Bigamy Case: భర్తకు అంతకుముందే వివాహమైన విషయం తెలియకుండా అతడిని పెళ్లి చేసుకున్న మహిళ బహుభార్యత్వ (Bigamy) నేరస్థురాలు కాదని మద్రాస్ హైకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. తన భర్త మొదటి వివాహాన్ని దాచిపెట్టి తనను మోసగించాడని పేర్కొంటూ, ముందస్తు బెయిల్ కోరిన ఒక మహిళ పిటిషన్‌పై జస్టిస్ ఎన్. రమేష్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

కేసు ఏంటి?

ఒక వ్యక్తికి ఇప్పటికే పెళ్లి కాగా, ఆ విషయాన్ని దాచిపెట్టి రెండో వివాహం చేసుకున్నాడు. దీనిపై అతడి మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, రెండో భార్యపై కూడా కేసు నమోదైంది. దీంతో ఆ మహిళ తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తాను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకునే సమయానికి అతడికి మొదటి వివాహం అయినట్లు తనకు తెలియదని, తాను కేవలం మోసానికి గురయ్యానని కోర్టుకు తెలిపింది.

Also Read: సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?

న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనల మేరకు జస్టిస్ ఎన్. రమేష్, బహుభార్యత్వ నేరం కింద జీవించి ఉన్న జీవిత భాగస్వామి మాత్రమే నేరస్థుడవుతాడని స్పష్టం చేశారు. అతడికి పెళ్లైన విషయం తెలియకుండా వివాహం చేసుకున్న మహిళను సెక్షన్ 82 కింద నేరస్థురాలిగా పరిగణించలేమని స్పష్టం చేశారు. ముందస్తు బెయిల్ ఇచ్చే సమయంలో ఆ మహిళకు భర్త మొదటి పెళ్లి గురించి ముందే తెలుసు అనే ఆధారాలను ప్రాసిక్యూషన్ చూపించలేకపోయిందని కోర్టు గుర్తించింది. ఆరోపణలు, మహిళ పాత్ర, కస్టడీ విచారణ అవసరం లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

అయితే, సదరు మహిళకు మొదటి పెళ్లి గురించి నిజంగా తెలియదా? లేదా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని, ఈ ముందస్తు బెయిల్ ఆదేశాలు కేసు దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం చూపవని కోర్టు స్పష్టం చేసింది.

Also Read: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!