరారీలో ఉన్న నేరస్థుడితో మన పోలీసులు ముచ్చట్లు కూడా పెట్టారట. నేరస్థుల్లో వణుకు పుట్టించాల్సిన పోలీసులు.. నేరస్థుల ఇంట్లో చిన్న పిల్లాడి దగ్గర వణికిపోతూ తనిఖీ చేయించుకోవడం చూసి పాట్నా ఎస్ఎస్పీ కార్తికేయ కుమార్ శర్మ కి చిర్రెత్తుకొచ్చింది.

गैंगस्टर के सामने तिग्गी बनी बिहार पुलिस,, दबिश देने गए थे, लेकिन खुद की तलाशी करवानी पड़ गई 😃

गैंगस्टर का भाई बोला पहले में एक-एक पुलिसकर्मी और अधिकारियों की तलाशी लूंगा उसके बाद ही तुम लोग मेरे घर की तलाशी लेना 😄 #bihar pic.twitter.com/yal1PTBr8Y

— ocean jain (@ocjain4) May 24, 2026

తక్షణమే స్పందించిన ఎస్ఎస్పీ .. విధి నిర్వహణలో ఇంతటి వినయాన్ని ప్రదర్శించిన పంచమహల , హాథీదా పోలీస్ స్టేషన్ల ఎస్ హెచ్ ఓ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పోలీసుల ఇమేజ్‌ను బజారున పడేశారని వారిపై విచారణకు ఆదేశించారు. అయితే, ఒక మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత మంత్రి మాత్రం దీనిని వెనకేసుకొచ్చారు.

బిహార్ పోలీసులు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. గ్యాంగ్‌స్టర్ల ఇళ్లకు వెళ్లినప్పుడు ఎంత మర్యాదగా ఉండాలో వీరు చూపించిన తీరు చూసి, మిగిలిన రాష్ట్రాల పోలీసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఖాకీ డ్రెస్సులో ఉన్న పౌరుషం కన్నా, అక్కడ గ్యాంగ్‌స్టర్ల ఇంటి పరువుకే పోలీసులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఘటనతో మేకమా ప్రాంతంలో ఉన్న గ్యాంగ్ వార్లతో పాటు, పోలీసుల నిస్సహాయత కూడా మరోసారి బయటపడింది.