BCCI Considers Parthiv Patel And Pragyan Ojha To Replace Ajit Agarkar: టీమ్ ఇండియా సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి అజిత్ అగార్కర్ తప్పుకోనుండగా, ఆ కీలక బాధ్యతలను చేపట్టేందుకు భారత మాజీ క్రికెటర్లు పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజాలు ప్రధాన పోటీదారులుగా బరిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అగార్కర్ కాంట్రాక్ట్ ఈ నెలతోనే అధికారికంగా ముగియనుంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు అతడి పదవీకాలాన్ని పొడిగిస్తారనే ప్రచారం జోరుగా సాగినప్పటికీ, బీసీసీఐలోని ఒక కీలక వర్గం మాత్రం అగార్కర్ బాధ్యతలు దాదాపు ముగిసినట్లేనని తీర్మాణించింది. గత కొన్ని రోజులుగా అగార్కర్ భవిష్యత్తుపై తీవ్ర ఊహాగానాలు కొనసాగుతుండగా, శుక్రవారం జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) కొత్త సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికపై స్పష్టత రానుంది. ఈ సమావేశంలో అగార్కర్‌కు పొడిగింపు లభించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్న‌ట్లు స‌మాచారం.

Read Also: IND VS Windies Team India Selection: పంత్‌ను పక్కనపెట్టి జురెల్‌కు లైఫ్‌లైన్.. విండీస్ సిరీస్ వన్డే జట్టులోకి నితీష్ రెడ్డి

చివ‌రి భేటీ..
బుధవారం నాటి సమావేశమే చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్‌కు చివరి ఎంపిక భేటీ కావచ్చని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌తో పాటు ఇరానీ ట్రోఫీలో తలపడే రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లను అగార్కర్ నేతృత్వంలోని కమిటీ విజయవంతంగా ఎంపిక చేసింది. కొత్త చీఫ్ సెలెక్టర్ కోసం బీసీసీఐ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. భారత జట్టు మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్, మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాలు ఈ రేసులో అందరికంటే ముందు వరుసలో నిలిచారు. వీరిద్దరూ గతంలో ఆటగాళ్లుగా మూడుసార్లు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన అనుభవం కలిగి ఉండటం విశేషం.

Read Also: IPL Auction In India.!: మూడేళ్ల తర్వాత భారత్‌ లో ఐపీఎల్ వేలం.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై పునరాలోచనలో బీసీసీఐ, అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు

రోహిత్ పై చ‌ర్చ‌..
వెస్టిండీస్ వన్డే సిరీస్ కోసం వెటరన్ బ్యాటర్ రోహిత్ శర్మను జట్టులోకి ఎంపిక చేయడం బోర్డులో చర్చనీయాంశంగా మారిన‌ట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ లేడంటూ సెలెక్టర్లు అంతకుముందే సంకేతాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. గత ఇంగ్లాండ్ వన్డే పర్యటనలో ఆరంభంలో తక్కువ స్కోర్లకే ఔటవడంతో రోహిత్ స్థానంపై విమర్శలు చెల‌రేగాయి. అయితే 39 ఏళ్ల ఈ స్టార్ ఓపెనర్ ఆఖరి వన్డేలో 138 పరుగుల వీరోచిత సెంచరీ బాది విమర్శకుల నోళ్లకు తాళం వేశాడు.

ఊహ‌గానాల‌కు తెర‌..
రోహిత్ శర్మ భవిష్యత్తుపై వెలువడిన ఊహాగానాలను బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెర‌దించారు. సెలెక్టర్ల ప్రణాళికల్లో ఉన్నంతవరకు మాజీ సారథి దేశం కోసం ఆడటం కొనసాగిస్తాడని పేర్కొన్నారు. ఇంగ్లాండ్ టూరే రోహిత్‌కు చివరి సిరీస్ అవుతుందంటూ వచ్చిన వార్తలకు ఈ ప్రకటనతో ఎండ్ కార్డు ప‌డింది. మరోవైపు కొత్త చీఫ్ సెలెక్టర్ ఎంపికతో టీమ్ ఇండియా సెలెక్షన్ ప్యానెల్‌లో సరికొత్త మార్పులు మొదలుకానున్నాయి.